మోసపోయినా మంచితనం వదలొద్దు! | Guest Column Special Story On Never Lose Your Kindness | Sakshi
Sakshi News home page

మోసపోయినా మంచితనం వదలొద్దు!

Aug 8 2026 4:18 AM | Updated on Aug 8 2026 4:18 AM

Guest Column Special Story On Never Lose Your Kindness

జీవితంలో మనల్ని బాధించినవాళ్లు రెండు విషయాల్లో ఒకదాన్ని తప్పకుండా తీసుకెళ్తారు. ఒకటి మన ప్రశాంతతను, రెండోది మన మంచితనాన్ని. ప్రశాంతత కొంతకాలానికి తిరిగి వస్తుంది. కానీ మంచితనం పోతే మనల్ని మనమే కోల్పోతాం. ఎందుకంటే, బాధ మనిషిని రెండు రకాలుగా మారుస్తుంది.

తాను అనుభవించిన గాయాలను ఇతరులకూ పంచడం మొదలుపెట్టడం అనేది ఒక రకమైతే... తాను అనుభవించిన బాధ ఇంకెవరికీ కలగకూడదనే భావనతో జీవించడం రెండో రకం. ఈ రెండో రకమైన మనుషులే నిజంగా అరుదు. వాళ్లు కూడా మోసపోతారు. వాళ్లూ కూడా విరిగిపోతారు. వాళ్లూ కన్నీళ్లు పెడతారు. కానీ తమలోని మంచి మనిషిని మాత్రం కోల్పోరు. ఎందుకంటే, చెడ్డవాడిగా మారడానికి ఒక్క గాయం చాలు, మంచి మనిషిగా మిగిలి పోవడానికి మాత్రం గొప్ప హృదయం కావాలి.

విజయవంతులైన మనుషులు చాలామంది కనిపిస్తారు. తెలివైన వాళ్లు కూడా కనిపిస్తారు. కానీ, బాధను అనుభవించిన తర్వాత కూడా ఎవరికీ బాధ కలిగించకుండా జీవించే మనుషులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. వాళ్ల జీవితంలో ఎంత చెడు ఎదురైనా, వాళ్లలోని మంచిని కోల్పోకపోవడమే వాళ్ళ వ్యక్తిత్వంలోని గొప్పదనం. అందుకే, బాధ హృదయాన్ని తాకినా, హృదయంలో ద్వేషానికి స్థానం ఇవ్వకుండా జీవించగలగడమే నిజమైన విజయం.

ముందుగా క్షమాపణ చెప్పేవాడు ధైర్యవంతుడు. ముందుగా క్షమించేవాడు బలవంతుడు. ముందుగా మర్చిపోయే వాడు ప్రశాంతంగా జీవించగలడు. తనను బాధించిన తర్వాత కూడా మంచి తనాన్ని ఎంచుకునే మనిషి ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యక్తి.
– కొత్త కృష్ణవేణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement