TECH టమారం
వాన వస్తూ వస్తూ... చిన్న చిన్న ఆనందాలతో పాటు కొన్ని చికాకులను కూడా తెస్తుంది. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు చలి పెరుగుతుందో, ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో అస్సలు అర్థం కాదు. అందుకే, ఇలాంటి వానాకాలపు చికాకులకు చెక్ పెట్టేందుకు కొన్ని క్యూట్ గాడ్జెట్లే ఇవి!
చిన్న సూర్యుడు!
దుప్పటి కప్పుకున్నా సరే... చేతులు మాత్రం చలికి బయటకు రావడానికి ఒప్పుకోవడం లేదా? ఇలాంటి సమయంలో పెద్ద హీటర్ పెట్టి గది నిండా వేడి చేయాల్సిన పనిలేదు. ఈ చిన్న హీటర్ ఉంటే చాలు. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా గోడకు అమర్చేయొచ్చు. ఇందులోని రెండు రకాల గాలి వేగాలతో కావాల్సినంత వెచ్చదనాన్ని వెంటనే పొందొచ్చు. పెద్ద శబ్దం చేయకుండా పనిచేయడం వలన చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. బెడ్‌రూమ్, చిన్న ఆఫీస్, స్టడీ రూమ్, వర్క్‌స్పేస్ వంటి చిన్న ప్రదేశాల్లో వ్యక్తిగత వెచ్చదనం కోసం ఉపయోగపడుతుంది. కేవలం 200 గ్రాముల బరువుండటంతో ఒక చోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్లడమూ ఈజీ. వర్షాకాలంలో చలి పెరిగినప్పుడు... చిన్న గదికి ఇది చిట్టి హీటింగ్ బడ్డీ! ధర రూ.700.
చిల్ బ్రో.. లైట్ తీసుకో!
వర్షాకాలం వచ్చిందంటే చాలు... వాన ఒకవైపు, కరెంట్ కోతలు మరోవైపు! చీకట్లో టార్చ్ కోసం వెతికే టెన్షన్ లేకుండా ఈ చిన్న రీచార్జబుల్ హ్యాంగింగ్ బల్బ్‌ను ఇంట్లో ఉంచుకుంటే చాలు. కరెంట్ పోయిన వెంటనే వెలిగించేయొచ్చు. హుక్‌తో ఎక్కడైనా వేలాడదీయొచ్చు. అవసరమైతే చేతిలో పట్టుకుని తీసుకెళ్లొచ్చు. మూడు లైటింగ్ మోడ్స్ ఉండటంతో అవసరాన్ని బట్టి వెలుతురు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. రెండు గంటలు పూర్తిగా చార్జ్ చేస్తే, దాదాపు 8 గంటల వరకు పనిచేస్తుంది. బలమైన, నీటిని తట్టుకునే డిజైన్ ఉండటంతో ఔట్‌డోర్ వినియోగానికీ పనికొస్తుంది. రెండు బల్బుల ప్యాక్ కావడంతో ఇంట్లో ఒకటి, కారు, ట్రావెల్ బ్యాగ్‌లో మరొకటి పెట్టుకోవచ్చు. ధర రూ. 450 మాత్రమే!
పొగ లేదు, పొయ్యి లేదు... గ్రిల్‌రెడీ!
బార్బెక్యూ తినాలనిపిస్తే బొగ్గులు వెతకాలి... పొయ్యి వెలిగించాలి... పొగతో ఇల్లు నింపాలి! ఇక ఈ హడావుడంతా ఎందుకు? ఈ ఎలక్ట్రిక్ బార్బెక్యూ గ్రిల్ ఉంటే చాలు... ప్లగ్ పెట్టి గ్రిల్ మొదలుపెట్టేయొచ్చు. 2000 వాట్ల పవర్‌తో పనీర్, కబాబ్స్, కూరగాయలు, స్క్యూయర్స్ ఇలా నచ్చినవన్నీ గ్రిల్ చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతను మనకు కావాల్సినంత సర్దుకోవచ్చు. బొగ్గులు, కట్టెలు, పొయ్యి అవసరం లేదు... పొగ కూడా తక్కువగా ఉండేలా రూపొందించారు. కింద ఒక ట్రే ఉండటంతో శుభ్రం చేయడమూ ఈజీ. గ్రిల్లింగ్ ర్యాక్, స్క్యూయర్ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి రకరకాల వంటకాలు సిద్ధం చేసుకోవచ్చు. వంటగదిలోనే కాదు... బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న గ్యాదరింగ్‌లోనూ వాడుకోవచ్చు. అంటే... బార్బెక్యూ కోసం బయటకు వెళ్లాల్సిన పని లేదు. ధర రూ.1,800.


