మాజీ సీఐ నాగరాజుకు సిట్ ప్రశ్న
ఐదో రోజూ కొనసాగిన విచారణ
ఏ ప్రశ్నకూ నోరు మెదపని నాగరాజు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, లాకప్‌డెత్, డెడ్‌బాడీ మాయం కేసులో మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు ఐదో రోజు సోమవారం ప్రశ్నించారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులు, స్టేషన్ సిబ్బంది లింకులపై ఆరా తీశారు. నాగరాజుతో సన్నిహితంగా ఉండే వారి గురించి కూడా అడిగారు. ప్రైవేటు వ్యక్తులతో మీకు సంబంధం ఏంటని ప్రశ్నించగా నాగరాజు నోరు మెదపలేదని సమాచారం. సాయికృష్ణ కేసులో మరో సీఐ ప్రమేయంపై కూడా సిట్ ప్రశ్నలు వేసింది.
లాకప్ డెత్, మృతదేహం మాయం కేసులో మీకు ఓ సీఐ సహకరించినట్లు ఆరోపణలున్నాయని అవి నిజమేనా? మీకు సహకరించిన సీఐ ఎవరు? అని సిట్ అడగ్గా, నాగరాజు మౌనంగానే ఉన్నట్లు సమాచారం. సాయికృష్ణతో మీకు ఏమైనా వ్యక్తిగత విభేదాలున్నాయా, ఎందుకు అంత క్రూరంగా అతడిని హింసించారని సిట్ అధికారులు ప్రశ్నించారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులు మీకు సాయికృష్ణను అప్పగించినప్పుడు ఏమైనా గాయాలున్నాయా, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారిపై వచ్చిన ఆరోపణలు నిజమేనా అని సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా ఏమైనా టార్చర్ చేశారా, అతని తల్లి ఆరోపణలకు మీరు ఏమి సమాధానం చెబుతారంటూ సిట్ ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. కాగా సిట్ అడిగిన ఏ ప్రశ్నకూ నాగరాజు నోరు మెదపలేదని సమాచారం.


