లింగరూపం కాదు... యోగిగా దర్శనమిచ్చే శివక్షేత్రం ఇది! | Devotional And Spiritual Story On Hemavathi Siddheshwara Temple Andhra Pradesh History | Sakshi
Sakshi News home page

లింగరూపం కాదు... యోగిగా దర్శనమిచ్చే శివక్షేత్రం ఇది!

Aug 6 2026 2:31 AM | Updated on Aug 6 2026 2:31 AM

Devotional And Spiritual Story On Hemavathi Siddheshwara Temple Andhra Pradesh History

సన్నిధి

అరుదైన శిల్పం

సాధారణంగా శైవాలయాలలో పరమశివుడు లింగరూపంలో ఆరాధించబడతాడు. అయితే హేమావతి సిద్ధేశ్వర ఆలయంలో మాత్రం పరమశివుడు అత్యంత అరుదుగా దైవరూపంలో సిద్ధయోగిగా ఆసీనుడై దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి అపూర్వమైన విశిష్టతను కల్పించింది. భారతదేశంలోని అతి కొద్ది శైవాలయాలలో మాత్రమే కనిపించే ఈ రూపం శివుని యోగేశ్వర తత్త్వాన్ని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, భిక్షాటన స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ క్షేత్రం ఎక్కడ ఉందో, ఆ శిల్ప విశేషాలేమిటో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పూర్వపు అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత విశిష్టమైన శైవక్షేత్రాలలో ఒకటి.  అద్భుతమైన నోళంబ శిల్పకళతో, ఆధ్యాత్మిక మహిమతో, అరుదైన శివస్వరూపంతో ఈ ఆలయం భారతీయ దేవాలయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

హేమావతి ఆలయ సముదాయం ఒక విశాలమైన చారిత్రక దేవాలయ సముదాయం. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయంతో పాటు దొడ్డేశ్వర ఆలయం మల్లేశ్వర ఆలయం విరూపాక్ష ఆలయం జైన బసదులు నందిమండపాలు వీరగల్లులు నాగశిలలు శాసనాలతోపాటుఅనేక శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. ఇక్కడ లభించిన శాసనాలు నోళంబుల రాజకీయచరిత్ర వారి దానధర్మాలు ఆలయ నిర్వహణ సామాజిక జీవన విధానం, ఆ కాలపు సంస్కృతిపై సమాచారాన్ని అందిస్తున్నాయి.

ఆలయ నిర్మాణం నోళంబ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. గర్భగుడి అంతరాలయం మహామండపం స్తంభాలు ద్వారబంధాలు మరియు గోపుర భాగాలు అత్యంత సూక్ష్మమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. స్తంభాలపై శివపార్వతి గణపతి కుమారస్వామి నంది భైరవుడు సప్తమాతృకలు యక్ష యక్షిణులు గంధర్వులు అప్సరసలు నర్తకులు సంగీత విద్వాంసులు పురాణ ఘట్టాలు పుష్పలతలు మకరాలు గజసింహాలు యాళులు, ఇతర అలంకార రూపాలు అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు నోళంబ కళాకారుల సృజనాత్మకతకు నిదర్శనాలుగా నిలిచాయి.

గర్భగుడిలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో పశ్చిమాభిముఖంగా ఆసీనుడై దర్శనమిస్తుంది. చతుర్భుజుడైన స్వామివారి ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో త్రిశూలం ఇంకొక చేతిలో డమరుకం మరొక చేతిలో భిక్షాపాత్ర ఉన్నాయి. తలపై జటాజూటం, నుదుటిపై తృతీయ నేత్రం మెడలో పుర్రెల మాల చెవులలో కుండలాలు, యోగాసన భంగిమ శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిఫలింపజేస్తాయి. ఈ విగ్రహం శివుని యోగేశ్వర స్వరూపాన్ని సిద్ధి వైరాగ్యం జ్ఞానం, లోకక్షేమ భావనలను ఏకకాలంలో ప్రతిబింబించే అపూర్వ కళాఖండంగా నిలిచింది. 

హేమావతి ఆలయం భారత పురావస్తు సర్వే శాఖ పరిరక్షణలో ఉన్న జాతీయ ప్రాముఖ్యత గల స్మారక కట్టడంగా గుర్తింపు ΄÷ందింది. ఆలయ ప్రాంగణంలో లభించిన శిల్పాలు శాసనాలు, నంది విగ్రహాలు శిలాఖండాలు, పురాతన అవశేషాలు సంరక్షించబడి చరిత్ర పరిశోధకులకు పురావస్తు శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు విలువైన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి.

ఈ క్షేత్రంలో మహాశివరాత్రి, కార్తీకమాస ఉత్సవాలు, ఇతర శైవ పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యోగసాధనం, ధ్యానం, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను అందిస్తుంది.

హేమావతి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది నోళంబుల రాజకీయ వైభవానికి భారతీయ శిల్పకళా సంపదకు శైవ తత్త్వానికి, దక్షిణ భారత చారిత్రక వారసత్వానికి చిరస్థాయి చిహ్నం. లింగరూపానికి భిన్నంగా మానవ రూపంలో సిద్ధయోగిగా పరమశివుడు కొలువై, భారతదేశంలోని విశిష్ట శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శాశ్వత కీర్తిని ΄÷ందిన ఈ అరుదైన క్షేత్రాన్ని సందర్శించి తీరవలసిందే!
– జి.బి. విశ్వనాథ, ఎం.ఎ. హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement