క్రీస్తు ఏలుబడి.. రక్షణకు మార్గం ఇదే! | Devotional And Spiritual Story On Gospel Message Gods Rule Christ Church | Sakshi
Sakshi News home page

క్రీస్తు ఏలుబడి.. రక్షణకు మార్గం ఇదే!

Aug 6 2026 2:09 AM | Updated on Aug 6 2026 2:09 AM

Devotional And Spiritual Story On Gospel Message Gods Rule Christ Church

సన్నిధి

సువార్త

సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము చాటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి’ – (యెషయా  52:7)

సమాధానపరుస్తూ ఇద్దరి మధ్య శాంతి సమాధానాలకు ఏకీభావానికి కృషి చేసేవారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఉగ్రత భరించుట కష్టమని ఇక తప్పక దేవునితో సమాధానపడమని విధేయంగా లోబడమని చెప్పుటను మించిన సువర్తమాన హెచ్చరికతో కూడిన బోధ వాక్యం మరొకటి ఏముంది? ఇలా రక్షణ సమాచారం అధికారికంగా అందుబాటులో ఉంచడం మేలైన విషయం. సకల యుగాలలో రాజైన అద్వితీయ సత్యదేవుడు ఇప్పుడైతే ఎలా ఏలుచున్నాడో అన్నది ఒక్కింత పరీశీలనగా చూస్తే, దేవుడు క్రీస్తు ద్వారా ఏలుచున్నాడు అన్నది అర్థమవుతూ ఉంది.

యెహోవా ఇల్లుగా యెహోవా నామ ఘనత కొరకు సొలొమోను కంటె గొప్పవాడైన క్రీస్తు ఎంతో కష్టపడి ఇష్టంగా తన విలువైన రక్తం వెచ్చించి కట్టిన ఆత్మ సంబంధ మందిరమే క్రీస్తు సంఘం. దేవ దేవుని సంకల్పాన్ని గౌరవిస్తూ దేవుని సంకల్పమైన సంఘాన్ని గుర్తించి గౌరవించుట ద్వారా మనలను మనం గౌరవించుకున్నట్టే. ప్రభువైన క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండి పాలించుటే దేవుని పాలన. ‘సీయోను – నీ దేవుడు ఏలుచున్నాడు’ అనుటలోని అర్థం పరమార్థం ఇదే. ఇప్పుడు సీయోను అనగా క్రీస్తు ప్రభువు వారి ప్రియమైన సంఘం అనగా అద్వితీయ సత్య దేవుని నివాస కేంద్రం. దేవుడు ఏలుబడి లేని చోటు అనేది  ఆత్మ సంబంధమైన అనేకనేక కష్ట నష్టాలకు నెలవు కాబట్టే. . . దేవుని దగ్గరకొచ్చి దేవుని ఏలుబడికి తలవంచి ఒదిగి జీవించడం హెచ్చయిన ఘనమైన ఆశీర్వాదాలకు కారణమనేది ఆధ్యాత్మిక పండితుల అనుభవం సారం. గ్రంథ రాజపు విలువైన బోధలకు తలవంచుట మినహా మరో మార్గం లేదు.

క్రీస్తు సంఘమా, సర్వ జనాంగమా నిన్ను దేవుని పక్షాన క్రీస్తు ఏలుచున్నాడు అంటూ చెప్పువాని పాదములు సుందరమైనవి. పర్వతముల మీద స్థిర నివాసం, రాజస నడక అత్యున్నత స్థితిని, హోదాను చాటుతుంది. రాజులు, రాజ వంశీయులు, సాహసికులు ఎత్తయిన పర్వతముల మీదనే నివసిస్తూ నడుస్తారు. క్రీస్తు సువార్తను ప్రకటించుటను మించిన సాహసకార్యం మరొకటి లేదు. రాజులమైన భక్తులమైన మేము కాదు, నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడు అన్న సాహసోపేత సువార్త ప్రకటనతోనే వారి పాదములు ఎంతో సుందరములయ్యాయి.

ఆత్మ సంబంధంగా చూస్తే యేసు సజీవుడగు
సర్వోన్నతుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అను బండ మీద అనగా ఇట్టి విశ్వాసం మీద సంఘం కట్టబడింది. దీన్ని మించిన ఎత్తయిన స్థావరం మరొకటి లేదు. ఈ ఎత్తయిన ఘనమైన చోట నుండి సంఘం అనగా రాజులైన యాజక సమూహం సువార్త ప్రకటిస్తుంటే ఇహ లోక పాప సంబంధమైన మలిన మట్టి వారి పాదాలకు తాకక అంటక ఉన్నందున వారి పాదములు సుందరములు. ఎందుకంటే వారు ఎత్తయిన పర్వతం మీద బండ మీద వేసిన పునాది మీద అనగా యేసు అసాధారణ బోధల మీద వారు వారి జీవితాలను కట్టుకొని హుందాగా ఠీవిగా రాజసంతో నిలబడి ఉన్నారు. సంఘమా నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పగల సంసిద్ధులు, సాహసికులు ఎవరై ఉంటారు? దేవుని ఏలుబడికి ఎప్పుడూ విధేయులై ఉన్నవారే ఇలా చెప్పగలుగుతారు.
– జేతమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement