మంత్రి లోకేశ్‌తో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు షరీఫ్
రాజకీయ ప్రమేయంతో కేసు నమోదులో జాప్యం
బాలికను గత ఏడాది నుంచే వేధిస్తున్నట్టు ఫిర్యాదు
రావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్త కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై అదే పాఠశాల పేరెంట్స్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, టీడీపీ కొత్తపేట నియోజకవర్గ మైనార్టీ చైర్మన్ రహ్మతుల్లా షరీఫ్ అసభ్యంగా(బ్యాడ్ టచ్) ప్రవర్తించినట్టు బాలిక బంధువులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం రావులపాలెం పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని మీడియాకు చూపించారు.
బాలిక నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచే షరీఫ్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, బాలిక బుగ్గలు, నడుము, గుండెలపై చేతులు వేస్తూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు అధికార పారీ్టకి చెందిన కీలక నేత కావడంతో రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పైనుంచి ఒత్తిడి పెరుగుతోందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఘటనపై పాఠశాలకు పోలీసులు, విద్యాశాఖ అధికారులు వెళ్లి విచారణ జరిపారు. దీనిపై డీఈఓకు నివేదిక పంపించామని ఎంఈఓ ఆర్.నాగకుమార్ చెప్పారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, కేవలం రిప్రజెంటేషన్ మాత్రమే వచి్చందని, ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని రావులపాలెం ఎస్‌హెచ్‌ఓ రమే‹Ùబాబు తెలిపారు.
పోలీసులతోనూ నిందితుడికి సాన్నిహిత్యం
పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులపై సమాచారం అందిన వెంటనే పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. కానీ, ఇక్కడ అలా జరగలేదు. గతంలో మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ముఖ్య అనుచరుడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ మాడవిని రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు షరీఫ్ పోలీసులకు ట్రాన్స్‌లేటర్‌గా పని చేశాడు. ఆ కారణంగా షరీఫ్‌కు పోలీసులతో సాన్నిహిత్యం ఉందనే ప్రచారమూ ఉంది. అధికార పార్టీ నేతపై ఆరోపణలు రావడంతోనే కేసు నమోదులో జాప్యం జరుగుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


