అమ్మపాలతో బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెంపు
తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలూ ఎక్కువే
పుట్టిన అరగంటలోపు ముర్రుపాలు ఇవ్వాలి
తల్లిపాలకు ఎంతో విశిష్టత ఉంది. బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అర గంటలోపు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. నేటి ప్రపంచంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం లేదు. అలాంటి పిల్లల ఎదుగుదలలో లోపాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ పిల్లలకు తల్లిపాల విశిష్టతను తెలియచేసేందుకు ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడంతో పాటు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కలి్పంచనున్నారు.
హిందూపురం టౌన్: తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. చిన్నారులకు వ్యాధి నిరోధకశక్తి కూడా సమకూరుతుంది. తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోక కుండా నివారించొచ్చు. మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు, విటమిన్–ఏ పుష్కలంగా ఉంటాయి. శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలూరుబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లును నివారిస్తాయి.
తల్లి పాల ప్రాముఖ్యతపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది
తల్లికీ ఉపయోగం
బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని పేర్కొంటున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావం అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.
శిశు మరణాల నివారణ
ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశవ్యాధులతో మరణాలు సంభవించడాన్ని యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అర గంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు.
రెండేళ్ల వరకు అందించాలి
పుట్టిన పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి, ఏ సమయాల్లో అందించాలి అనే అవగాహన సమాజంలో, తల్లుల్లో పెరగాలి. నెలలోపు పిల్లల మరణాల తగ్గింపు, పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుండాలంటే బిడ్డ పుట్టిన గంట నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలు అందించాలి. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బీపీఎన్‌ఐ ద్వారా పిల్లలకు తల్లిపాల ద్వారా అందే పోషక పదార్ధాలు, పిల్లల పెరుగుదల, తల్లిపాలు అందించకపోవడంతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఆస్పత్రిలో పనిచేసే ప్రతి ఆరోగ్య కార్యకర్తకు తల్లిపాలపై నైపుణ్య శిక్షణ ఇప్పించి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి గర్భిణి, బాలింతలకు వివరించేలా చేయడం ద్వారా పిల్లల మరణాలు మరింత నివారించవచ్చు.
– డాక్టర్ కేశవులు, ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు, బీపీఎన్‌ఐ జాతీయ అడ్వైజరీ కమిటీ మెంబర్


