దొంగలున్నారు జాగ్రత్త! | Guest Column Devotion And Spiritual Life Story | Sakshi
Sakshi News home page

దొంగలున్నారు జాగ్రత్త!

Aug 7 2026 1:36 AM | Updated on Aug 7 2026 1:36 AM

Guest Column Devotion And Spiritual Life Story

దొంగలు ధనాన్ని దోచుకు వెళ్తారు. ధనమంటే నగదు మాత్రమే కాదు. ధన కనక వస్తు వాహనాల రూపంలో ఉండే విలువైన వస్తువులన్నింటికీ దొంగల వల్ల ప్రమాదమే. కొందరు ధనం లాగేస్తారు. కొందరు వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తారు. కొందరు కొత్త తరం దొంగలు బ్యాంకు ఖాతాల్లో ధనాన్ని చప్పుడు లేకుండా లాగి వేయగల బుద్ధిశాలులు! అయితే జీవితంలో విలువైనవి వస్తు రూపంలో ఉండనివి కూడా చాలా ఉన్నాయి. శీలమూ, సౌందర్యమూ, మేధస్సూ, ధర్మబుద్ధీ, సిగ్గూ, లజ్జా, వినయమూ, సహనమూ, ఆ మాటకొస్తే ప్రాణమూ– ఇవన్నీ రూకలలో వెలగట్టలేని నిధులే. వీటిని తస్కరించటంలో విశేషమైన కౌశల్యం కల దొంగలున్నారు (అంటాడు, మహాభారతంలో విదురుడు).

జరా రూపం హరతి హి, ధైర్యం ఆశా. ముసలితనం అనే దొంగ, సౌందర్యం అనే ధనాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, తరలించుకు పోగలడు. అలాగే దురాశ అనే దొంగ, మనిషి ధీరత్వాన్నీ, ‘పెద్దమనిషి’తనాన్నీ నొక్కేయగలదు. ఆశలో చిక్కుకొన్నవాడు లేకితనానికీ, చవకబారుతనానికీ దిగజారి, నగుబాటు పాలవటం లోకంలో మామూలే కదా! మృత్యుః ప్రాణాన్‌ హరతి, ధర్మచర్యాం అసూయా. మృత్యువు, తనకు అనుకూలమైన సమయం వచ్చేదాకా వేచి ఉండి, అందరూ చూస్తుండగానే, ప్రాణాలను హరించుకుపోతుంది. ధర్మాత్ముడి ధర్మ బద్ధత అనే సంపదను, అసూయ అపహరించేస్తుంది. దుర్యోధనుడిని చూడండి.

క్రోధః శ్రియం, శీలం అనార్యసేవా. క్రోధం అనే దొంగ మనసులో చొరబడితే, మనిషి వివేకం కోల్పోయి, పంతాలనీ పోట్లాటలనీ, కక్షలనీ కోర్టులనీ, తన సంపదను ఆ దొంగవాడికి సమర్పించుకొంటాడు. అలాగే దుష్టసాంగత్యం అనే చోరుడు, శీలాన్ని దోపిడీ చేసి, నిప్పులాంటి మనిషిని నికృష్టుడిగా మిగులుస్తాడు. కామం అన్న పిశాచి దొంగ, మనిషిలో సిగ్గునూ, లజ్జనూ కాజేసి, ఖాళీ చేస్తాడు. అందరికంటె ప్రమాదకరమైన పెద్ద దొంగ ‘అభిమానం’– అంటే అహంకారం. అది సర్వాన్నీ దోచుకు వెళ్ళగల దోపిడీ దొంగ. సర్వం ఏవ అభిమానః (హరతి), సందేహం లేదు. – ఎం. మారుతి శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement