ట్రెండీమెన్
స్లిమ్‌పుల్!
అందరికీ సిక్స్‌ప్యాక్ హీరోలే నచ్చితే, మరి స్లిమ్‌బాబులను ఎవరు చూస్తారు? సన్నగా ఉండటం క్రైమ్ కాదు, స్టయిల్‌గా లేకపోవడమే సమస్య. అందుకే, మరి స్లిమ్ అబ్బాయిలు కూడా స్టయిలిష్ హీరోల్లా మెరవాలంటే ఈ మూడు గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే!
ఒక్క టీషర్ట్‌తో సరిపెట్టొద్దు... లేయర్లు వేసుకోండి!
ప్లెయిన్ టీషర్ట్ ఒక్కటే వేసుకుని బయటికి వస్తే, మీ బాడీ ఎంత సన్నగా ఉందో అదే హైలైట్ అవుతుంది. అందుకే స్టయిల్‌లో మొదటి మంత్రం... లేయరింగ్! తెల్లటి లేదా సాలిడ్ టీషర్ట్‌పై చెక్స్ షర్ట్ వేసుకుని, బటన్లు మాత్రం వేయొద్దు. ఓపెన్ గా వదిలేస్తే చాలు! ఒక్కసారిగా లుక్‌లో డెప్త్ వచ్చేస్తుంది. చలికాలమైతే హుడీపై డెనిమ్ జాకెట్ లేదా ఓవర్‌షర్ట్ ట్రై చేయండి. చూసేవాళ్లు... ‘జిమ్ మొదలుపెట్టాడేమో!’ అని అనుకునేంత మార్పు ఒక్కసారిగా కనిపిస్తుంది.
స్కిన్నీ జీన్స్‌తో యుద్ధం ఆపేయండి!
సన్నగా ఉన్న అబ్బాయిలు చేసే అతి పెద్ద పొరపాటు– స్కిన్నీ జీన్స్. అవి వేసుకుంటే కాళ్లు జీన్స్‌లో ఉన్నాయా, లేక జీన్స్ కాళ్లకు అతుక్కుపోయాయా అన్న డౌట్ వస్తుంది! దానికి బదులుగా స్ట్రెయిట్ ఫిట్ జీన్స్, రిలాక్స్‌డ్ ఫిట్ ప్యాంట్స్, చినోస్ లేదా కార్గోస్ ఎంచుకోండి. ఇవి బాడీకి సరైన బ్యాలెన్స్ ఇచ్చి, లుక్‌ను కాస్త బల్కీగా చూపిస్తాయి. గుర్తుంచుకోండి... ప్రతి ట్రెండ్ మన కోసం కాదు, మనకు సెట్ అయ్యేదే అసలు ట్రెండ్.
యాక్సెసరీస్‌ను బోల్డ్‌గా ఉంచండి
సన్నగా ఉన్నవాళ్లు మరీ సన్నటి చైన్లు, చిన్న రింగులు, చిన్న డయల్ వాచ్‌లు.. ఇవన్నీ స్లిమ్ లుక్‌ను ఇంకా హైలైట్ చేస్తాయి. కానీ స్టయిల్ కనిపించదు. అందుకే కాస్త పెద్ద డయల్ ఉన్న వాచ్, బోల్డ్ ఫ్రేమ్ సన్ గ్లాసెస్, కొంచెం మందంగా ఉండే బ్రేస్‌లెట్ లేదా చైన్ ఎంచుకోండి. ఇవి మీ లుక్‌కు వెయిట్ ఇవ్వడమే కాదు, కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతాయి.
బాడీని మార్చడానికి నెలలు పడుతుంది... కానీ స్టయిల్‌ను మార్చుకోవడానికి మూడు నిమిషాలు చాలు! కాబట్టి బక్కగా ఉన్నందుకు బాధపడటం మానేసి, సరైన దుస్తులను ఎంచుకోండి. స్టయిల్‌గా కనిపించండి.


