సాక్షి, మదనపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట తెరపైకి రాగానే ఉమ్మడి జిల్లాలోని ఆశావాహుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. టికెట్ ఆశిస్తున్న నేతలు అప్పుడే ముఖ్య నాయకులను, ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారిపోయారు. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తూ.. గ్రామస్థాయిలోని చోటా లీడర్లను ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అప్పుడే శక్తికి మించిన హామీలు గుప్పిస్తున్నారు. వీలైనన్ని చోట్ల బెదిరింపులతోనో, ప్రలోభాలతోనో ఏకగ్రీవాలు చేసుకోవాలని ఇప్పటి నుంచే తెరవెనుక పావులు కదుపుతుండటం గమనార్హం. నోటిఫికేషన్ రాకముందే క్షేత్రస్థాయిలో ఈ రేంజ్ పొలిటికల్ హీట్ ఉంటే, ఇక నోటిఫికేషన్ వెలువడ్డాక ఇంకెంత సందడి నెలకొంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కోర్టు మొట్టికాయలతోనే ‘స్థానిక’ చలనం
రాష్ట్రంలో అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హఠాత్ ప్రకటన వెనుక అసలు గుట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనల ప్రకారం.. స్థానిక సంస్థల పాలకవర్గాలు రద్దు కాగానే నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు వెళితే ఘోరమైన ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించి, రకరకాల కుంటిసాకులతో ఎన్నికలను ఇన్నాళ్లూ వాయిదా వేయిస్తూ వచ్చింది. అయితే, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) తీవ్రంగా జోక్యం చేసుకుని గడువు విధించడంతో.. ఇప్పుడు కూటమి సర్కారుకు ఎన్నికలకు వెళ్లక తప్పని సరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అసలు అక్టోబర్‌లో ఎన్నికలు సాధ్యమేనా?
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఓవైపు చెబుతున్నప్పటికీ.. ఆచరణలో అది ఇప్పట్లో సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావాల్సి ఉంది. దీనికి తోడు ఓటర్ల జాబితాకు ఇంకా తుది రూపమే రాలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ముసాయిదా జాబితాను గత నెల 31న విడుదల చేశారు. ఈ ప్రక్రియ ప్రకారం రాబోయే అక్టోబరు 3 న మాత్రమే ఓటర్ల తుది జాబితా వెలు వడనుంది. ఆ తర్వాతే పంచాయతీల వారీగా ఓటర్ల సంఖ్యను విడదీసి తేల్చాల్సి ఉంటుంది. అంతవరకు అసలు నోటిఫికేషన్ ఇచ్చేందుకే వీలుపడదు.
సాంకేతిక అవరోధాల నడుమ చంద్రబాబు ‘స్థానిక’ రాజకీయం
రాష్ట్రంలో అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న మాటలు ఆచరణలో సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ముందు పూర్తి కావాల్సిన మున్సిపల్ చైర్మన్లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఇంకా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మరోవైపు వచ్చే సెప్టెంబరులో మండల పరిషత్‌ల పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు తేల్చాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా ఓట్ల సవరణ (సర్) ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదు. పంచాయతీల కాలపరిమితి ఎప్పుడో ముగిసినప్పటికీ, ఓట్ల జాబితా తేలకుండా ఎన్నికల సంఘం అనుమతితో ప్రక్రియ చేపట్టడం కూడా అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో, అక్టోబరులో ఎన్నికలు జరగడం అసాధ్యమనే స్పష్టత వస్తోంది.
ఇదంతా కేవలం ‘క్యాడర్’ కోసమే?
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించిన దాఖలాలు లేవని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇన్ని సాంకేతిక, న్యాయపరమైన అవరోధాలు అడ్డుగా ఉన్నాయని తెలిసి కూడా.. ‘అక్టోబరులో ఎన్నికలు’ అంటూ ఆయన పదేపదే హడావుడి చేయడం వెనుక అసలు రహస్యం వేరే ఉందనే చర్చ తమ్ముళ్లలోనే నడుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీవ్ర అసంతృప్తితో ఉన్న తమ పార్టీ క్యాడర్‌లో ఎలాగైనా పొలిటికల్ జోష్ నింపేందుకే బాబుగారు ఈ ఎన్నికల పల్లవి అందుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ప్రాథమిక కసరత్తు కూడా మొదలు పెట్టకుండా, కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా పార్టీ శ్రేణులను మభ్యపెట్టేందుకే కూటమి సర్కార్ ఈ సరికొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని రాజకీయ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి.
కరువు కోరల్లో సీమ.. తుఫాన్ల ముప్పు..
ప్రస్తుతం ఎన్నికలకు వెళితే అధికార తెలుగుదేశం కూటమికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లావ్యాప్తంగా తాగునీటికి కటకటలాడాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో ఎక్కడా పంటలు సాగు కాక రైతాంగం అల్లాడుతోంది. శ్రీశైలంలో సరిపడా నీరు ఉన్నప్పటికీ సీమ తాగునీటి అవసరాలకు సైతం విడుదల చేయని దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మరోవైపు అక్టోబరు నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అంటున్నా.. ఆ సమయంలో రాష్ట్రంలో తుఫాన్ల ప్రభావం అత్యంత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సాంకేతిక, ప్రకృతి అవరోధాల నేపథ్యంలో ఈ ఏడాదిలో స్థానిక ఎన్నికలు జరగడం అసాధ్యమని, ఇవన్నీ జనాన్ని నమ్మించడానికి ఆడుతున్న డ్రామాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా స్థానిక సంస్థల వివరాలు
మదనపల్లె (సెలక్షన్ గ్రేడ్), రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలు, బి.కొత్తకోట నగర పంచాయతీ ఉన్నాయి.
వీటిలో బి.కొత్తకోట నగర పంచాయతీ పై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇది క్లియర్ అయితే గాని ఎన్నిక జరగదు.
మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కొత్తగా వార్డుల సంఖ్య పెంపు, తిరిగి కొత్తగా వార్డుల ఏర్పాటు జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు.
జిల్లాలో 25 మండలాలు ఉండగా, 25 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. 25 మంది ఎంపీపీలు ఉన్నా రు. వీరి పదవీకాలం సెపె్టంబర్ లో ముగుస్తుంది.
జిల్లాలో 411 గ్రామపంచాయతీలు, వాటిలో 4,230 వార్డులు ఉన్నాయి. (వీరి పదవి కాలం ముగిసింది, పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి)ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీన (గురువారం) రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో జరగబోయే కీలక సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది.


