కర్నూలు జిల్లా నేమకల్లులో తన భార్య దుస్తులు చింపుతున్న టీడీపీ కార్యకర్త నాగరాజు.. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌తో నాగరాజు
బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు
రాష్ట్రంలో యథేచ్ఛగా లాకప్‌డెత్‌లు.. ఆత్మహత్యలు.. మహిళలపై అఘాయిత్యాలు
సామాన్యులకు ఏమాత్రం రక్షణ లేదు.. ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు తీవ్ర వేధింపులు
వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు, కుటుంబాలే లక్ష్యం
ఎమ్మెల్యే విరూపాక్షి, సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసుల పర్వం.. వారి దుస్తులు వారే చింపుకొని..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసు.. వీడియోతో కుట్రలు బట్టబయలు
ఉత్తరాంధ్ర పర్యటనలో జగన్ జన ప్రభంజనంతో చంద్రబాబు బెంబేలు.. అక్కడ లేని వారిపైనా అక్రమ కేసులు
3 ప్రాంతాల్లోనూ బలహీన వర్గాలకు చెందిన నేతలే ప్రభుత్వ పెద్దల టార్గెట్
పరాకాష్టకు చేరిన బాబు సర్కారు కక్ష సాధింపులు
సూపర్ సిక్స్‌లు గాలికి.. ఎడాపెడా అప్పులతో ఆర్థిక అరాచకం
యువతకు ఉద్యోగాలు లేవు.. బాబు పాలనలో అంతా స్కామ్‌లే
దుస్తులు చింపుకునేది వాళ్లే.. కేసులు పెట్టేదీ వాళ్లే
చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్‌డెత్‌లు.. ఆత్మహత్యలు.. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇలా.. రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోవైపు ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. డీఎస్సీ పేరుతో స్కామ్‌కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్‌సీపీలోని బీసీ నేతలను బాబు టార్గెట్ చేశారు.
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం,సాక్షి ప్రతినిధి, కర్నూలు, ఆలూరు రూరల్: ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తామని మోసపూరిత హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే చంద్రబాబు సర్కారు తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు ఉద్యమ బాట పడుతున్న ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా, ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది. ఇవి చాలదన్నట్లు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసి స్కామ్‌కు పాల్పడటంతో చంద్రబాబు సర్కారుపై యువత కన్నెర్ర చేస్తోంది. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. జెన్ జీని సన్నద్ధం చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆందోళన బాట పట్టడంతో చంద్రబాబు యథావిథిగా మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. అనుకున్నదే తడవుగా రెడ్‌బుక్ కుట్రలకు పదును పెట్టి పోలీసులను రంగంలోకి దించారు. ఈసారి వైఎస్సార్‌సీపీ బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు దిగారు.
మెగా డీఎస్సీ స్కామ్‌లో సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తుండటంతో చంద్రబాబు సర్కారు పరువు పాతాళానికి దిగజారిపోతోంది. వెనుకబడిన తరగతులకు చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి(బోయ), చింతాడ రవికుమార్ (కాళింగ), మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు (మత్స్యకార), జోగి రమేష్ (గౌడ), మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తదితర వైఎస్సార్‌సీపీ నేతలపై తీవ్రమైన నేరాలు మోపుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా.. మూడు ప్రాంతాల్లోను ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను బాబు సర్కారు టార్గెట్ చేసిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. బాబు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలైన పోలీస్ వ్యవస్థ మరింత అబాసుపాలవుతోందని పేర్కొంటున్నారు. పరాకాష్టకు చేరుకున్న బాబు సర్కారు బరి తెగింపు కుట్రలు ఇలా ఉన్నాయి...! 
వారి దుస్తులు వారే చింపుకొని..!
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ మూకలు బంధించి చితకబాదుతుంటే ప్రాణభయంతో వీడియో కాల్ చేసిన ఓ కార్యకర్త తమను రక్షించాలని ఎమ్మెల్యే విరూపాక్షిని వేడుకున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తను విడిపించేందుకు అక్కడికి వెళ్లిన విరూపాక్షిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పచ్చముఠాల దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు గాయాలయ్యాయి. ఈ కుట్రలు అంతటితో ఆగలేదు. టీడీపీ కార్యకర్త నాగరాజు తన భార్య నైటీని తానే చింపేసి దారుణంగా వైఎస్సార్‌సీపీ నేతలపై నిందలు వేశాడు. టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు, తదితరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం (307) కింద అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో ఆదివారం తెల్లవారుజామున (రాత్రి 2.45 గంటల సమయంలో) పోలీసు బలగాలు భారీ ఎత్తున ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నాయి. తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, ఇతర నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ విధ్వంస కాండకు ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ హార్డ్ డిస్‌్కలను పోలీసులు దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకున్నారు.
చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్‌డెత్‌లు.. ఆత్మహత్యలు.. మహిళలపై విచ్చలవిడిగా అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. మొన్న విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్.. శవం ఆనవాళ్లు కూడా దొరకకుండా బూడిద చేశారు! దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య..! కర్నూలులో దళిత మహిళ గంగమ్మ లాకప్‌డెత్..! ఉయ్యూరులో పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగక దంపతుల ఆత్మహత్యా యత్నం..! అనంతపురం జిల్లా మదిగుబ్బ తండాలో టీడీపీ కార్యకర్తల బెదిరింపులతో ఉరి పోసుకుని గిరిజన మహిళ ఆత్మహత్య..! తాజాగా పల్నాడులో ఎస్‌ఐ వేధింపులు భరించలేక మిర్చి వ్యాపారి భార్య ఆత్మహత్యాయత్నం..! రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు ఎంత భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఒకపక్క రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోపక్క ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు కుట్రలకు మరింత పదును పెడుతోంది. పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. మెగా డీఎస్సీ పేరుతో స్కామ్‌కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్‌సీపీలోని బీసీ నేతలను చంద్రబాబు టార్గెట్ చేశారు.
జోగి రమేష్ కుటుంబంపై తీవ్రమైన కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర కేసులు నమోదు కావడం వెనుక టీడీపీ నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలున్నాయి. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఫిర్యాదును ఆసరాగా చేసుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం లాంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో జోగి రమేష్, కుమారుడు రాజీవ్, సోదరుడు రాము, సోదరి రమతోపాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు. ఇది రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలో భాగమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియోతో కుట్రలు బట్టబయలు...
టీడీపీకి చెందిన మహిళ నైటీని స్వయంగా ఆమె భర్తే చింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ నేతలు తమ దుస్తులు తామే చింపుకొని, ఎమ్మెల్యేపై తప్పుడు ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. చివరకు మంత్రులు సైతం వాస్తవాలను మరుగునపరిచి దీన్ని వైఎస్సార్‌సీపీకి ఆపాదించి రాజకీయ లబ్ధి పొందే యత్నాలు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ కుట్రలు బట్టబయలయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తదితరులపై అట్రాసిటీ, హత్నాయత్నం, వాహనం ధ్వంసం కేసులు నమోదు చేసి ఆలూరు కోర్టులో హాజరు పరచగా 14 రోజులు కర్నూలు జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించాలని జడ్జి ఆదేశించారు.
ఘటనలో లేని వారిపైనా కేసులా..!
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు శ్రీకాకుళం వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో జన ప్రభంజనాన్ని చూసి కంటిపై కునుకు కరువైన సీఎం చంద్రబాబు తప్పుడు కేసులకు పోలీసులను పురిగొల్పారు. మహిళా ఎస్‌ఐ ప్రవల్లికపై దాడి చేసినట్లు ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవితోపాటు మరో 20 మందిపై అక్రమ కేసులు పెట్టారు. అసలు ఆ రోజు ఘటనా స్థలంలోనే లేని వారిపై కేసులు బనాయించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. తనపై కక్ష సాధించేందుకు కుట్రలకు తెరతీసి అక్కడలేని 20 మంది అమాయకులపై అక్రమ కేసులు బనాయించారని చింతాడ రవి వీడియో విడుదల చేయడంతో కలకలం రేగింది. ఏ–8గా చూపించిన లాయర్ ధనేటి రామ్మోహనరావు ఘటన సమయంలో ఆమదాలవలస కోర్టులోనే ఉన్నారు. ఆ కేసులో ఏ–9గా ఉన్న ప్రైవేట్ ఉద్యోగి తేజేశ్వరరావు ఘటన జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్‌లోనే లేరు. ఆయన తన కుమార్తెను యూనివర్శిటీలో చేర్చేందుకు పంజాబ్ వెళ్లారు. ఏ–11 డాక్యుమెంట్ రైటర్ సురేష్ ఆ రోజు సబ్–రిజి్రస్టార్ ఆఫీసులోనే ఉన్నారు. ఘటన సమయంలో దూరంగా ఉన్న, సంబంధం లేని వ్యక్తులనూ నిందితులుగా చేర్చడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని ప్రజలు తప్పుబడుతున్నారు.
రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చేశారు..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ బీసీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన దీన్ని ఏకంగా హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం రాజకీయ కక్షసాధింపు అని ప్రజలు తప్పుబడుతున్నారు. సాధారణ సెక్షన్లతో సరిపెట్టాల్సిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి చదువుకునే యువకుడిని, మాజీ మంత్రిని ఇబ్బందుల పాలుచేసేలా టీడీపీ పెద్దల డైరెక్షన్‌లోనే పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 
మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కోసం ఏలూరు బలగాల మోహరింపు..
గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా అధికారపక్షం ఇదే తరహా రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఓ వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ పోలీసులు తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం? వైఎస్సార్‌సీపీ నాయకుడు కాబట్టే కేసు పెడతారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏలూరు జిల్లాకు చెందిన పోలీసులు భారీ సంఖ్యలో గుంటూరు చేరుకుని ఐదు బృందాలుగా ఏర్పడి ముస్తఫాను అరెస్టు చేయడానికి చేస్తున్న యత్నాలు రెడ్‌బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనం. 


