కృతజ్ఞత: పరిపూర్ణ వ్యక్తిత్వానికి తొలిమెట్టు! | Gratitude is The first step towards a complete personality | Sakshi
Sakshi News home page

కృతజ్ఞత: పరిపూర్ణ వ్యక్తిత్వానికి తొలిమెట్టు!

Sep 21 2026 4:47 AM | Updated on Sep 21 2026 4:47 AM

Gratitude is The first step towards a complete personality

తల్లి కేవలం జన్మనిచ్చే దేహం కాదు, అది ఒక పవిత్ర క్షేత్రం. తొమ్మిది నెలలు తన రక్తాన్ని పాలుగా మార్చి, మనిషికి ప్రాణం పోసిన మొదటి గురువు అమ్మ. సంస్కారం గర్భం నుండే మొదలవుతుంది. కాయను కాపాడే తొక్కలా, విత్తనాన్ని రక్షించే పొరలా అమ్మ ప్రేమ బిడ్డను నిరంతరం అంటిపెట్టుకుని ఉంటుంది. నేటి యాంత్రిక జీవనంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే, అది తల్లి ప్రేమను తూకం వేస్తున్న అజ్ఞానానికి నిదర్శనం. 

అమ్మ మన అస్తిత్వం
అమ్మ పాదాల చెంత ఉన్నంత ప్రశాంతత ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. కష్టకాలంలో అమ్మ ఇచ్చే ఒక ఓదార్పు మాట, వేల కోట్ల విలువైన ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మను గౌరవించడం అంటే, మన అస్తిత్వాన్ని మనం గౌరవించుకోవడమే.

అదృశ్య శ్రమకు చిహ్నం తండ్రి
తండ్రి భుజంపై కూర్చుంటేనే కదా పసివాడు ఈ లోకాన్ని చూడగలుగుతాడు! కన్నబిడ్డ భవిష్యత్తు కోసం తన కలలను, శ్రమను ధారపోసే అద్భుత శిల్పి నాన్న. నాన్న కన్నీళ్లు ఎవరికీ కనిపించవు, కానీ ఆయన పడే కష్టం ఇంటి పునాదిలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎండకు ఎండి, వానకు తడిసి మనకు నీడను ఇచ్చే ఇంటి కప్పులా తండ్రి శ్రమ అదృశ్యంగా ఉంటుంది. తండ్రి వేలు పట్టుకుని నడక నేర్చిన వ్యక్తి, పదిమందిలో తలెత్తుకుని బతకడమే ఆయనకు ఇచ్చే అసలైన కృతజ్ఞత. సంక్షోభ సమయాల్లో నాన్న చూపే స్థితప్రజ్ఞత, నేటి యువత నేర్చుకోవాల్సిన గొప్ప జీవన నైపుణ్యం. నాన్న మాట ఒక శాసనం కాదు, అది మన బాగుకోసం చేసే ఒక దిశానిర్దేశం.

కృతజ్ఞతే అసలైన సంపద
నేటి పోటీ ప్రపంచంలో కృతజ్ఞత)అనేది మానసిక ఆరోగ్యానికి పరమౌషధం. మన ఎదుగుదలలో తోడ్పడిన ఈ ముగ్గురిని నిత్యం స్మరించుకోవడం వల్ల అంతరంగాన అహంకారం నశించి, వినమ్రత పెరుగుతుంది. బావిలోని నీరు తోడేకొద్దీ ఊరుతుంది; కతజ్ఞత పెరిగేకొద్దీ వ్యక్తిత్వం వికసిస్తుంది. అపజయాలు ఎదురైనప్పుడు అమ్మ భరోసా, నాన్న ధైర్యం, గురువు మార్గదర్శకత్వం కన్నా గొప్ప అస్త్రాలు లోకంలో లేవు. వీరే మన మూలాలు, వీరే మన జీవన నిధులు. మూలాలు లేని సౌధం చిన్న గాలివానకే కుప్పకూలుతుంది; కానీ ఈ ‘త్రిదేవతల’ ఆశీస్సులున్న వ్యక్తి అజేయుడిగా నిలుస్తాడు.

ఆచార్యదేవో భవ: జ్ఞాన నేత్రం
తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తాడు. అక్షర జ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వరకు నడిపించే దివిటీ ఆచార్యుడు. గురువు లేని విద్య, చుక్కాని లేని నావ వంటిది. చీకటి గదిలో వెలుగునిచ్చే దీపంలా, అజ్ఞానపు పొరలను తొలగించి జ్ఞాననేత్రాన్ని తెరిపించే శిల్పి గురువు. నేడు గూగుల్‌లో సమాచారం దొరకవచ్చు, కానీ దాన్ని ఎలా వినియోగించాలో నేర్పే సంస్కారం గురువు వద్దే దొరుకుతుంది. విజ్ఞానానికి వివేకాన్ని జోడించి, వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసే శిల్పి గురువు. గురువును గౌరవించడం అంటే, విజ్ఞానాన్ని గౌరవించడమే..

 – కె. భాస్కర్‌ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement