ఆందోళనకు దిగిన హిమతేజ బంధువులు
నెల్లూరు జీజీహెచ్‌లో బాలిక కుటుంబీకుల ధర్నా
నెల్లూరు (అర్బన్): వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె హిమతేజ (16) మరణించిందంటూ నెల్లూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో ఆదివారం రాత్రి బాలిక తల్లిదండ్రులు, బంధువులు వాగ్వాదానికి దిగారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు క్యాజువాలిటీ విభాగం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. బాలిక తల్లిదండ్రులు మానస, మస్తానయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం మానసకు వాంతులయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా వాంతులు తగ్గాయి.
బాలిక నీరసంగా ఉండటంతో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి సెలైన్ పెట్టించారు. ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో పీజీ విద్యార్థులు స్కానింగ్ చేసి ఆరోగ్యం బాగుందని చెప్పారు. రక్త పరీక్షలు చేశాక డిశ్చార్జి చేస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు వేచి చూడగా అప్పుడు రక్త నమూనాలు సేకరించారు. రాత్రి 8 గంటల వరకు బాగున్న తమ కుమార్తె హఠాత్తుగా మృతి చెందిందని హియతేజ తల్లిదండ్రులు తెలిపారు. ఆ విషయాన్ని వెంటనే చెప్పకుండా దాచారని ఆరోపించారు.
రక్త పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కామెర్లు, లివర్ డ్యామేజీ అయి మరణించిందని చెప్పారన్నారు. అప్పటివరకు బాగుందని చెప్పిన వైద్యులు తమ కుమార్తె మృతి చెందడంతో మాటమార్చి అబద్ధం చెప్పారన్నారు. సీనియర్ వైద్యులు లేకపోవడంతో శిక్షణలో ఉన్న వైద్యులు తెలిసీ, తెలియని వైద్యం చేయడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపించారు. అర్ధరాత్రి కూడా ఆందోళన జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేస్తామని, శవపరీక్ష నిర్వహిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.


