ఇస్లాం వెలుగు
వారం రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా, జీవన విధానంగా చూస్తే శుక్రవారం (జుమా)ప్రాధాన్యత అత్యంత విశిష్టమైనది. సూర్యుడు ఉదయించే రోజుల్లోకెల్లా అత్యుత్తమమైన దినంగా దీనికి గుర్తింపు ఉంది.
ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం మానవాళికి, విశ్వానికి సంబంధించిన అనేక చారిత్రక ఘట్టాలు ఈ రోజుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ దినాన్ని ఆరాధనలకు, దైవ కారుణ్యాన్ని పొందడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు.
దైవప్రవక్త ప్రబోధించిన హదీసుల ప్రకారం మానవజాతికి మూలపురుషుడైన ఆది మానవుడు (ఆదం సృష్టించబడింది, ఆయనకు అత్యున్నతమైన స్థానం లభించింది ఈ శుక్రవారం రోజే. అంతేకాదు, మానవాళికి సన్మార్గం వైపు దృష్టి సారించడానికి, కయామత్ (ప్రళయ దినం) సంభవించడానికి కూడా ఈ రోజే వేదిక కానుంది. ఈ విశిష్టమైన విషయాలను గుర్తుచేసుకోవడం ద్వారా మానవుడు క్రమశిక్షణతో, సత్కార్యాలు చేస్తూ దైవ కారుణ్యాన్ని పొందాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
ఈ రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు (సున్నత్‌లు)
శుక్రవారం రోజున శారీరక శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతతకుప్రాధాన్యతనిచ్చేలా కొన్ని ఆచారాలు సూచించబడ్డాయి.
ఉదయపుప్రార్థనల్లో ప్రత్యేకత
శుక్రవారం ఉదయం చేసే ఫజ్ర్ నమాజులో ప్రవక్త ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.
స్నానం (గుస్ల్) పరిమళాలు
ఈ రోజున ్ర΄ûఢవయస్కులైన ప్రతి ఒక్కరూ శుభ్రంగా స్నానం చేయడం అత్యంత అవసరం. అలాగే మిస్వాక్ (దంతధావనం) ఉపయోగించడం, అందుబాటులో ఉన్న మంచి సుగంధ ద్రవ్యాలను (అత్తర్) ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఇది మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చి, ఆరాధనలో ఏకాగ్రతను పెంచుతుంది.
మసీదుకు త్వరగా వెళ్లడం
జుమాప్రార్థన కోసం మసీదుకు ముందే చేరుకోవడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఎవరు ఎంత త్వరగా మసీదుకు చేరుకుంటే అంత గొప్ప దానధర్మాలు చేసిన ఫలితం లభిస్తుందని కథనాలు
తెలుపుతున్నాయి.
ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా వినడం
ఇమామ్ ప్రసంగిస్తున్న సమయంలో అత్యంత నిశ్శబ్దంగా, శ్రద్ధగా వినాలి. ఆ సమయంలో పక్కవారితో మాట్లాడటం, చివరికి ‘అల్లరి చేయకు’ అని అనడం కూడా ఆ క్షణపు ఏకాగ్రతను పాడుచేస్తుందని హెచ్చరించారు.
ఆ ప్రత్యేకమైన ఘడియ
శుక్రవారం రోజున ఒక ప్రత్యేకమైన స్వల్ప సమయం ఉంటుంది. ఆ సమయంలో దైవాన్ని మనస్ఫూర్తిగా ఏ మంచి కోరిక కోరినా అది నెరవేరుతుందని, అల్లాహ్ తన దాసులప్రార్థనలను స్వీకరిస్తాడని ప్రవక్త తెలిపారు.
ప్రవక్తపై దరూద్ పంపడం
ఈ రోజున దైవప్రవక్తపై అధికంగా దరూద్ షరీఫ్ చదవడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి. భక్తులు పంపే ఈ దరూద్ ఆయనకు చేరవేయబడతాయని ఇస్లామిక్ గ్రంథాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం అనేది కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కాదు... మనలోని ప్రతికూల ఆలోచనలను వదిలి, శారీరకంగా, మానసికంగా దైవానికి దగ్గరయ్యే ఒక పవిత్రమైన సమయం. ప్రశాంతతను, పుణ్యఫలాలను ప్రసాదించే ఈ రోజును ప్రతి ఒక్కరూ సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక మార్గం.
– ముహమ్మద్ ముజాహిద్


