డీఎస్సీలో అక్రమాలపై నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన సదస్సుకు హాజరైన యువత
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ రౌండ్‌టేబుల్ సమావేశాలు
డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని నేతల డిమాండ్
బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులకు న్యాయం చేయాలని, ఇటువంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు.
పలువురు డీఎస్సీ బాధిత అభ్యర్థులు మాట్లాడుతూ నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా వివరించారు. సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా నష్టపోయిన బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటంకొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.


