సేవాపథం
స్విట్జర్లాండ్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని, ఆర్థిక భద్రతను, సకల సౌకర్యాలనూ వదిలి ఇండియాను వెదుక్కుంటూ వచ్చిన సాండ్రా లావి గోజ్కోవిచ్ ఇక్కడ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతోంది. ‘ఇండియాలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అని లావి ఒక ప్రణాళిక వేసుకొని రాలేదు. ఇక్కడ ఆమె అడుగు పెట్టిన తరువాత ఊహించని ప్రణాళిక పుట్టింది. ఆ ప్రణాళికలో నుంచే తన జీవిత లక్ష్యం రూపుదిద్దుకుంది..
పశ్చిమబెంగాల్‌లోని ఒక గ్రామంలో ఒక స్కూల్ ప్రారంభించి పేద పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టిన లావి సాండ్రా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేసింది. మానవ అక్రమరవాణ, గృహహింసకు వ్యతిరేకంగా గళం విప్పింది. తమ కుటుంబాల్లో మార్పు తెచ్చే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.
తాజా విషయానికి వస్తే...
తన జీవితంలోని కొన్ని విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది లావి సాండ్రా. కార్పొరెట్ బోర్డ్ రూమ్‌ను వదిలి భారతదేశంలోని మారుమూల ప్రాంత స్కూల్ రూమ్‌లోకి ఎలా వచ్చిందో వివరించింది. గ్రామస్తుల నమ్మకాన్ని చూరగొనడం లాంటి సవాళ్లు ఎన్నో ఆమెకు ఎదురయ్యాయి.
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటైన జ్యూరీచ్‌లో పెరిగిన లావి తన బాల్యం చాలా సంతోషంగా గడిచింది అని చెబుతుంటుంది. తల్లిదండ్రులు ఏది కాదనకుండా ఇచ్చారు. అందులో ఒకటి... ప్రపంచాన్ని చూసే అవకాశం.
‘ప్రయాణాల వల్ల ఎన్నో సంస్కృతులను చూసే అవకాశం వచ్చింది. తల్లిదండ్రులు నాకు ఇచ్చిన విలువైన బహుమానం... ప్రయాణించే అవకాశం’ అంటుంది లావి. ఆ ప్రయాణాలలో ఒక జ్ఞాపకం ఆమె మదిలో స్థిరంగా నిలిచిపోయింది. చెప్పులు లేకుండా నడిచి వెళుతున్న ఒక పేద బాలికను చూసి బాధ పడిన లావి తన బూట్లను ఆ అమ్మాయికి ఇచ్చేసింది.
‘పంచడంలోని ఆనందం నాకు తొలిసారిగా తెలిసొచ్చిన క్షణం అది’ అని గుర్తు తెచ్చుకుంటుంది లావి.
‘ఎంతోమందికి కనీస సౌకర్యాలు లేవు. నాలాంటివారికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. సామాజిక సేవ రూపంలో కొత్త మార్గాన్ని చూపింది.
‘కెరీర్‌కు సంబంధించిన విజయం నాకు ఆర్థిక సౌకర్యం ఇచ్చింది కానీ, లక్ష్యాన్ని మాత్రం ఇవ్వలేదు అనే విషయాన్ని గ్రహించాను. ఈ క్రమంలోనే నా గురించి కాదు సమాజం గురించి ఎంతో కొంత పని చేయాలనుకున్నాను. అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు చొక్కాలు, రెండు ప్యాంట్‌లు సర్దుకొని ఇండియాకు వన్–వే టికెట్ కొనుక్కున్నాను’ అంటోంది లావీ.


