గిరిజన సాగును ఎలా చూడాలి? | Sakshi Guest Column On Tribal Crop cultivation | Sakshi
Sakshi News home page

గిరిజన సాగును ఎలా చూడాలి?

Aug 11 2026 12:33 AM | Updated on Aug 11 2026 12:33 AM

Sakshi Guest Column On Tribal Crop cultivation

విశ్లేషణ

మైదాన ప్రాంతాల కోసం రాసిన పథకాలను, అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఏజెన్సీ ప్రాంతాలకు యథాతథంగా పంపుతున్నాం. అక్కడి రైతులు కొత్త పద్ధతులు స్వీకరించడం లేదని నివేదికల్లో రాసుకుంటున్నాం. సమస్య రైతులది కాదు; అక్కడి పరిస్థితులను అర్థం చేసు కోలేని మనది. 2025 మార్చిలో తెలంగాణ రైతు కమిషన్‌ ఏర్పాటు చేసిన బృందంతో కలిసి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాం. అక్కడ హైబ్రిడ్‌ మొక్కజొన్న విత్తన పంట దెబ్బతింది. కంకుల్లో గింజ పట్టలేదు. జిల్లా కమిటీ లెక్క ప్రకారం 959 మంది రైతులకు చెందిన 2,178 ఎకరాల్లో పంట నష్టపోయింది. మా దృష్టిని ఆకర్షించింది పంట నష్టం కంటే దాని వెనుక ఉన్న ఏర్పాట్లు, వ్యవస్థల వైఫల్యం.

బాండ్‌ వ్యవసాయం అంటే ఏమిటి?
విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకోవు. స్థానిక ఆర్గనైజర్లతో ఒప్పందం చేసుకుంటాయి. ఆ ఆర్గనైజర్‌ రైతుతో నోటిమాట మీద మాత్రమే ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని అక్కడ బాండ్‌ వ్యవసాయం అంటారు. విత్తనం, ఎరువులు, పురుగుమందులు అప్పుగా ఇచ్చి, పంట కొనుగోలు సమయంలో వసూలు చేసుకుంటాడు. వడ్డీ నెలకు వంద రూపాయలకు అయిదు రూపా యలు– సంవత్సరానికి అరవై శాతం! చట్టం ప్రకారం ప్రతి కాంట్రాక్ట్‌ సాగు ఒప్పందాన్ని మార్కెట్‌ కమిటీలో నమోదు చేయాలి. పురుగు మందులకు బిల్లులు లేవు; అవి అమ్మటానికి లైసెన్సులు లేవు; ఒక చిన్న నోటుపుస్తకంలో పేర్లు మాత్రమే రాశారు. కొన్నిచోట్ల గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేశారు. మందుల డబ్బాల మీద సూచనలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి.

దీని ఫలితం మనుషుల మీద కనిపించింది. పొలంలో పని చేస్తూ విషప్రయోగానికి గురైన ఒక మహిళ చేతులు, కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమైంది. పిచికారీ పనిని పర్యవేక్షించిన ఒక మేస్త్రీ పక్షవాతానికి గురయ్యాడు; వైద్యం కోసం ఆ కుటుంబం మిగిలిన నలభై సెంట్ల భూమిని అమ్ముకుంది. వరుసగా రెండు నష్టాల తరు వాత ముప్ఫై అయిదేళ్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లెవరూ వ్యవస్థ బయట ఉన్నవాళ్లు కాదు. పెద్ద కంపెనీల కోసం విత్తనం పండించినవాళ్లు. అయినా ఒప్పందం లేదు, బిల్లు లేదు, బీమా లేదు, ఫిర్యాదు చేసే చోటు లేదు.

రెండు రకాల గిరిజన వ్యవసాయం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాలు ఒకేలా లేవు. తెలంగాణలో గిరిజన వ్యవసాయం ఎప్పుడో వాణిజ్య వ్యవసాయంగా మారి పోయింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్‌ ప్రాంతాల్లో గోండు, కోలాం కుటుంబాలు గతంలో పండించిన జొన్న, పప్పు ధాన్యాలు, మిశ్రమ పంటల స్థానంలో పత్తి వచ్చింది. ములుగు, భద్రాద్రిలో కాంట్రాక్ట్‌ విత్తన సాగు నడుస్తోంది. రాష్ట్రంలో హెక్టారుకు దాదాపు 253 కిలోల ఎరువులు వాడుతున్నారు; దక్షి ణాది సగటు 164 మాత్రమే. 2019 నాటికి రాష్ట్రంలోని 92 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి; ఆ అప్పులో దాదాపు సగం బ్యాంకులది కాదు, వడ్డీ వ్యాపారులది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కొండ మండలాల్లో పది కుటుంబాల్లో ఏడు ఇప్పటికీ ప్రధానంగా సొంత అవసరాల కోసమే పండిస్తు న్నాయి– రాగులు, కొర్రలు, సామలు, కంది, వరి. కొండ వాలుల్లో పోడు సాగు కొనసాగుతోంది. రసాయనాల వినియోగం తక్కువే. వాణిజ్య పంటలు వచ్చినా అవి బహువార్షిక పంటలు– అరకు కాఫీ, మిరియాలు, పైనాపిల్, పసుపు. ఇక్కడ సమస్య అప్పుల భారం కాదు; తక్కువ దిగుబడులు, మార్కెట్‌ అందుబాటులో లేకపోవడం. అంటే ఒక ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వాణిజ్య వ్యవస్థను నియంత్రించాలి. మరో ప్రాంతంలో ఉన్నదానికి విలువ చేర్చాలి.

పథకాలు ఎందుకు పనిచేయడం లేదు?
రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌ ప్రకారం, ఏ చట్టమైనా షెడ్యూల్డ్‌ ప్రాంతానికి వర్తించకుండా చేయడానికి, లేదా అవసరమైన మార్పులతో వర్తింపజేయడానికి గవర్నర్‌కు అధికారం ఉంది. గిరి జనుల భూమి బదిలీని నియంత్రించే అధికారంతో పాటు, వారికి వడ్డీ వ్యాపారం చేసే వ్యవహారాన్ని నియంత్రించే అధికారం కూడా స్పష్టంగా ఇచ్చారు. ఆ అధికారంతోనే 1960లో షెడ్యూల్డ్‌ ప్రాంతాల వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధన చేశారు. అది ఇప్పటికీ రెండు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉంది. అంటే ములుగులో అరవై శాతం వడ్డీ వసూలు చేసేవాడిని ఆపడానికి అరవై అయిదేళ్లుగా చట్టం అందుబాటులో ఉంది. వాడలేదు.

ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదు అంటే వెంటనే చేయదగినవి మూడు ఉన్నాయి. ఒకటి– షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ప్రతి కాంట్రాక్ట్‌ సాగు, విత్తన ఉత్పత్తి ఒప్పందాన్ని విత్తే ముందే మార్కెట్‌ కమిటీలో నమోదు చేయించడం; ఒప్పంద పత్రం తెలుగులో రైతు చేతిలో ఉండాలి. రెండు– వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధనను అమలు చేయడం; సామగ్రి అమ్మేవాడే అప్పు ఇచ్చేవాడు, పంట కొనేవాడు కూడా అయినప్పుడు ఆ మూడు పాత్రలూ కాగితం మీద కనిపించాలి. మూడు– పట్టా పేరును కాక నిజంగా సాగుచేసేవారిని గుర్తించడం; గ్రామసభ ధ్రువీకరణ ఆధారంగా పోడు సాగుదారు లకు, కౌలుదారులకు, మహిళా రైతులకు రుణం, బీమా, పంట నష్ట పరిహారం అందేలా చూడటం. ఈ మేరకు ఒక ముసాయిదా విత్తన ఉత్పత్తి దారుల రక్షణ చట్టం ప్రభుత్వానికి సమర్పించటం జరిగింది. అది ఇప్పటికీ అమలులోకి రాలేదు.  

ఇది సాధ్యమేనా అంటే – అవును!
అమ్రాబాద్‌లో చెంచు కుటుంబాలతో కలిసి పనిచేసినప్పుడు మిరప పంటలో సీజ¯Œ కు ఇరవై సార్లు కొట్టే పిచికారీలు ఆరు, ఏడుకు తగ్గాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గోండు, కోలాం రైతుల 700 ఎకరాలు సేంద్రియ, ప్రకృతి సాగులోకి మారాయి; రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రభుత్వం మంచిర్యాలలో ఒక సేంద్రియ దుకాణం కేటాయించింది. నారాయణపేటలో సెర్ప్‌ సంస్థతో కలిసి 1,500 ఎకరాలు మార్పు దిశగా వెళ్లగా, 200 ఎకరాల్లో వరి స్థానంలో చిరుధాన్యాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో గిరి సిరి రైతు సంఘం కింద 2,600 ఎకరాలు ప్రకృతి సాగులో ఉన్నాయి; పసుపు, వేరు శనగ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థానికంగానే ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు చోట్లా చేసిన పని ఒకటే. రైతు ఇప్పటికే పండిస్తున్న దానినుంచి మొదలుపెట్టడం. ముందు ప్రమాదకర మందులు తీసేయడం. నీరు తక్కువున్న చోట చిరుధాన్యాలు. పొలం పక్కనే పోషకాహార తోట. మార్కెట్‌ పెట్టుకోవడానికి రైతు సంఘం. ఉత్పత్తి దగ్గరే ప్రాసెసింగ్‌. వీటిలో దేనికీ కొత్త పథకం అవసరం లేదు. చివరగా ఒక మాట. రెండు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్డ్‌ ప్రాంతాల వ్యవసాయ గణాంకాలను విడిగా ప్రచురించడం లేదు. గిరిజన కుటుంబాల ఎరువుల వాడకం, అప్పులు, నేల ఆరోగ్యం, దిగు బడులపై ప్రత్యేకంగా సమాచారం లేదు. ఈ లోటు తీర్చడం ఖరీదైన పని కాదు; చేయాలన్న నిర్ణయం మాత్రమే కావాలి.

డా‘‘ జి.వి.రామాంజనేయులు
వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్‌ఏ) కార్యనిర్వాహక సంచాలకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement