జ్వలించే విజయం | Resham Fatma Becomes First Indian Acid Attack Survivor Awarded Chevening Scholarship | Sakshi
Sakshi News home page

జ్వలించే విజయం

Aug 5 2026 12:50 AM | Updated on Aug 5 2026 12:51 AM

Resham Fatma Becomes First Indian Acid Attack Survivor Awarded Chevening Scholarship

అద్దం చూడడానికి కూడా భయపడే విషాదస్థితి నుంచి ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకున్న ఆశావాద స్థితిలోకి వచ్చింది యాసిడ్‌ ఎటాక్‌ సర్వే్యవర్‌  రేషమ్‌. రాంచీకి చెందిన రేషమ్‌ ఫాతమ్‌ యూకే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘చెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌’ను అందుకుంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌(ఎల్‌ఎస్‌ఈ)లో జెండర్, డెవలప్‌మెంట్‌ అండ్‌ గ్లోబలైజేషన్‌లో ఎంఎస్‌సీ(మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌) చేయనుంది. ‘ఇది కేవలం డిగ్రీ కాదు. నా కష్టానికి దొరికిన ప్రతిఫలం’ అంటోంది రేషమ్‌...

చెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌ అనేది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విదార్థులు, నిపుణులు యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేయడానికి అవకాశం ఇచ్చే ప్రోగ్రామ్‌ ఇది.

చావు అంటే ఇలాగే ఉంటుంది!
ఇరవై తొమ్మిది సంవత్సరాల జీవితంలో రేషమ్‌ ఫాతమ్‌ ఎన్నో ఆట్లు పోట్లను చూసింది. తనకు అత్యంత సన్నిహితులైన వారి నుంచి వేధింపులు ఎదుర్కొంది. పదిహేడేళ్ల వయసులో రేషమ్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. జంషెడ్‌పూర్‌లో జన్మించిన రేషమ్‌ 11వ తరగతి చదువుతూ లక్నోలోని తాతయ్య, నానమ్మలతో కలిసి ఉండేది. ఆమె దగ్గరి బంధువైన రియాజ్‌ ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని వేధించేవాడు. అతడు రేషమ్‌ కంటే ఇరవై సంవత్సరాలు పెద్ద!

కొన్ని సంవత్సరాల క్రితం...
ఆరోజు ప్రేమికుల దినోత్సవం. ఆరోజు ఏంజరిగిందో రేషమ్‌ మాటల్లోనే... ‘కోచింగ్‌ క్లాసు అయ్యాక నన్ను ఇంటి దగ్గర దింపుతానని రియాజ్‌ చె΄్పాడు. నేను నమ్మాను. ఉన్నట్టుండి కారును హైవే వైపు నడిపి, నా తల మీద యాసిడ్‌ పోశాడు. మొదట్లో అది పెట్రోల్‌ అనుకున్నాను. కాసేపటికి మంటపుట్టడం మొదలైంది. కత్తి తీసి నా గొంతు దగ్గర పెట్టి... చావు అంటే ఇలాగే ఉంటుందన్నమాట అన్నాడు. అంత బాధ, భయంలోనూ ఆ దుర్మార్గుడిని గట్టిగా తోసేసి పరుగెత్తాను. మంట భరించలేనంతగా ఉంది. పరుగెడుతూనే ఉన్నాను. నన్ను చూసి ఒక ఆటోరిక్షా డ్రైవర్‌ ఆగాడు. ఎంతైనా డబ్బు ఇస్తాను. నన్ను ఆదుకో అని బతిమిలాడాను. నా చర్మం మాడి పోతున్నట్లు అనిపించడంతో ఆటోలోనే జీన్స్‌ తీసేయాల్సి వచ్చింది. ఆటోలో ఉన్న ఒక వస్త్రంతో డ్రైవర్‌ నా కాళ్లను క΄్పాడు’

ఎబ్రా ఫౌండేషన్‌
జేఎన్‌యూలో చదువుతున్నప్పుడే ‘ఎబ్రా ఫౌండేషన్‌’ను ప్రారంభించింది రేషమ్‌. చదువు, ఆర్థిక స్వాతంత్య్రంపై మహిళలకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది. 2024లో రేషమ్‌కు వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతోనే చెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ‘లండన్‌కు వెళ్లిన తరువాత కూడా ఎబ్రా ఫౌండేషన్‌ పనులు కొనసాగుతాయి. అమ్మాయిల కోసం స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులు నిర్వహించడానికి ప్రణాళికలు తయారుచేసుకున్నాను. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులైతే, వారు స్వంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ఎన్నో సాధిస్తారు’ అంటుంది రేషమ్‌.                          

పట్టువదలకుండా...
పోలీస్‌ స్టేషన్‌ దగ్గరలో జనం గుమిగూడారు. కాని రేషమ్‌ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పుడు ఒక వృద్ధుడు ఆమెను హాస్పిటల్‌లో చేర్పించాడు. ధైర్యం చె΄్పాడు. సర్జరీలు జరిగాయి. ఇంటి నుంచే చదువు కొనసాగించిన రేషమ్‌ అంత బాధలోనూ 87 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఆతరువాత బీఎస్సీ ఫిజిక్స్‌ చేసింది. జేఎన్‌యూలో పాలిటిక్స్‌ అండ్‌ ఇంటర్‌నేషనల్‌ రిలేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది.

నమ్మితే చాలు...
చదువు సంగతి ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి వెళితే చాలు పరిచయం ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా రేషమ్‌కు ఇబ్బందులు ఎదురయ్యేవి. ‘అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ పరిస్థితుల్లో నువ్వు బతకడం అనేది నిజంగా వండర్‌’ అని ఒకరు...‘నీ భవిష్యత్‌ను తలుచుకుంటే బాధగా ఉంది. ఎలా బతుకుతావో ఏమో’ అని ఒకరు... సానుభూతి చూపుతున్నట్లుగా మాట్లాడుతూనే రేషమ్‌ను ఇబ్బంది పెట్టేవారు. ‘నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను. నేను సాధించగలనని మీరు నమ్మితే చాలు’ అనేది రేషమ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement