ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
భక్తి
ధర్మదేవత అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వనీదేవతల అంశతో నకుల సహదేవులు– శతశృంగ పర్వతంపై తన ఇరువురు భార్యలైన కుంతి, మాద్రిలతో కాలం గడిపిన రోజులలో– పాండురాజుకు కలిగిన సంతానం. శాపకారణంగా పాండు రాజు, మాద్రి మరణించిన తరువాత పదిహేడు రోజులకు, పాండు రాకుమారులు ఐదుగురితో ధృత రాష్ట్రుడి వద్దకు చేరింది కుంతి.
శతశృంగ పర్వతం నుండి తోడుగా వచ్చిన మునిజనం, అక్కడ జరి గిన సంగతులను ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పి, బాలురుగా ఉన్న పాండుపుత్రులు ఐదుగురిని, కుంతిని ధృతరాష్ట్రు డికి అప్పగించి వెళ్ళిపోయారు. అప్పుడు వారిని రాజభవనంలోకి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్ళినవారిలో, పాండు పుత్రుల ముత్తమ్మ సత్యవతి, నాన్నమ్మలు అంబిక, అంబాలిక కూడా ఉన్నారు. స్వాగత కార్యక్రమాలన్నీ ముగిశాక, రాజప్రాసాదంలో ఎవరెవరి గదులలోకి వారు వెళ్ళి స్థిరపడినాక, వ్యాసభగవానుడు తన తల్లి అయిన సత్యవతితోనూ, మరదళ్ళయిన అంబిక, అంబాలికలతోనూ ఇలా అన్నాడు (ఆంధ్ర మహాభారతం, పంచమాశ్వాసం):
క. క్రూరులు విలుప్త ధర్మా
చారులు ధృతరాష్ట్రసుతు లసద్ వృత్తులు ని
ష్కారణవైరులు వీరల
కారణమున నెగ్గు పుట్టు గౌరవ్యులకున్.
ధృతరాష్ట్రుడి కొడుకులు క్రూరమనస్కులు, ఏ కారణం లేకుండానే వైరానికి దిగేటటువంటివారు, ధర్మబద్ధ నడవడి లేనటువంటివారు. వాళ్ళ వలన కౌరవకులానికి చాలా గొప్ప హాని జరగనుంది. ‘దాని ధృతరా
ష్ట్రుండు తాన యనుభవించుంగాన మీ రీ దారుణంబు జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుం’ డని చెప్పి వెళ్ళి పోయాడు. కొడుకు మాటలను విన్న సత్యవతి, భీష్ముడికి విదురుడికి చెప్పి, కోడళ్ళైన అంబిక, అంబాలికలను వెంట తీసుకుని తపోవనానికి వెళ్ళిపోయింది. అక్కడ ఉంటూనే వాళ్ళు ముగ్గురూ కొంత కాలం తరువాత ప్రాణాలను వది లారు. చివరికి వ్యాసుడు చెప్పిందే జరిగింది. పర్యవసానాన్ని ధృతరాష్ట్రుడు ఒక్కడే చివరిదాకా అనుభవించాడు.
– భట్టు వెంకటరావు


