రొయ్యకు రెస్ట్‌.. ‘ఆక్వా’ క్రాప్‌ హాలిడే | Crop Holiday for Aqua Farmers in AP | Sakshi
Sakshi News home page

రొయ్యకు రెస్ట్‌.. ‘ఆక్వా’ క్రాప్‌ హాలిడే

Apr 8 2025 5:27 AM | Updated on Apr 8 2025 5:27 AM

Crop Holiday for Aqua Farmers in AP

పూలపల్లి వై జంక్షన్‌ వద్ద పాలకొల్లు, ఆచంట, నరసాపురం ఆక్వా రైతుల ధర్నా

జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు మూడు 

నియోజకవర్గాల్లో అమలుకు నిర్ణయం 

జూన్‌ నెలాఖరుకు రైతులంతా పంట 

ముగించుకోవాలని ఆక్వా రైతు సంఘం పిలుపు 

రైతులను ఆదుకోవటంలో కూటమి సర్కారు తీరును నిరసిస్తూ పాలకొల్లులో ధర్నా

పాలకొల్లు సెంట్రల్‌: ఆక్వా రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కారు అలసత్వాన్ని నిరసిస్తూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు మూడు నెలలు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఆక్వా రైతు సంఘం నేతలు కార్యాచరణ ప్రకటించారు. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధించిన పన్నులను సాకుగా చూపిస్తూ ప్రాసెసింగ్‌ యూనిట్లు రొయ్య రైతులను నిలువునా దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ధరలు తగ్గించే అధికారం ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఎవరిచ్చారని నిలదీశారు. వరికి మద్దతు ధర నిర్ణయించినట్లుగానే ఆక్వాకు కూడా ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆక్వాకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అని చెప్పిన చంద్రబాబు మరో రూ.1.50 అదనంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతులంతా కలసికట్టుగా సమస్యను పరిష్కరించుకోవాలని జై భారత్‌ క్షీరా­రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు పిలుపునిచ్చారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి వై జంక్షన్‌ వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు పాలకొల్లు, నరసాపురం, ఆచంట  నియోజకవర్గాలకు చెందిన ఆక్వా రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పూలపల్లి వై జంక్షన్‌ వద్ద ధర్నా చేశారు. 

అనంతరం ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రొయ్యలకు కనీస ధర రూ.250 ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం రూ.90 నుంచి రూ.50 వరకు తగ్గించి అడుగుతున్నారని, ఇంత తక్కువ రేటుకు అమ్ముకున్నా ఒకటే.. చెరువులో వదిలేసినా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌ నెలాఖరుకు అందరూ ఆక్వా పంట ముగించుకోవాలని, మూడు నియోజకవర్గాల రైతులంతా దీన్ని పాటించాలని రైతు సంఘం నేతలు సూచించారు. 

రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ నుంచే 80 శాతం ఆక్వా పంట వస్తోందని, ప్రభుత్వం ఎవరెవరినో సంప్రదిస్తే కుదరదని, రైతు సంఘాలతోనే చర్చించి ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఫీడ్‌ కంపెనీలపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు.  

ఫీడ్‌ ధరలు ఎందుకు తగ్గించరు? 
ముడి సరకు ధర పెరిగినప్పుడు ఫీడ్‌ కంపెనీలు ఫీడ్‌ రేట్లను గణనీయంగా పెంచుతున్నాయని ఆక్వా రైతులు పేర్కొన్నారు. కొద్ది నెలలుగా మేత ముడి పదార్థాలైన డీవోబి, మొక్కజొన్న, సోయా, చెక్క ధరలు తగ్గినా ఫీడ్‌ ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. అన్యాయంగా ధరలు తగ్గించిన ప్రాసెసింగ్‌ కంపెనీల ముందు ధర్నాలు చేయాలని, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకు అమ్మకూడదని ఆక్వా రైతు సంఘ నాయకులు పిలుపునిచ్చారు.  ఆక్వా మాఫియా తీరుతో ఏడాదిగా విసుగెత్తిపోయామని, త్వరలోనే భీమవరం రోడ్డుపైకి ఎక్కుతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement