కథాకళి
ఇంటర్ ఫస్టియర్ చదివే అతనికి ఇంకొన్ని వారాల్లో పదిహేడు వస్తుంది. ఆ వయసులో శరీరంలోని హార్మోన్స్ ఉత్పత్తి వల్ల మానసిక, శారీరక అవసరమైన కోరిక పుడుతుంది. ఆ సమయంలో టీనేజర్ ప్రేమలో పడతాడు. అతని ప్రేమయాత్ర మొదలవుతుంది.
అతను తన క్లాస్‌మేట్ వాల్గంటితో ప్రేమలో పడ్డాడు. క్లాస్‌లోని ఇరవై ఏడుమంది అమ్మాయిల్లో వాల్గంటే అతన్ని ఎందుకు ఆకర్షించింది? ఇది సమాధానం లేని ప్రశ్న. ఎవరు ఎవరితో ఎందుకు ప్రేమలో పడతారనే దానికి ఇదమిత్థమైన కారణం పడ్డవాడితో సహా ఎవరూ చెప్పలేరు. దానికి ‘కెమిస్ట్రీ’ అనే ఆధునిక జవాబు స్థిరపడింది.
ఆమె తనని ప్రేమిస్తోందా అనే ప్రశ్న అతన్ని తొలచసాగింది. వాల్గంటి అతని మీద ఎలాంటి ప్రత్యేక ఆసక్తిని చూపించలేదు. ప్రేమయాత్రలో ఒకరు తమ ప్రేమని తెలియచేస్తే, రెండోవారు దాన్ని అంగీకరించాలి. అప్పుడు అది కొనసాగుతుంది. తిరస్కరిస్తే ఆ ప్రేమయాత్ర అంతటితో ముగుస్తుంది.
అతనికి తన ప్రేమని ఆమెకి తెలియచేయాలని ఉంది. కాని ఆ ధైర్యం చేయలేకపోయాడు. టీచర్‌కి చెప్తే? తిరస్కరిస్తే? తనని చెడ్డవాడిగా భావిస్తే లాంటి భయాలు అతనిలో కలిగాయి.
క్లాస్‌లోకి రాగానే ఆమె వచ్చిందా అని చూస్తాడు. కనపడకపోతే ‘అసలు ఇవాళ వస్తుందా?’ అనే అనుమానం అతన్ని బాధిస్తుంది. ఆమె వస్తే ఆనందం కలుగుతుంది. ఆమె ఎదురు పడినప్పుడు రెండు మూడు సార్లు చిరునవ్వులు నవ్వాడు. ఆమె అతనివైపు చూడకపోవడంతో అది గమనించలేదు. ఆమెకి తన ప్రేమ గురించి ఎలా తెలియచేయాలో అతనికి తోచలేదు. మధ్యవర్తి ఆలోచన వచ్చింది. కాని మిత్రుడి దగ్గర మాటలు నోట్లోంచి బయటికి రాలేదు.
ఓరోజు వాల్గంటి లంచ్‌లో కాలేజీ బయట బండి దగ్గర పానీపూరీ తింటూ కనిపించింది. అతను కూడా వాటిని తిన్నాడు. మొదటిసారి ఆమెతో మాట్లాడాడు.
‘‘నీ డబ్బు కూడా నేను పే చేస్తాను.’’ అతను చెప్పాడు.
‘‘ఒద్దు.’’ ఆమె జవాబు చెప్పింది.
తన డబ్బు చెల్లించి ఆమె వెళ్ళిపోయింది.
చివరికి అతను ఆమెకి ఉత్తరం ద్వారా తన ప్రేమని తెలియచేయాలని అనుకున్నాడు. నోట్ బుక్‌లోంచి ఓ కాగితం చింపి రాశాడు.
‘డియర్ వాల్గంటి,
నువ్వు నాకు ఎందుకు నచ్చావ్ అని అడక్క. నా దగ్గర జవాబు లేదు. కాని నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు క్లాస్‌కి రాకపోతే నాకు చాలా డల్‌గా ఉంటుంది. నీకు నా ప్రేమని తెలియచేయకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యు వెరీ మచ్...’’
