మాట్లాడుతున్న భీశెట్టి బాబ్జీ
ఆర్‌ఆర్‌బీని అమరావతిలో పెట్టాలని కేంద్ర మంత్రికి సీఎం లేఖ రాయడం దుర్మార్గం
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ధ్వజం
విశాఖ విద్య: ‘చంద్రబాబు నిత్యం ఉత్తరాంధ్ర పేరును జపించడం అంతా ఉత్తదే. వాస్తవానికి ఆయన ఆలోచలన్నీ అమరావతిని అభివృద్ధి చేయడంపైనే ఉన్నాయి. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి చంద్రబాబు లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం’ అని విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు ధ్వజమెత్తారు. లోక్‌సత్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ రైల్వే జోన్ ఎక్కడ ఉంటే అక్కడే ఆర్‌ఆర్‌బీ ఉండాలని, అలాకాకుండా ఆర్‌ఆర్‌బీని అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి లేఖ రాయడం దుర్మార్గమని మండిపడ్డారు.
కొందరికి మాత్రమే ఉపయోగపడే భోగాపురం విమానాశ్రయాన్ని చూపించి లక్షలాది మంది ఉత్తరాంధ్రకు చెందిన నిరుద్యోగులకు ఉపయోగపడే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును అమరావతికి ఎత్తుకుపోవడమేనా చంద్రబాబు తెలివితేటలు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రైల్వే ఉద్యోగాల పరీక్షల కోసం ఒడిశాకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు ఉత్తరాంధ్ర యువతకు తెలుసని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటాల ఫలితంగానే రైల్వే జోన్ వచి్చందని, ఇప్పుడు ఆర్‌ఆర్‌బీ కోసం మరో ఉద్యమం అవసరమని స్పష్టంచేశారు.
విశాఖలో ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు కోసం సంతకాల సేకరణ చేపట్టాలని, ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, సీపీఐ నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి, పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.


