కశ్మీరీలకు పాకిస్తాన్‌పై ప్రేమేం లేదు! | Kashmiris have no love for Pakistan | Sakshi
Sakshi News home page

కశ్మీరీలకు పాకిస్తాన్‌పై ప్రేమేం లేదు!

Aug 10 2026 12:21 AM | Updated on Aug 10 2026 12:21 AM

Kashmiris have no love for Pakistan

ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్‌ పరిస్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అటువైపు గల తమ కశ్మీర్‌ సోదరులు, బంధుమిత్రుల పరిస్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి.

అభిప్రాయం

కశ్మీర్‌ ప్రజలకు పాకిస్తాన్‌పై ప్రేమ లేదు. ఈ మాట అంటున్నది అధీన రేఖకు రెండు వైపులా కశ్మీరీల గురించి కూడా. ప్రస్తుతం రేఖకు ఆవలివైపున గత రెండు నెలలుగా మరోమారు ఆందోళనలు జరగడాన్ని చూస్తున్నాం. అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇటు వైపున గలవారికి కూడా ఎటువంటి ప్రేమ లేదు. వాస్తవం ఇది కాగా... ఇటువారంతా కేవలం మత దృష్టితో పాకిస్తాన్‌పై ప్రేమతో భారత వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారనే ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు.

ఇండియానే ఎందుకు కోరుకున్నారు?
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించి చర్చించేముందు, సందర్భం వచ్చింది గనక మన కశ్మీర్‌ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. వలస పాలన ముగుస్తుండిన 1947లో బ్రిటిష్‌వారు ఇక్కడి సంస్థానాలకు భారత యూనియన్‌లో లేదా పాకిస్తాన్‌లో విలీన మయ్యే స్వేచ్ఛను ఇచ్చారు. అపుడు కశ్మీర్‌ పాలకుడు హిందువు కాగా, ప్రజలు మెజారిటీ సంఖ్యలో ముస్లింలు. రాజు హరిసింగ్‌ గానీ, ప్రజలు గానీ పాకిస్తాన్‌లో చేరేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాన రాజకీయ పక్షం నాయకుడు షేక్‌ అబ్దుల్లా పూర్తిగా ఇండియా పక్షం వహించాడు. కోరుకుంటే పాకిస్తాన్‌లో చేరగల అవకాశం దేశ విభజన చట్ట ప్రకారం ఉండి కూడా, భారతదేశంలో విలీనాన్ని ఎందుకు కోరుకున్నారు? నేను కశ్మీర్‌లోని మొత్తం 22 జిల్లాల్లోనూ మూడుసార్లు విస్తారంగా పర్యటించినపుడు, ఇతర విషయాలను అట్లుంచి ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించాను. నేను వెళ్లిన జిల్లాలలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్‌ లోయతో పాటు పాకిస్తాన్‌ సరిహద్దుల వెట ఉండి ఆ ప్రభావాలు గణనీయంగా గల కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ జిల్లాలు కూడా ఉన్నాయి. రెండుసార్లు వెళ్లినపుడైతే మిలిటెంట్‌ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. మిలిటెంట్లకు పాకిస్తాన్‌ సహాయాలు అందు తూనే ఉన్నాయి. అయిన్పటికీ ఏ దశలోనూ ఒక చిన్న వర్గం తప్ప పాకిస్తాన్‌ను కోరుకోకపోవడం గమనార్హం. 

ఇద్దరికీ సరిపడనిదే!
మొట్టమొదటి వేర్పాటువాద ఆజాద్‌ కశ్మీర్‌ ప్లెబిసైట్‌ సంస్థ ఆ తర్వాత జమ్మూ–కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌గా మారినప్పుడు వారి లక్ష్యం రెండు వైపులా గల కశ్మీరీలను వేరుపరిచి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పడం. ఆ సంస్థను ఇండియా, పాకిస్తాన్‌ రెండూ అణచి వేశాయి. ఆ సంస్థ ముగిసిన తర్వాత కొంత కాలానికి 26 పార్టీలు, సంస్థలతో ఆల్‌ పార్టీ హుర్రియత్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పడింది. నేను ఆ సంస్థ ముఖ్య నాయకులు కొందరితో మాట్లాడాను. విషయం ఏమంటే... లిబరేషన్‌ ఫ్రంట్‌ రెండు దేశాలను వ్యతిరేకించే కశ్మీరీ జాతీయవాద సంస్థ కాగా, హుర్రియత్‌లో కొద్దిమంది మాత్రమే పాకిస్తాన్‌ అనుకూలురు. సామాన్య ప్రజానీకంలో అత్యధికులు పాకి స్తాన్‌కు ఎంతమాత్రం అనుకూలురు కాదు. అదే సమయంలో వారందరికీ ఇండియాపై తీవ్రమైన ఫిర్యాదులున్నాయి. 

ఈ ద్వంద్వ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్లి, తర్వాత స్వాతంత్య్రానంతర వర్తమానంలోకి రావాలి. మొదటి నుంచి హిందూమతం ఉండిన కశ్మీర్‌లోకి క్రీస్తు పూర్వమే బౌద్ధం బలంగా ప్రవేశించింది. అశోకుడు (శ్రీనగర్‌ను స్థాపించింది ఆయనే), కుషాణులు బాగా వ్యాపింప చేశారు. మధ్య ఆసియా వర్తకుల ద్వారా ఇస్లాం వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో సూఫీ యిజం విస్తరించింది. ఈ విధమైన బౌద్ధం, సూఫీయిజం కలగలిసిన ప్రభావాలు కశ్మీరీల విశ్వాసాలు, ఆలోచనలు, సంస్కృతులపై వేసిన బలమైన ముద్రలు నేటికీ ఉన్నాయి. అందువల్లనే వారు జనసంఖ్య రీత్యా మెజారిటీ సున్నీలే అయినా పాకిస్తాన్‌లోని జనాభాతో, అక్కడి పాలకులతో ఏకీభావం లేదు. 1947లో లేదు. ఇప్పటికీ లేదు. అయితే, రెండు వైపులగల జాతి అనే భావన మాత్రం ఉంది. అందుకే కశ్మీర్‌ మొత్తంగా స్వతంత్రం కావాలని ప్రయత్నించిన రోజులలో లిబరేషన్‌ ఫ్రంట్‌కు విస్తారమైన సానుభూతి లభించింది. ఈ భావనలు తెలిసినందువల్లనే కశ్మీర్‌ ప్రతిపత్తిపై ప్లెబిసైట్‌ జర పాలన్న ప్రతిపాదన కొందరు చేయగా, ఇండియాతో పాటు పాక్‌ కూడా వ్యతిరేకించింది. స్వతంత్ర కశ్మీర్‌ వారికి కూడా సరిపడనిదే!

మారని మౌలిక దృష్టి
ఇదంతా చరిత్రతో పాటు, 1947 అనంతరపు తొలినాళ్ల పరిస్థి తులు. ఆ తర్వాతకు వచ్చి, మూడు విషయాలను చూస్తే చిత్రం పూర్తవుతుంది. ఒకటి, పాకిస్తాన్‌పట్ల ఆ తర్వాత కూడా, చివరకు మిలిటెన్సీ కాలంలోనూ జనబాహుళ్యంలో ప్రేమ కలగకపోవడం. రెండు, ఇండియాపైన కూడా ప్రేమ ఏర్పడకపోవడం. అయినప్పటికీ పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఇండియా మెరుగనుకోవడం. మూడవది భవిష్యత్‌ గురించి వారి ఆలోచనలు. ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్‌లో ఉంటూ వచ్చిన పరి స్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అభివృద్ధి, ప్రజల జీవి తాలు, శాంతి భద్రతలు, అప్రజాస్వామికతలు, సైనిక కుట్రలతో పాటు, అటువైపు గల తమ కశ్మీర్‌ సోదరులు, బంధుమిత్రుల పరి స్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి. అటు చేరినా తాము బాగుపడేది ఏమున్నది కనుక అనే ప్రశ్నను నేను అన్నివైపుల నుంచీ విన్నాను. తమ మిలిటెంట్‌ యువకులకు అక్కడి నుంచి సహాయం అందటం వరకు కొంత సానుకూలతను కల్పించినా, మౌలికమైన దృష్టి మాత్రం మారలేదు. 

ఇండియా స్వతంత్రమైన తర్వాత 40 సంవత్సరాల వరకు కశ్మీర్‌లో మిలెటెన్సీ లేదు. నిజానికి ఆ కాలమంతా నేషనల్‌ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డాయి. అభివృద్ధి మృగ్యమై తీవ్ర అసంతృప్తి ఏర్ప డింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. అది చాలద న్నట్లు ప్రజాస్వామిక విధి విధానాలతో నిమిత్తం లేకుండా రాజ కీయ క్రీడలు యథేచ్ఛగా సాగించాయి. కశ్మీర్‌ ఒక సున్నిత స్థితిలో గల సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్‌ అవకాశం కోసం పొంచి ఉన్నదనే స్పృహ సైతం లేకుండా పోయింది.

అటువంటి పరిస్థితులతో ఇక ఓపిక నశించిన ప్రజలు 1987 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రెండింటినీ ఓడిస్తు న్నట్లు ఓట్ల లెక్కింపులో స్పష్టమవుతుండగా... కనీవిని రీతిలో రిగ్గింగ్‌ జరిపి తామే గెలిచారు. పట్టరాని ఆగ్రహానికి గురై మిలిటెన్సీ మార్గం పట్టింది. పాకిస్తాన్‌ ఆ అవకాశాన్ని అందుకుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాలుగా మిలిటెన్సీనైతే గణనీయంగా అణిచి వేశారు గానీ ప్రజలు విశ్వాసాన్ని సంపాదించలేక పోయారు. మధ్యలో ఆ ప్రయత్నాలు జరిగింది వీపీ సింగ్, పీవీ నరసింహా రావుల కాలంలో మాత్రమే. ప్రజలు కూడా వారిని విశ్వసించారు. బీజేపీ రాకతో పరిస్థితి తిరిగి క్షీణమార్గం పట్టింది. 

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement