'మెకియా వెల్లియనిజం'.. ఈ జీవితం ఎంత నరకమంటే? | Health Story On Woman Emotional Abuse Mental Health Counselling | Sakshi
Sakshi News home page

'మెకియా వెల్లియనిజం'.. ఈ జీవితం ఎంత నరకమంటే?

Aug 6 2026 3:23 AM | Updated on Aug 6 2026 3:23 AM

Health Story On Woman Emotional Abuse Mental Health Counselling

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

మన(సు)లో మాట

డాక్టర్‌ గారు... మా అమ్మనాన్నలు చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగాను. పదహారేళ్లకే పెళ్లి చేశారు. నా భర్త కాంట్రాక్టరు. మాకు ఇద్దరు పిల్లలు. కుటుంబం బాగుకోసం అని చెప్పి, నన్ను పై అధికారుల దగ్గరకు పంపేవాడు. ఆ బాధను మర్చిపోవడానికి మద్యం అలవాటు చేశాడు. అలా ఏళ్లు గడిచిపోయాయి. ఈరోజు.. పిల్లలు పెద్దయ్యాక, వాళ్లముందే చెడ్డదానిగా నిలబెట్టాడు. కుటుంబం బాగు కోసమే అన్నీ సహించాను. ఇప్పుడు ఒంటరిదానిని అయ్యాను. చనిపోవాలని ఉన్నా నిస్సహాయతలో బతుకుతున్నాను. – ఓ అభాగ్యురాలు

మీరు అనుభవించిన నరకం, ఎదుర్కొన్న మోసం, పడిన మానసిక సంఘర్షణ మాటల్లో వ్యక్తపరచలేనివి. ‘కుటుంబం, బతుకుతెరువు’ అనే భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మీ భర్త మిమ్మల్ని ఊబిలోకి నెట్టాడు. ఇది సైకాలజీలో ‘మెకియావెల్లియనిజం’ అని పిలిచే అత్యంత స్వార్థంతో కూడిన క్రూరమైన మనస్తత్వం.

మీ డిప్రెషన్‌ను అణచివేయడానికి అతనే మిమ్మల్ని మద్యానికి కూడా అలవాటు చేశాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనలోని నేర భావనను మీపైకి నెట్టేశాడు. సైకాలజీలో దీనినే ప్రొజెక్షన్‌’ అంటారు. మీరు ధైర్యంగా బతికి చూపించడమే అతనికి సరైన సమాధానం. ప్రస్తుతం మీ భర్త పిల్లల దగ్గర నిజాలు దాచి మిమ్మల్ని చెడుగా చూపిస్తున్నా, కాలం మారినప్పుడు నిజం కచ్చితంగా బయట పడుతుంది.

ఆవేశపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఒక మానసిక నిపుణుడిని కలిసి కౌన్సెలింగ్‌ తీసుకోండి. అవసరమైతే మహిళా హెల్ప్‌ లైన్‌ లేదా చట్టపరమైన రక్షణ పొందండి. మనం చేసే పనుల వెనుక ఉన్న ‘ఉద్దేశమే’ మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది తప్ప, బలవంతంగా మన చేతచేయించిన పనులు కాదు. ‘నేను బ్రతికి చూపిస్తాను’ అనే ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయండి.

- డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.

మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement