క్రాప్ హాలిడే ప్ర‌క‌టించిన కోనసీమ రైతులు | Thadikona farmers declare crop holiday over irrigation drain neglect | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌లో క్రాప్ హాలిడే ప్ర‌క‌టించిన రైతులు

Aug 5 2026 2:26 PM | Updated on Aug 5 2026 2:34 PM

Thadikona farmers declare crop holiday over irrigation drain neglect

వరిసాగు చేయకూడ‌ద‌ని తాడికోన గ్రామ రైతుల నిర్ణ‌యం

అమ‌లాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తాడికోన గ్రామ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. సుమారు 250 ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేయకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆక్వా చెరువుల నుంచి కలుషిత నీరు వ్యవసాయ పొలాల్లోకి చేరుతోందని, త‌మ పొలాలు వ్య‌వ‌సాయానికి ప‌నికిరాకుండా పోతున్నాయ‌ని రైతుల ఆరోపిస్తున్నారు. ఈ మేర‌కు తాడికొన గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్‌కు వినతిపత్రం స‌మ‌ర్పించారు.

గడచిన 20 ఏళ్లుగా సాగు నీరు కలుషితమవుతోందని రైతులు ఆవేదన వ్య‌క్తం చేశారు. డ్రైనేజీ వ్యర్థాలు, ఆక్వా వ్యర్ధాలు నేరుగా పంటకాల్వల్లో చేరి సారం తగ్గిపోతుందంటూ ఆందోళన వెలిబుచ్చారు. పంట కాలువలను శుభ్రపరచి, డ్రైనేజీ, ఆక్వా వ్యర్థాలు కాలువల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు స్పందించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని తాడికొన గ్రామ రైతులు కోరుతున్నారు. 

ఆక్రమణల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి
అమలాపురం రూరల్‌: ‘పీకలేరు డ్రెయిన్‌ పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో పాటు స్థానిక ఆక్వా చెరువుల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరుతున్నాయి. దీనివల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నాం’ అని అల్లవరం మండలం తాడికోన గ్రామ రైతులు కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు విరామం ప్రకటించిన నేపథ్యంలో వారు వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ఆధ్వర్యాన అమలాపురంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మంగళవారం కలిశారు.

ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ, పీకలేరు డ్రెయిన్‌పై ఆక్రమణలు తొలగించేందుకు, ఆక్వా చెరువుల వ్యర్థాలు పంట పొలాల్లో చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో సాగు చేయడం వల్ల మరింత నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే రైతులు క్రాప్‌ హాలిడే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌.. అధికారుల బృందాన్ని పరిశీలనకు పంపించి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు అండగా ఉంటాం 
క్రాప్‌ హాలిడే ప్రకటించిన తాడికోన గ్రామ రైతులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఆయనను తాడికోన రైతులు కలిసి తమ సమస్యను వివరించి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, గ్రామ పరిధిలో పీకలేరు డ్రెయిన్‌ ఆక్రమణలతో వస్తున్న ఇబ్బందులను రైతులు తెలియజేసినప్పటికీ అధికా రులు స్పందించలేదని, అందువల్లనే రైతులు పంట విరామం ప్రకటించారని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే రైతులతో కలిసి వరి చేల వద్ద నిరసన తెలుపుతామని కుడుపూడి స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, నాయకులు గుత్తుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement