అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి అమెరికన్ చరిత్రకారుడు, రచయిత మైకేల్ బెష్లోస్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:
విశ్వగురు
ఒక చరిత్రకారుడిగా, ఒక చిన్న రాజకీయ–చారిత్రక చిత్రాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. మీలో చాలా మంది 21వ శతాబ్దంలో జన్మించారు. అమెరికాలో జన్మించినవారు 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల ప్రభావంలో పెరిగారు. 1814లో అమెరికా క్యాపిటల్ భవనం, వైట్ హౌస్‌కు బ్రిటిష్ సైన్యం నిప్పంటించిన తర్వాత... యూఎస్‌ఏ భూభాగంపై జరిగిన తొలిపెద్ద విదేశీ దాడి అదే. మీరు పెరుగుతున్న సమ యంలో అమెరికా ప్రభుత్వం ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో రెండు దీర్ఘకాల యుద్ధాలు చేసింది. నా కంటే ముందు తరాలకు మాత్రం అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థంగా కనిపించేది. అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, హ్యారీ ట్రూమన్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించారు.
వ్యోమగాములను చంద్రుడిపైకి!
1960ల ప్రారంభంలో యువతకు ఫెడరల్ ప్రభుత్వం అంటే దేశంలో ఆధునిక రహదారులు నిర్మించడం, అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి గొప్ప విజ యాలు గుర్తుకు వచ్చేవి. అప్పట్లో సోవియట్ యూనియన్‌తో జరుగుతున్న పోటీలోనూ అమెరికా ముందంజలో ఉండేది. 1965లో అధ్యక్షుడు, కాంగ్రెస్ కలిసి ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఎంతో గౌరవంగా భావించిన ఆ చట్టమే... 1965 ఓటింగ్ హక్కుల చట్టం. మీ తరం మాత్రం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోని మరో కోణాన్ని కూడా చూసింది. వియత్నాం యుద్ధంలో వేలాది మంది యువ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని మీరు చదివారు. అలాగే మీ కళ్ల ముందే ధనికులు–పేదల మధ్య అంతరం పెరగడం చూశారు. ఎంతో మంది అమెరికన్లు తమ ‘అమెరికన్ డ్రీమ్‘ సాధించే అవకాశాన్ని కోల్పోవడమూ గమనించారు. కరోనా మహమ్మారి అనే విషాదాన్ని మనమందరం అనుభవించాం. ఆ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మన జీవి తాలపై ఉంది. ఆ వ్యాధి వల్ల పది లక్షలకు పైగా అమెరికన్లు మరణిస్తారని అప్పట్లో మనలో ఎవరైనా ఊహించామా? ఇప్పుడు మనం అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమావేశమయ్యాం. ఒక్కసారి చరిత్రలోకి చూస్తూ... అమెరికాను బలంగా నిలబెట్టిన ఆరు గొప్ప సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటున్నాను.
మొదటి విలువ–చట్టం అందరికీ సమానం:
నా దృష్టిలో మొదటి గొప్ప సంప్రదాయం చట్ట పరిపాలన (రూల్ ఆఫ్ లా). ప్రతి పౌరుడికి సమాన న్యాయం లభించడం. న్యాయ వ్యవస్థలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండకపోవడం. అలాగే ఎవరికీ ప్రత్యేక శిక్షలు కూడా ఉండకపోవడం. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే సూత్రాన్ని మనం ఎప్ప టికీ కాపాడుకోవాలి.
రెండో సంప్రదాయం–స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు:
ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించే అవకాశం కలిగి ఉండాలి. బ్రిటన్ రాజరిక వ్యవస్థలా కాకుండా, అమెరికా వ్యవస్థాపకులు దేశ పాలనా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. వారు ప్రభుత్వ పని తీరును ఓటు ద్వారా అంచనా వేస్తారు. ఎన్నికలు అంటే అదే. యుద్ధం జరిగినా ఎన్నికలు ఆగలేదు. అమెరికా అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎన్నికలు రద్దు చేయాలని కొంతమంది మేధావులు సూచించారు. కొంతమంది మరింత ముందుకెళ్లి, ఫెడరల్ సైన్యాన్ని రాష్ట్రాల్లో మోహరించి, పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలనీ, అవసరమైతే మార్షల్ లా కూడా అమలు చేయాలనీ కోరారు. కానీ అంతర్యుద్ధం సమయంలో అబ్రహాం లింకన్, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూజ్‌వెల్ట్ కేవలం ఒకే వాక్యంలో సమాధానం చెప్పారు: ‘ఎన్నికలు యథావిధిగా జరగాలి’. అలా చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో, ఎంత స్థిర మైనదో ప్రపంచానికి చూపించాలని వారు కోరుకున్నారు.
మూడో విలువ – నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ:
మూడో గొప్ప సంప్రదాయం ఏమిటంటే... దేశ వ్యవస్థాప కులు నిజాయితీ, పారదర్శకత, సామర్థ్యం, నైతికత, కరుణ, మర్యాద, త్యాగస్ఫూర్తి వంటి విలువలతో నడిచే రాజకీయ వ్యవస్థను కలగన్నారు. అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ, రోనాల్డ్ రీగన్ తరచూ అమెరికాలోని తొలి కాలనీ గవర్నర్ జాన్ విన్‌త్రోప్ చెప్పిన మాటలను గుర్తు చేసేవారు. ఆయన ఇలా చెప్పారు: ‘ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోంది. కాబట్టి మనం కొండపై వెలిగే నగరంలా ఆదర్శంగా ఉండాలి’. ఫిలడెల్ఫియా లోని వాల్‌నట్ స్ట్రీట్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ ఒక గొప్ప కల కనేవారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన, మిత వ్యయంతో, గౌరవప్రదంగా, సమర్థవంతంగా పనిచేసే రాజ కీయ వ్యవస్థ ఏర్పడితే... ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని ఆయన నమ్మారు.
నాలుగో విలువ–ప్రతి పౌరుడిలో నాయకత్వం ఉండాలి:
దేశానికి నాయకత్వం అనేది కేవలం వాషింగ్టన్ డి.సి.లోని ప్రభుత్వానికే పరిమితం కాకూడదు. 1776లో బ్రిటన్ లో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాజే తీసుకునేవాడు. కానీ అమెరికా వ్యవస్థాపకులు వేరే విధంగా ఆలోచించారు. ఒకవేళ ప్రజలకు అధ్యక్షుడు, కాంగ్రెస్ లేదా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే... వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దేశాన్ని సరైన దిశలో నడిపించాలని ఆశించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఒక గొప్ప మాట చెప్పేవారు: ‘అమెరికాలో అత్యంత గొప్ప హోదా ‘మిస్టర్ ప్రెసిడెంట్’ కాదు. ‘మిస్టర్ సిటి జన్’(పౌరుడు)! అమెరికా రాజ్యాంగం ప్రకారం... ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలి.
ఐదో విలువ – చరిత్రకారులు, మేధావుల బాధ్యత:
ఐదో సంప్రదాయం... అమెరికా సమాజంలో చరిత్రకా రులు, పరిశోధకులు, మేధావులకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దేశ వ్యవస్థాపకులు విమర్శ కూడా ప్రజాస్వామ్యానికి అవసర మేనని భావించారు. రాజరిక వ్యవస్థల్లో, నియంతృత్వ పాలనల్లో కనిపించేలా కాకుండా... అమెరికా వ్యవస్థాపకులు నిరంతర ఆత్మపరిశీలన ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని విశ్వసించారు. దేశాన్ని పొగిడేవారికే కాదు... దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా విమర్శించేవారికీ సమాన గౌరవం ఇవ్వాలని నమ్మారు. గొప్ప అమెరికన్ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన చెప్పిన అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే... ‘ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే’!
కానీ 2026లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు తమకు అను కూలంగా మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్కస్‌లో చెప్పినట్లు చెప్పే విదూషకుల్లా వారు ప్రవర్తించాలని ఆశిస్తున్నారు. అమెరికా చరిత్రలో జరిగిన తప్పులు, లోపాలు బయటపడితే వాటిని పట్టించుకోవద్దని లేదా వాటికి సాకులు చెప్పాలని వారు కోరుతున్నారు. అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. చరిత్రను మార్చే ప్రయత్నాలు మరింత ప్రమాదకరం. కొంతమంది రాజకీయ నాయకులు... నల్లజాతి చరిత్రలోని కీలకమైన అంశాలను తగ్గించి చూపాలని, లేదా పూర్తిగా తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అది అమెరికా విలువలకు విరుద్ధం.
ఆరో విలువ – జాతీయ ఐక్యత:
నేను చెప్పబోయే ఆరు గొప్ప సంప్రదాయాల్లో చివరిది... జాతీయ ఐక్యత. అమెరికా వ్యవస్థాపకులు ప్రజలు రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అంగీకరించారు. వారు పరస్పరం చర్చించాలి, వాదించాలి. కానీ చివరికి ఒకేదేశ ప్రజలమనే భావనను కోల్పోకూడదని ఆశించారు. బ్రిటిష్ రాజరికంలో లాగా రాజభవనం నుంచి ఆదేశాలు రావడం కాకుండా... ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయించాలని వారు విశ్వసించారు. వ్యవస్థాపకులు అధ్యక్షుడిని ప్రభుత్వ అధినేత గానే కాకుండా, దేశ రాజకీయ నాయకుడిగానూ రూపొందించారు. జార్జ్ వాషింగ్టన్‌ను ఆదర్శంగా తీసుకొని, ఎప్పటి కప్పుడు దేశాన్ని ఏకం చేసే నాయకులు రావాలని వారు ఆశించారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘అమెరికా అనేది ఒక అందమైన రంగురంగుల మొజాయిక్’(అందమైన చిత్రం) అన్నారు. అంటే... భిన్న సంస్కృతులు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఉద్దేశం. అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా... ‘పరస్పర ప్రేమ, అనుబంధాలే మనందరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి’.


