జీయూటీబీ అంటే ఏమిటి? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? | Genitourinary Tuberculosis Symptoms Causes Treatment | Sakshi
Sakshi News home page

జీయూటీబీ అంటే ఏమిటి? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

Aug 4 2026 4:49 AM | Updated on Aug 4 2026 4:49 AM

Genitourinary Tuberculosis Symptoms Causes Treatment

హెల్త్‌

ట్యూబర్క్యులోసిస్‌ అంటే... చదువుకున్నవారికి తప్ప పెద్దగా తెలియని ఈ వ్యాధిని టీబీ అంటే సామాన్యజనం కూడా గుర్తుపడతారు. ఇదెంతో పురాతనమైన వ్యాధి. ఎంత పురాతనమైనదంటే... క్రీ.పూ. 8000 ఏళ్ల కిందట ఈజిప్షియన్‌ మమ్మీలలోనూ ఈ వ్యాధి తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాదు... మన స్వాతంత్ర సంగ్రామంలోనూ జైళ్లలో ఉంచే ఖైదీలు కూడా దాదాపు ఈ వ్యాధిబారిన పడే మరణానికి చేరువయ్యేవారు.

ఎందుకంటే... చీకటిలో, తేమలో ఈ వ్యాధికి కారణమయ్యే క్రిమి పెరుగుతుంది. యాంటీబయాటిక్స్‌ కనుగొనేవరకూ ఇది చికిత్స లేని వ్యాధే. అయితే ధారాళంగా గాలీ, వెలుతురూ వచ్చే చోట ఈ వ్యాధి కారక క్రిమి పెరగదు కాబట్టి అప్పట్లో చికిత్స లేనిరోజుల్లో శానిటోరియమ్‌ అని పిలిచే గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చే చోట ఉంచి బాధితులకు చికిత్స అందించేవారు. సాధారణంగా టీబీ అంటే ఎడతెరిపి లేకుండా విపరీతంగా దగ్గు వస్తూ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధిగా భావిస్తారు. కానీ... ఈ వ్యాధి ప్రధానంగా కేవలం ఊపిరితిత్తులనే కాదు... దేహంలోని అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేయవచ్చు. అలా మూత్రవ్యవస్థ, మూత్రవిసర్జక వ్యవస్థలను దెబ్బతీసే టీబీని ‘జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్‌’ లేదా ‘జీయూటీబీ’ అంటారు. ఈ నేపథ్యంలో అసలు ‘జీయూటీబీ’ అంటే ఏమిటో  చూద్దాం...

మన దేశంలో ఇప్పటికీ ప్రతి లక్ష మంది జనాభాలో దాదాపు 187 నుంచి 192 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు అంచనా. 2015 నాటి గణాంకాలతో పోలిస్తే మన దేశంలో బాధితుల సంఖ్య దాదాపు 21% తగ్గినప్పటికీ... ఇప్పటికీ ప్రపంచంలోని టీబీ బాధితుల్లో 25% మంది (అంటే మొత్తం ప్రపంచంలోని పేషెంట్లలో నాలుగో వంతు) భారత్‌లోనే ఉండటం ఒకింత ఆందోళనగొలిపే అంశమే. అంతేకాదు... ప్రపంచంలోని టీబీ మరణాల్లో దాదాపు 28% అంటే దగ్గర దగ్గర మూడోవంతు మనదేశంలోనే జరుగుతుండటం కూడా టీబీ నివారణా, చికిత్సలపై మనం మరింతగా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపే అంశం.

ఊపిరితిత్తులనే కాదు, ఇతర వ్యవస్థల్లో కూడా... 
సాధారణంగా టీబీ అనేది ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యవస్థలనే దెబ్బతీస్తుందన్న విషయం దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే అది దేహంలోని   మిగతా దేహవ్యవస్థలనూ దెబ్బతీసే అవకాశాలూ ఉంటాయి. ఇలా ఇతర వ్యవస్థలను ప్రభావితం చేసే టీబీని ‘ఎక్స్‌ట్రా పల్మునరీ టీబీ’గా పేర్కొంటారు. మొత్తం ఎక్స్‌ట్రా పల్మునరీ కేసుల్లో నాలుగు శాతం జీయూటీబీ కేసులు ఉంటాయన్నది మరో అంచనా.

వ్యాప్తి ఇలా / ప్రభావితమయ్యే అవయవాలివి...  
ట్యూబర్క్యులోసిస్‌ బ్యాసిల్లస్‌ అని పిలిచే బ్యాక్టీరియా క్రిమితో వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని సంక్షిప్తంగా టీబీగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. మిగతా సాధారణ టీబీ కేసుల్లోలాగే ఈ ‘జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్‌’ లేదా ‘జీయూటీబీ’ కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి వాప్తి చెందుతుంది. అలా వ్యాపించిన ‘ట్యూబర్క్యులోసిస్‌ బ్యాసిల్లస్‌’ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు రక్తంలోకి వ్యాప్తించి అక్కడి నుంచి  మూత్రవిసర్జన వ్యవస్థలోకి కూడా వ్యాప్తి చెందుతాయి.

మూత్రవ్యవస్థలోని ఏయే అవయవాలపై దుష్ప్రభావాలంటే... 
మూత్రవ్యవస్థలోకి బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు సాధారణంగా అవి మూత్రపిండా (కిడ్నీ)లను దెబ్బతీస్తాయి. కిడ్నీల నుంచి క్రమంగా మూత్రాశయానికి వచ్చే పైపులైన యూరేటర్స్‌కూ, అక్కడ్నుంచి మూత్రాశయం (యూరినరీ బ్లాడర్‌), ప్రోస్టేట్‌ గ్రంథి, వృషణాల నుంచి శుక్రకణాలను బయటకు తెచ్చే సెమినల్‌ వెసికిల్స్‌తో ΄ాటు వృషణాలకూ వ్యాప్తించి, ఆ అన్ని అవయవాలపైనా తమ దుష్ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ జీయూటీబీతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.  

ముప్పు (రిస్క్‌) ఎవరిలోనంటే... 
సాధారణంగా అది ఏ తరహా టీబీ అయినప్పటికీ... ఒకసారి దేహంలో టీబీ వచ్చిందంటే వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థం. ఎందుకంటే దాదాపు దేశంలోని 85% మందిలో టీబీ క్రిమి అంతర్లీనంగా (డార్మంట్‌గా)  ఉంటుందని అంచనా. అయితే ప్రజల్లో ఉండే వ్యాధి నిరోధక శక్తి కారణంగా అది తన ప్రభావం చూపలేదు. అయితే... సాధారణంగా టీబీ వచ్చిన బాధితుల్లో లేదా ఎక్స్‌ట్రా పల్మునరీ టీబీ వచ్చిన వాళ్లలోనూ, వ్యాధి నిరోధక శక్తి తగ్గినవాళ్లలో, చాలాకాలం ΄ాటు టీబీతో బాధపడేవారితో సన్నిహితంగా ఉండేవాళ్లలో అన్ని రకాల టీబీలతో ΄ాటు ‘జీయూటీబీ’ కూడా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

నిర్యక్ష్యం తగదు... ఎందుకంటే... 
ఒకసారి ఈ వ్యాధిని అనుమానించక అలాగే నిర్లక్ష్యం చేస్తే కొందరిలో కిడ్నీ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. ఒకసారి కిడ్నీ దెబ్బతిన్నదంటే... అటు తర్వాత అది మళ్లీ మునపటి పనితీరును ప్రదర్శించలేనంతగా దెబ్బతినే అవకాశమూ ఉండవచ్చు. మూత్రాశయం (బ్లాడర్‌) సామర్థ్యం కూడా తగ్గవచ్చు. అలాగే ఈ సమస్య వచ్చిన కొందరిలో సంతనలేమి (ఇన్‌ఫెర్టిలిటీ) సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే సాధారణ యాంటీబయాటిక్‌ కోర్సు ముగిశాక కూడా మూత్రం ఇన్ఫెక్షన్‌ తగ్గని సందర్భాల్లో చాలా అప్రమత్తంగా ఉండి డాక్టర్ల సలహా మేరకు తగిన పరీక్షలన్నీ  చేయించాలి.

జీయూటీబీ నిర్ధారణ ఇలా... 
మామూలు మూత్రపరీక్షలతో ‘జీయూటీబీ’ నిర్ధారణ చేయడం అంతగా కుదరకపోవచ్చు. అందుకే... జీయూటీబీ నిర్ధారణ కోసమే ప్రత్యేకంగా నిర్వహించాల్సిన ‘న్యూక్లియిక్‌ యాసిడ్‌ యాంప్లిఫికేషన్‌ సాంకేతికత (ఎన్‌ఏఏటీ) సహాయంతో ‘΄ాలిమరేజ్‌ చైన్‌ రీయాక్షన్‌’ (పీసీఆర్‌) పరీక్ష చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్ష కూడా నూరు శాతం కేసుల్లో పూర్తిగా సరైన నిర్ధారణ చేయలేకపోవచ్చు. అయినప్పటికీ జీయూటీబీకి చాలావరకు ఇదే మంచి నిర్ధారణ పరీక్ష. అయితే కొన్ని సందర్భాల్లో ‘ఫాల్స్‌ నెగెటివ్‌’ ఫలితం కూడా రావచ్చు. అందుకే సాధారణ ఇన్ఫెక్షన్‌లా కనిపిస్తూ అందరి కనుగప్పే లక్షణాలున్నందున... అనుమానం వచ్చిన కేసుల్లో  డాక్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అలాగే అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎక్స్‌–రే పరీక్షలనూ నిర్వహిస్తారు.

ఇలా కేవలం... నిర్దిష్టంగా ఒకే పరీక్ష కాకుండా... లక్షణాల ఆధారంగా, ప్రత్యేక పరీక్షలతో ΄ాటు రొటీన్‌ సీటీ స్కాన్, ఎక్స్‌–రే పరీక్షలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాధిని నిర్ధారణ చేస్తారు.

సూచన: కొందరిలో ఈ వ్యాధి ఖచ్చితంగా పూర్తిస్థాయిలో నిర్ధారణ సాధ్యం కాకపోవచ్చు. అయితే కొన్ని మార్గదర్శకాల ఆధారంగా సదరు బాధితులు ‘యాంటీ ట్యూబర్కులార్‌ చికిత్స–ఏటీటీ’కి అర్హులని డాక్టర్లు నిర్ణయిస్తారు.

లక్షణాలు..

  • ‘జీయూటీబీ’ ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి...

  • చాలా తరచుగా లేదా త్వరత్వరగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం.

  • మూత్ర విసర్జన ఫీలింగ్‌ను ఆపుకోలేకపోవడం.

  • కొన్నిసార్లు మూత్రం ఎరుపు రంగులో రావడం.

  • ఈ లక్షణాలతో కొన్ని సందర్భాల్లో ‘జీయూటీబీ’ని మూత్రంలో వచ్చే సాధారణ  ఇన్ఫెక్షన్‌ (జనరల్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌–యూటీఐ)గా పొరబడే అవకాశాలు ఉంటాయి. లేదా తరచూ మూత్రవిసర్జనకు వెళ్తుండటంతో ‘ఓవర్‌ యాక్టివ్‌ బ్లాడర్‌’ అని కూడా పొరబడే అవకాశాలూ ఎక్కువే.

  • మూత్రపరీక్ష నిర్వహించినప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు తెలియవచ్చు.  అయితే  అది నిర్దిష్టంగా ఫలానా ఇన్ఫెక్షన్‌ అని తెలియకపోవచ్చు. అలాంటి ఇన్ఫెక్షన్‌ను ‘స్టెరైల్‌ పైయూరియా’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో దాన్ని మామూలుగానే ఇన్ఫెక్షన్‌గానే పరిగణంచి డాక్టర్లు సాధారణంగా  ‘యాంటీబయాటిక్స్‌’ వాడతారు.

  • అయితే సమస్య జీయూటీబీ కావడం వల్ల ఆ యాంటీబయాటిక్స్‌తో ఎలాంటి ప్రయోజనమూ కనిపించదు. కొందరిలో  కొన్ని సూచనలు ప్రత్యేకంగా కనిపించవచ్చు. ఉదాహరణకు... చాలా తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, బరువు బాగా తగ్గిపోవడం, సాయంత్రాలు ఒళ్లు వెచ్చబడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీటి ఆధారంగా ‘జీయూటీబీ’ని అనుమానించాల్సి ఉంటుంది.

చికిత్స...
∙అది జీయూటీబీ అని నిర్ధారణ అయ్యాక ‘యాంటీ ట్యూబెర్క్యులార్‌ చికిత్స’ (ఏటీటీ)ని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇది కొన్ని మందుల కాంబినేషన్లతో (మల్టీ డ్రగ్‌ థెరపీ) రూపంలో ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ రోజుల ΄ాటు డాక్టర్లు చికిత్స కొనసాగిస్తారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీబీకి ప్రత్యేకంగానూ, ఉచితంగానూ మందులు ఇస్తుంటారు.

కొన్ని కేసుల్లో ‘యాంటీ ట్యూబెర్క్యులార్‌ చికిత్స’... అంటే ఏటీటీ ట్రీట్‌మెంట్‌ అందిస్తూనే... కిడ్నీలు  మరింతగా దెబ్బతినకుండా ఉండేందుకు, వాటి పనితీరును సంరక్షించడానికి తాత్కాలిక స్టెంట్లు వేయడం, శస్త్రచికిత్స చేయాల్సి రావడం వంటి చికిత్సలూ చేయాల్సి రావచ్చు.

మరికొందరు బాధితుల్లో... మిగతా సాధారణ టీబీ లాగానే ఈ జీయూటీబీ కూడా.. మల్టీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరగడంతో వ్యాధి బాగా ముదిరిపోతుంది. దాంతో వాళ్లలో మూత్రవిసర్జక వ్యవస్థ దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఇలాంటి కొందరిలో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. అరుదుగా కొందరిలో కిడ్నీల నుంచి మూత్ర విసర్జనకు తోడ్పడే యురేటర్స్‌ను పునర్నిర్మించడం వంటి శస్త్రచికిత్సలూ అవసరం పడవచ్చు. మరికొందరిలో మూత్రాశయం దెబ్బతిన్నప్పుడు...    మూత్రాశయాన్నీ, వారి చిన్నపేగులను అనుసంధానిస్తూ చేసే ‘ఆగుమెంటేషన్‌ సిస్టో΄్లాస్టీ’ అనే చికిత్స చేయాల్సి రావచ్చు. మూత్రాశయం పనితీరును మెరుగుపరచడానికి ఈ చికిత్స చేయాల్సివస్తుంది.

కొన్ని ప్రభుత్వ కార్యకలా΄ాలు కూడా... 
ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌:  కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా / చికిత్స ప్రణాళికల ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు టీబీని పూర్తిగా రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా టీబీని పూర్తిగా నిరోధించే లక్ష్యంతో ‘ప్రధాన్‌ మంత్రి టీబీ ముక్త్‌ అభియాన్‌’ అనే కార్యక్రమం మొదలైంది. 

మరిన్ని కొత్తమందులతో చికిత్సా ప్రణాళికలు (న్యూ డ్రగ్‌ రెజిమెన్స్‌) : మిగతా టీబీల్లాగే ఈ టీబీలోనూ మందులు వాడటం మొదలుపెట్టగానే లక్షణాలన్నీ క్రమంగా తగ్గడం, మటుమాయం కావడం జరుగుతుంటుంది. దాంతో చాలామంది తమకు నయమైపోయిందనే భావనతో పూర్తి కోర్సు వాడకుండానే మందులు మానేస్తుంటారు. అయితే టీబీ సూక్ష్మజీవి ఆ మందులకు తన నిరోధకత పెంచుకుని మళ్లీ విజృంభిస్తుంది. దాంతో మునుపు వాడిన మందుల ప్రభావం అంతగా కనిపించదు. ఇలాంటివారికి ‘బీపీయేఎల్‌ ఎమ్‌’ అనే  ప్రత్యేక మందుల కోర్సు ప్రణాళిక (రెజిమెన్‌)ను డాక్టర్లు సిఫార్సు చేస్తారు.

వినూత్న సాంకేతికతతో: ఇటీవల టీబీపై పూర్తి అదుపు సాధించడానికి ఎక్స్‌–రేలూ, ఇతర రేడియాలజీ ఇమేజింగ్‌ చిత్రాలను విశ్లేషించడానికి కృత్రిమ మేధ (ఏఐ)తో అనుసంధానం చేయడం, ఖచ్చితంగా జీయూటీబీని గుర్తించడం వంటి వినూత్న సాంకేతికతను అవలంబిస్తున్నారు.

చివరగా... మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్‌ (యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ –యూటీఐ) కనిపించినప్పుడు సాధారణ యాంటీబయాటిక్స్‌తో లక్షణాలు తగ్గకపోతే... నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా జీయూటీబీని అనుమానించి తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.

- డాక్టర్‌ ఎ.వి. రవికుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, యూరాలజిస్ట్‌ – ఆండ్రాలజిస్ట్‌

నిర్వహణ : యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement