ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.
పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.
విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండి
చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.
అనుబంధ ఆదాయ మార్గాలు
రైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి.
వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్‌పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్‌కు వినియోగించ వచ్చు.
స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.
పోషకాహార లోపం తొలగించేలా...
పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.
సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.
ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.
– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి
-ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు


