జూన్, జూలైలో వర్షాలు అనుమానమే
ఇప్పటికే అడుగంటిన శ్రీశైలం, సాగర్, ఇతర జలాశయాలు
ఉన్న కొద్ది నిల్వలను కాపాడుకోకపోతే కష్టమే: ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ముంచుకురావడంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 జూన్ నుంచి 2027 జనవరి వరకు ఎల్‌నినో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్, జూలైలో వర్షాలు కురవకపోతే తీవ్ర కరువు పరిస్థితులు ఉత్పన్నమై ఆగస్టు నాటికి తాగునీటి కష్టాలు ముదిరిపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అరకొరగా కురిసే వర్షాలు కూడా వచ్చే వానాకాలం సీజన్‌లో ఆలస్యమైతే రానున్న నెలల్లో తాగునీటికి కటకటలాడాల్సిందేనని నీటిపారుదల శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
అడుగంటిన జలాశయాలు: తెలుగు రాష్ట్రాలకు జీవధార అయిన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఇప్పటికే అడుగంటిపోగా, ఇతర జలాశయాల్లో సైతం అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. జంట నగరాలకు తాగునీటితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగు, సాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయాన్ని ఖాళీ చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 39 టీఎంసీల నిల్వలే మిగిలి ఉన్నాయి. నాగార్జునసాగర్ నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలైతే ప్రస్తుతం 158.5 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. సాగర్‌లో కనీసం 128.299 టీఎంసీల నిల్వలుంటే తాగునీటికి పంపింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. 29.92 టీఎంసీల సామర్థ్యమున్న సింగూరు ప్రాజెక్టులో 6.15 టీఎంసీలే ఉన్నాయి. 80.5 టీఎంసీల శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో సైతం 22 టీఎంసీలే మిగిలాయి. 20.18 టీఎంసీలకు గాను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 9.19 టీఎంసీలే మిగిలాయి.
వచ్చే ఏడాది జనవరి వరకు ఎల్‌నినో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందని, లేనిపక్షంలో హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాలకు తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 14న జరగనున్న కృష్ణాబోర్డు సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించాలని కోరుతున్నారు.


