కెమిస్ట్రీని మలుపు తిప్పిన ఆక్సీజనుడు | Guest Colum Special And Life Story On Joseph Priestley's | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీని మలుపు తిప్పిన ఆక్సీజనుడు

Aug 5 2026 1:56 AM | Updated on Aug 5 2026 1:56 AM

Guest Colum Special And Life Story On Joseph Priestley's

జోసెఫ్‌ ప్రీస్ట్లీ, ప్రీస్ట్లీ వాడిన పరికరాలు

టైమ్‌ మిషన్‌

నం పీల్చే గాలిలో ఏముంది? ఈ ప్రశ్న ఇప్పుడు చిన్నదిగా అనిపించవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. పురాతన గ్రీకులు చెప్పినట్టు గాలి అనేది ఒక మార్పు లేని ప్రాథమిక మూలకం అని ప్రపంచం నమ్మింది. ఈ నమ్మకాన్ని బద్దలుకొట్టి, మనం ప్రాణాలతో ఉండటానికి కారణమయ్యే ‘ఆక్సిజన్‌’ గుట్టు విప్పినవాడు జోసెఫ్‌ ప్రీస్ట్లీ. ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు; ఒక ఉపాధ్యాయుడు, మత బోధకుడు, విప్లవ భావాలున్న సాహసి.

బ్రిటన్‌లో జన్మించిన ఆయన జీవితం ఎంతో ఆసక్తికరంగా సాగింది. లీడ్స్‌ నగరంలో నివసిస్తున్నప్పుడు, ఆయన ఇంటి పక్కనే ఒక బీర్‌ తయారీ కేంద్రం ఉండేది. అక్కడ పులియబెట్టే ప్రక్రియలో వచ్చే ‘ఫిక్స్‌డ్‌ ఎయిర్‌’ (కార్బన్‌ డయాక్సైడ్‌)పై ఆసక్తి కలిగింది. నేటి సాఫ్ట్‌ డ్రింక్‌ పరిశ్రమకు పునాది వేసింది ఆ ఆసక్తే. నీటిలో కార్బన్‌ డయాక్సైడ్‌ను కలిపి కృత్రిమంగా ‘సోడా వాటర్‌’ను తయారు చేసే విధానాన్ని ఆయన కనిపెట్టారు.

1774 ఆగస్టు 1న ఆయన చేసిన ప్రయోగం అతి ముఖ్యమైనది. ఒక భూతద్దం సహాయంతో సూర్యరశ్మిని మెర్క్యూరిక్‌ ఆక్సైడ్‌ పొడి మీద కేంద్రీకరించినప్పుడు దాని నుంచి ఒక రకమైన వాయువు వెలువడటం గమనించారు. అది సాధారణ గాలి కంటే ఐదారు రెట్లు స్వచ్ఛంగా ఉండటమే కాకుండా, అందులో మంటలు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి. ఆ వాయువును పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఎంతో తేలికగా అనిపించాయి. ఆ గాలిలో ఒక ఎలుక సాధారణ గాలిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ సేపు ప్రాణంతో ఉండటాన్ని గమనించారు. దానికి ఆయన ‘డీఫ్లోజిస్టికేటెడ్‌ ఎయిర్‌’ అని పేరు పెట్టాడు. తర్వాత ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త లావోయిజర్‌ దీనికి ‘ఆక్సిజన్‌’ అని నామకరణం చేశారు.

ప్రకృతిలో సమతుల్యత ఎలా కాపాడబడుతుందో కూడా ప్రీస్ట్లీ మొదటగా గుర్తించారు. ఒక మూసి ఉన్న పాత్రలో మంట వెలిగించినా లేదా ఎలుకను ఉంచినా కొద్ది సేపటికి ఆ గాలి కలుషితమై మంట ఆరిపోవడం, ఎలుక చనిపోవడం జరిగేది. కానీ అదే పాత్రలో ఒక పచ్చని మొక్కను ఉంచి ఎండలో పెడితే, అది గాలిని తిరిగి ‘శుద్ధి’ చేస్తుందని ఆయన కనుగొన్నారు. 

ఆయన కనిపెట్టిన ఆక్సిజన్‌ వైద్య చికిత్సల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి పెద్ద ఆవిష్కరణలే కాదు... నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చిన్న చిన్న విషయాలను కూడా ఆయన విస్మరించలేదు. మనం పెన్సిల్‌తో రాసిన తప్పులను తుడిపే ‘రబ్బర్‌ ఎరేజర్‌’ను కూడా ఆయనే కనిపెట్టారని తెలిస్తే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది! అందుకే అతడు గొప్పవాడయ్యాడు!

అసమ్మతి స్వరం
ప్రీస్ట్లీ జీవితం కేవలం ప్రయోగశాలకే పరిమితం కాలేదు. ఆయన మతపరమైన ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆ కాలంలో ‘చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’ సిద్ధాంతాలను ఆయన వ్యతిరేకించారు. ఆయనొక ‘డిసెంటర్‌’ (అసమ్మతివాది) కావడంతో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ లాంటి పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి అనుమతి దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్‌ వంటి భాషలు సొంతంగా నేర్చుకున్నారు.

అమెరికా, ఫ్రెంచ్‌ విప్లవాలకు ఆయన మద్దతు పలకడం అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి నచ్చలేదు. ఆయనపై ‘ద్రోహి’ ముద్ర వేశారు. 1791లో బర్మింగ్‌హామ్‌లో ఉన్నాదులు కొందరు ఆయన ఇంటిని, ప్రయోగశాలను తగలబెట్టారు. ఆయన రాసుకున్న ఎన్నో విలువైన పరిశోధన పత్రాలు బూడిదయ్యాయి. ప్రాణభయంతో ఆయన లండన్‌ పారిపోయి, చివరకు 1794లో అమెరికాకు వలస వెళ్లారు. 

పెన్సిల్వేనియాలోని నార్తంబర్‌ల్యాండ్‌ అనే మారుమూల గ్రామంలో స్థిరపడి మళ్ళీ పరిశోధనలు ప్రారంభించారు. అక్కడ ‘కార్బన్‌ మోనాక్సైడ్‌’ వాయువును కనిపెట్టారు. ‘యూనిటేరియన్‌ చర్చి’ని స్థాపించారు. అమెరికా మాజీ అధ్యక్షులు థామస్‌ జెఫర్సన్, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ ఆయనకు ఆప్తమిత్రులు. ఆక్సిజన్‌ను కనిపెట్టిన శత వార్షికోత్సవం సందర్భంగా, ఆయన గౌరవార్థం 1876లో ‘అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ’ ఏర్పాటైంది. ప్రీస్ట్లీ మరణించినప్పుడు (1804 ఫిబ్రవరి 6) ‘మానవాళికి అత్యంత విలువైన కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు’ అని థామస్‌ జెఫర్సన్‌ నివాళులర్పించారు.
- ఎడిటోరియల్‌ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement