పామూరు రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న పొగాకు రైతులు
పర్చూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో
భారీగా పాల్గొన్న రైతులు, మహిళా రైతులు
కందుకూరులో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన
వేలం నిలిపివేసి నిరసన తెలిపిన రైతులు
చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలి: గాదె మధుసూదనరెడ్డి
పర్చూరు (చినగంజాం)/కందుకూరు: పొగాకుకు మద్దతు ధర కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా.., బాపట్ల జిల్లా పర్చూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేసి, రాస్తారోకో చేశారు. పొగాకుకు మద్దతు ధర ఇవ్వాలని, చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు రైతులు సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేశారు. పొగాకు కాడల దండలు చేత పట్టుకొని పర్చూరు బస్టాండ్ సెంటర్ నుంచి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేశారు.
అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం బొమ్మల సెంటర్‌లో ధర్నా చేశారు. వైఎస్సార్‌సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, మహిళా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. బొమ్మల సెంటర్ వద్ద పొగాకు రైతులు శాంతియుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
రైతులు, మహిళలను వారిని ప్రతిఘటించడంతో పోలీసులు అక్కడి నుంచి తప్పుకొన్నారు. రైతులు అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి పొగాకు చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని అన్నారు.
కందుకూరులో కొనసాగుతున్న ఆందోళన
ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో పొగాకు రైతుల ఆందోళన కొనసాగుతోంది. కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రం వద్ద రైతులు ధర్మ దీక్ష పేరుతో నిరసన దీక్షను కొనసాగించారు. పామూరు రోడ్డులోని రెండో కేంద్రంలో వేలాన్ని అడ్డుకున్న రైతులు రాస్తారోకో చేశారు. రైతులకు ఏపీ రైతు సంఘం సంఘీభావం ప్రకటించి, ఆందోళనలో పాల్గొంది. పొగాకు బోర్డు ఆర్‌ఎం వేలం కేంద్రం వద్దకు వచ్చి రైతులతో చర్చించారు. పొగాకు క్వింటా రూ.30 వేలకు కొనాలని రైతులు డిమాండ్ చేశారు.