తర్వాత ఏం రాయాలో తెలీలేదు. దాన్ని మడిచి జేబులో ఉంచుకున్నాడు. ఆ ఉత్తరం ఎప్పుడు ఆమెకి ఇద్దామా అని తహతహగా ఉంది. అది అతని జేబులోనే ఉంది. అంతా చూస్తూండగా దాన్ని ఆమెకి ఇవ్వలేకపోతున్నాడు. ఆమె ఒంటరిగా చిక్కడం లేదు.
∙∙
మర్నాడు ఓ సంఘటన జరిగింది. క్లాస్‌లోని టీచర్ ఓ విద్యార్థితో చెప్పాడు.
‘‘నువ్వు ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళు. ఆయన పిలుస్తున్నారు.’’
‘‘దేనికి సర్?’’ అతను లేచి నించుని అడిగాడు.
‘‘తిరిగి వచ్చాక నువ్వే దానికి జవాబు చెప్పు.’’ ఆయన చెప్పాడు.
అతను వెళ్ళిన పావుగంట తర్వాత వచ్చాడు. అతని మొహం వాడిపోయి ఉండటం అంతా గమనించారు. అతను తలవంచుకొని కూర్చున్నాడు. టీచర్ అతన్ని ఎందుకని అడగలేదు. అతనూ చెప్పలేదు. తర్వాత తోటి విద్యార్థులకి ఆ విషయం తెలిసింది. తమ క్లాస్‌మేట్ మరో క్లాస్ అమ్మాయికి ప్రేమలేఖని రాస్తే ఆమె దాన్ని తన తండ్రికి చూపించింది. ఆయన దాంతో ప్రిన్సిపాల్ దగ్గరకి వచ్చాడు. ఆవిడ ఆ ఉత్తరం చూసి మండిపడి, వెంటనే అతని తల్లితండ్రులని పిలిపించి వారి ముందే నానా చివాట్లు వేసింది.
‘‘ఇంకోసారి ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపిస్తాను.’’ హెచ్చరించింది.
‘‘ఇష్టం లేకపోతే ఉత్తరం చింపేయాలి కదా?’’ కొందరు చెప్పారు.
‘‘నోటితో చెప్తే అంత దూరం వచ్చేది కాదుగా.’’ మరికొందరు చెప్పారు.
అతను తన జేబులోని లేఖని చింపి డస్ట్ బిన్ లో పడేశాడు. ఆ తర్వాత తన ప్రేమని వాల్గంటికి తెలియచేసే ప్రయత్నాన్ని విరమించుకోవడంతో అతని ప్రేమయాత్రకి అంతరాయం కలిగింది. ప్రేమ ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. ప్రేమలో పడి దాన్ని వ్యక్తం చేయకపోవడం ఎంత దుర్భర పరిస్థితి అనేది అతనికి అర్థమైంది.
త్వరలోనే ఇంటర్ ఫస్టియర్ చివరికి వచ్చింది. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పరీక్షలయ్యాక వాళ్ళ ప్లాన్స్ గురించి చెప్పుకుంటున్నారు. అతనికి మాత్రం సంతోషంగా లేదు. ఆఖరి క్లాస్ అయ్యాక అతను కాలేజీ ఆవరణలోంచి బస్ స్టాప్‌కి వెళ్ళాడు.
అక్కడ వాల్గంటి, మరికొందరు అమ్మాయిలు, అబ్బాయిలు నిల్చుని ఉన్నారు. అతన్ని చూడగానే వాల్గంటి చిరునవ్వు నవ్వింది. అతనూ బదులుగా నవ్వాడు.
‘‘కాఫీ తాగుదామా? కెఫేకి వెళ్దాం రా.’’ ఆమె అతని దగ్గరికి వచ్చి చెప్పింది.
‘‘కెఫేకి?’’ తడబడుతూ అడిగాడు.
‘‘అవును. ఐ థింక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యు.’’
ఆమె నవ్వింది. ఆ బస్ స్టాప్ నుంచి ‘‘24/7 కెఫే’’ కి అతని చేతిని పట్టుకుని నిర్భయంగా నడిచింది.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి


