సాగుబడి
ఆరుద్ర కార్తె: జూలై 6 వరకు
ఐఐఎంఆర్‌లో చిరుధాన్యాల విత్తన సంచులు
ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ మంచి దిగుబడిని ఇవ్వగలిగే సీ4 పంటలే చిరుధాన్య పంటలు. ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యల నివారణకు చిరుధాన్యాల ఆహారమే ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో చిరుధాన్యాల సాగును మరింత విస్తరింపజేసేందుకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఐసీఏఆర్ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్) కృషి చేస్తోంది. రైతులు మంచి దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు వాడటం ఎంతో ముఖ్యం.
ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో విత్తుకోవటానికి అనువైన నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సంచాలకులు డాక్టర్ తార సత్యవతి ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.
జొన్న, సజ్జ, రాగు, కొర్ర, అరికె, సామ, ఒరిగ వంటి అన్ని రకాల చిరుధాన్యాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఐఐఎంఆర్ విత్తన శాస్త్రవేత్త డాక్టర్ సూగన్న తెలిపారు. అన్ని రకాల చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సూటి రకం పచ్చజొన్న, కొర్ర (సూర్యనంది) విత్తనాలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. తెల్లజొన్న హైబ్రిడ్ రకాల విత్తనాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
జొన్న వంటి పెద్ద గింజ చిరుధాన్యాలు ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. కొర్ర వంటి చిన్న గింజ చిరుధాన్యాలు ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుందని డా. సూగన్న ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు స్వయంగా వచ్చి రైతులు విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కోసం 040–24599305 నంబరులో పని దినాల్లో ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. మధ్య సంప్రదించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం నంద్యాల, విజయనగరం, పాలెం, రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూలలో కూడా చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


