గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక | Krishnamma is overflowing from the Narayanpur and Almatti dams | Sakshi
Sakshi News home page

గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక

Aug 4 2026 5:25 AM | Updated on Aug 4 2026 5:25 AM

Krishnamma is overflowing from the Narayanpur and Almatti dams

హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని విడుదల చేయని చంద్రబాబు సర్కార్‌ 

కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా యథేచ్ఛగా నీటిని తరలించుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం 

ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలోకి పెరిగిన వరద

సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ కనీస నీటి మట్టాన్ని దాటింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,49,917 క్యూసెక్కులు చేరగా, నీటి నిల్వ 855.1 అడుగులలో 92.04 టీఎంసీలకు చేరుకుంది. 

  శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. అయినప్పటికీ అటు హంద్రీ–నీవా, ఇటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేదు. 

ప్రాజెక్టులో ఎడమ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కుల చొప్పున గత నెల 25 నుంచి (ఆ రోజున 41.46 టీఎంసీలు నిల్వ) తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తూ– ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు నీటిని సరఫరా చేస్తోంది. 
ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలు.. కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందిస్తోంది. 
రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటికీ ఇబ్బందులున్నప్పటికీ... హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు చంద్రబాబు సర్కార్‌ నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ఆల్మట్టిలోకి పెరిగిన వరద..
 మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన సోమవారం వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కులు చేరుతుండగా..స్పిల్‌ వే, విద్యుత్‌ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 
 నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 1,28,954 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌ కేంద్రాల ద్వారా 1,23,364 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 
ఎగువ నుంచి వస్తున్న వరదను చూస్తే మరో మూడు రోజులు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో నీటి ప్రవాహం కొనసాగనుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement