కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది? | HYDRA Commissioner Contempt Of Court Telangana High Court | Sakshi
Sakshi News home page

కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?

Aug 6 2026 5:12 AM | Updated on Aug 6 2026 5:12 AM

HYDRA Commissioner Contempt Of Court Telangana High Court

‘హైడ్రా’ కమిషనర్‌పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.

స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్‌ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.

కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్‌ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్‌ చేసుకొనే అవకాశం ఉంది.

చట్టం ఏం చెబుతోంది?
న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్ట్‌ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్‌’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే  శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్‌’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా  తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్‌’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.

కోర్టులు చాలా అరుదుగా ఈ  అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్‌’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్‌ కర్ణణ్‌. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్‌ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.
– హరీష్‌ కుమార్‌ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్‌ జనరల్‌ మానేజర్‌ (విశ్రాంత), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement