ఇన్ బాక్స్
ఒకప్పుడు ఒక వార్త ప్రజల ముందుకు రావాలంటే సమాచారం సేకరించడం, దాన్ని పరిశీలించడం, ధ్రువీకరించడం వంటి ప్రక్రియలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక ప్రచురణ వేదికగా మారింది. దీంతో సమాచారం వేగంగా చేరుతోంది. అదే సమయంలో ధ్రువీకరించని సమా చారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఏది ఎక్కువ మందికి చేరాలనేదాన్ని ఇప్పుడు ఎడిటర్ కాదు; ఎక్కువ స్పందన వచ్చే కంటెంట్‌ను ముందుకు నెట్టే అల్గోరిథమ్‌లే నిర్ణయిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ. 2026 మార్చి 16న, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే భారత సైన్యంపై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసినట్లు చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నిజానికి అది మార్చి 14న పీటీఐ రికార్డ్ చేసిన అసలైన ప్రసంగం– ‘భవిష్యత్ భద్రతా సవాళ్లపై సైన్యం సంసి ద్ధత’ గురించి మాట్లాడిన వీడియో. దాని దృశ్యాలను అలాగే ఉంచి, ఏఐ సాయంతో పూర్తిగా వేరే ఆడియో జోడించారు. పీఐబీ ఫ్యాక్ట్–చెక్ యూనిట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్–చెక్ విభాగం రెండూ దీన్ని డీప్ ఫేక్‌గా ధ్రువీకరించి, పాకిస్తాన్ ఆధారిత ప్రచార ఖాతాల నుంచి ఇది వ్యాపించిందని అధికారులు గుర్తించేలోపే, వీడియో లక్షల మందికి చేరి పోయింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నిజమైన వీడియో వచ్చినా ‘ఇది ఏఐతో సృష్టించిందేమో’ అనే అనుమానం కలుగుతోంది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి.
రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ వారి 2025 నివేదిక ప్రకారం 48 దేశాల్లో వార్తలపై ప్రజల నమ్మకం సగటున 40 శాతమే. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు వార్తలను నమ్మడం లేదు. ఇది పదేళ్ల క్రితం కంటే చాలా తగ్గింది. ఎడెల్మన్ వారి సర్వేలో 69 శాతం మంది– ఇది ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారం అని నమ్ముతున్నారు. యునెస్కో కూడా ఇదే విషయం చెబుతోంది– ధ్రువీకరణ లేని సమాచారం భయంకరంగా వ్యాపిస్తోందని!
భారత్‌లో ఇంకా పెద్ద సమస్య. మన దగ్గర అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేవి, షార్ట్ వీడియోలు– ఇవే చాలామందికి వార్తలు. ఎప్పటివో పాత దృశ్యాలు, సంఘటనలు ఇప్పటి వార్తలుగా ప్రచారం జరగడం సాధారణ విషయం అయ్యింది. ఇందువల్ల ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఏదైనా వీడియో లేదా పోస్ట్ చూడగానే ఫార్వర్డ్ బటన్ నొక్కే ముందు, ‘ఇది ఎవరు పోస్ట్ చేశారు, మూలం ఏంటి’ అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అధికారిక ఫ్యాక్ట్–చెక్ వేదికలు, విశ్వసనీయ ధ్రువీకరణ సేవలను ఉపయోగించడం అలవాటు చేసు కోవచ్చు. సమాచారం విషయంలో ఏమాత్రం అస్పష్టత ఉండకూడదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంచలనం కంటే నమ్మదగిన సమాచారాన్ని ప్రోత్సహించాలి. నిజం నత్తలా నడిచినా... దాని బరువు తెలిసిన వాళ్లు దాని వెనుకే ఉంటారు!
– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు


