సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్ మంత్రిపై లైంగిక ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ కీలక కేబినెట్ మంత్రి తనను లైంగికంగా వేధించారంటూ అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్ఆర్ఐ మహిళ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
షైలా అనే పేరుతో ఉన్న సదరు ఎన్ఆర్ఐ మహిళ, మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వరుస పోస్టులు పెట్టారు. పేద పిల్లలకు సహాయం చేసేందుకు, సామాజిక సేవా కార్యక్రమాల నిమిత్తం తాను మంత్రి అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన 'నాటా' వేడుకల సమయంలో సదరు మంత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించారు.
అపాయింట్‌మెంట్ అడిగితే కాఫీ షాప్‌నకు ఒంటరిగా రావాలని ఒత్తిడి తెచ్చారని, అంతేకాకుండా కాళ్లు, చేతుల ఫోటోలు పంపిస్తూ అసభ్యకరంగా వ్యవహరించారని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వేధింపుల ఉదంతంపై నారా లోకేష్‌కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అయినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలోనే సదరు మంత్రికి సంబంధించిన ఫోటోలు, ఆయన ఉపయోగించిన ఫోన్ నెంబర్లతో సహా పూర్తి ఆధారాలను బహిర్ఘతం చేస్తానని సదరు ఎన్ఆర్ఐ మహిళ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉదంతంపై టీడీపీలో చర్చాంశనీయంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నాయకుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి అయి ఉంటారని, గతంలో ఆయన నాటా సదస్సుకు హాజరయ్యారని పార్టీ వర్గాల్లో అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లేదా సదరు మంత్రి అధికారికంగా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


