ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే? | El Alto, Bolivia High Altitude City Travel | Sakshi
Sakshi News home page

ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే?

Sep 21 2026 9:04 AM | Updated on Sep 21 2026 9:11 AM

El Alto, Bolivia High Altitude City Travel

ట్రావెల్‌

ఎల్‌ ఆల్టో, బొలీవియా, సౌత్‌ అమెరికా

సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరాల్లో ఒకటైన ఎల్‌ ఆల్టోలో లైఫ్‌ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి చాలా మంది దక్షిణ అమెరికాలోని బొలీవియాలో ఉన్న ఎల్‌ ఆల్టోకు వెళ్తుంటారు. లా పాజ్‌ నగరానికి సమీపంలో ఉన్న ఈ నగరం.. ఎత్తైన ప్రాంతాల్లో ప్రజల దైనందిన జీవితం ఎలా ఉంటుందో పరిచయం చేస్తుంది.

విశాలమైన రహదారులు, ఇటుక భవనాలు, కలర్‌ఫుల్‌ మార్కెట్‌ స్ట్రీట్స్, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఎల్‌ ఆల్టో ప్రత్యేకత. కేబుల్‌ కారులో ప్రయాణిస్తే నగరం విస్తరించిన తీరు, కొండలు, రహదారులపై రాకపోకలు మరో కోణంలో కనిపిస్తాయి. మార్కెట్లలో స్థానికులు తమ రోజువారీ పనుల్లో బిజీగా కనిపిస్తారు.

ఎల్‌ ఆల్టో వైబ్‌ను ఫీల్‌ అవ్వాలంటే కేబుల్‌ కారులో ప్రయాణిస్తే సరిపోతుంది అంటారు. ఇక్కడి మెర్కాడో 16 డి జులియో మార్కెట్‌లో స్థానికుల సందడి కనిపిస్తుంది. సమీపంలోని లా పాజ్‌ నగరం, వల్లే డి లా లూనా ప్రాంతాలను కూడా ట్రావెల్‌ లిస్టులో యాడ్‌ చేసుకోవచ్చు. ఎల్‌ ఆల్టోలో మన సమోసాల్లా ఉండే సాల్టెనాస్‌ను వేడివేడిగా ఆస్వాదించవచ్చు. ఉదయాన్నే హాట్‌ డ్రింక్‌తో పాటు స్వీట్‌గా ఉండే ఆపి కాన్‌ పాస్టెల్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. ఎత్తైన ప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణం, నగర దృశ్యాలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.

ఎప్పుడు వెళ్లాలి?
ఎల్‌ ఆల్టోలో మే నుంచి అక్టోబర్‌ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఈ సమయంలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉండటంతో పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎప్పుడు వెళ్లినా.. మొదటి రోజు కాస్త నెమ్మదిగా స్థానిక వాతావరణానికి అడ్జస్ట్‌ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ చెక్‌లిస్ట్‌ ప్రకారం ట్రావెల్‌ను కంటిన్యూ చేయొచ్చు.

హైదరాబాద్‌ నుంచి ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్‌ నుంచి బొలీవియాకు నేరుగా విమానాలు లేవు. ఒకటి లేదా రెండు కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ ద్వారా బొలీవియా రాజధాని లా పాజ్‌ చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రయాణానికి సుమారు 24–30 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. లా పాజ్‌ నుంచి ఎల్‌ ఆల్టోకు రోడ్డు మార్గంలో లేదా కేబుల్‌ కార్‌ ద్వారా చేరుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈ 5 పర్వతాలను ఎవరూ అధిరోహించలేదు! ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement