ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది.
అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరు
ఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్‌లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న.
పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్‌మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి.
సాంకేతిక సాయం
భారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి.
కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్‌ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.
ప్రపంచమంతటా పెను ప్రభావమే!
ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి.
మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.
– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;
– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, హైదరాబాద్


