సందర్భం
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ నోటి నుంచి వచ్చిన మాట... ‘విజయం సాధించిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించవద్దు. విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి’ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అయితే చాలామంది సబ్రినా గొంజాలెజ్‌ను ‘నెక్ట్స్ ఐన్‌స్టీన్’ అంటున్నారు. సబ్రినా పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె ఐన్‌స్టీన్ కాకపోవచ్చు. అయితే విలువైన శాస్త్ర పరిశోధనలతో విలువైన వ్యక్తిగా మారడానికి మాత్రం ప్రయత్నిస్తోంది. అదే ఆమె విజయ రహస్యం...
ఆకాశమే హద్దుగా లక్ష్యాలను పెంచుకుంటూ పోయింది సబ్రినా గొంజాలెజ్. డ్రైవింగ్ చేయడానికి వయసు సరిపోకముందే తానే సింగిల్–ఇంజిన్ విమానాన్ని తయారుచేసుకొని ఒంటరిగా నడిపింది. ఇ–కామర్స్ దిగ్గజం జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ఆమెకు ఉద్యోగ ప్రతిపాదన చేసింది. బ్రౌన్ యూనివర్శిటీ ఇంకాస్త ముందుకు వెళ్లి 1.1 మిలియన్ డాలర్ల ప్యాకేజీతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ ఆఫర్ చేసింది. చాలామంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కలలు కనే ఆఫర్ అది. కానీ సబ్రిన మాత్రం ‘చాలామంది విద్యార్థుల’లాంటిది కాదు. అందుకే... అరుదైన ఆఫర్‌లకు నో చెప్పింది.
పన్నెండేళ్ల వయసులో విమానం తయారుచేసింది!
సబ్రినా తల్లి క్యూబన్–అమెరికన్. తండ్రి పోలిష్–అమెరికన్. ఇద్దరూ న్యాయవాదులే. షికాగోలో పెరిగిన సబ్రినాకు చిన్నప్పటి నుంచి విమానాలు అంటే చాలా ఇష్టం. పన్నెండేళ్ల వయసులోనే జెనిత్ సీహెచ్ 601 ఎక్స్‌ఎల్ అనే ఒక కిట్‌ను ఉపయోగించి నిజమైన సింగిల్–ఇంజిన్ విమానాన్ని తయారుచేసింది. దీనికి ఆమెకు రెండు సంవత్సరాలు పట్టింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ విమానాన్ని ఒంటరిగా నడిపింది.
అప్పుడే... ఆమె ప్రతిభ అర్థమైంది
‘ఇల్లినాయీస్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అకాడమీ’లో చదువుకున్న సబ్రినా, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో సెమీఫైనలిస్ట్ రౌండ్‌కు చేరుకుంది. నాసా కెన్నెడి స్పేస్ సెంటర్, బ్లూ ఆరిజిన్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఎంఐటీకి 2010లో దరఖాస్తు చేసినప్పుడు సబ్రినాను వెయింటింగ్ లిస్ట్‌లో ఉంచారు. కొంతకాలానికి ఆమె తయారుచేసిన విమానం వీడియోను చూశారు. వారికి ఆ అమ్మాయి ప్రతిభ బాగా అర్థమైంది. ఊహించిన విధంగానే ఎంఐటీ, భౌతికశాస్త్ర విభాగంలో 5.వో జీపీఏతో ప్రథమ స్థానంలో పట్టభద్రురాలైంది.
తొలి మహిళగా...
రెండు దశాబ్దాలు భౌతికశాస్త్ర విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన తొలి మహిళగా, యూనివర్శిటీలో వోర్లాఫ్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్న తొలి మహిళగా తన ప్రత్యేకత నిలుపుకున్న సబ్రిన 2019లో హార్వర్డ్‌లో పీహెచ్‌డీ చేసింది. హార్వర్డ్‌లో భౌతికశాస్త్రవేత్త ఆండ్రూ స్ట్రోమింగర్ ఆధ్వర్యంలో క్వాంటమ్ గురుత్వాకర్షణపై లోతైన పరిశోధన చేసింది. స్ట్రోమింగర్‌తో పాటు మరో భౌతికశాస్త్రవేత్త అలెగ్జాండర్ జిబోడవ్‌లతో కలిసి హార్వర్డ్ తరువాత ‘సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్స్’లో పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ కోసం వెళ్లింది. అక్కడ ఆమె చేసిన పరిశోధనలకు విశేషమైన గుర్తింపు వచ్చింది. అందులో ఒకటి...ఇన్‌ఫ్రారెడ్ ఫిజిక్స్‌ను ఇతర రంగాలకు విస్తరించడం.
నాసా ఆఫర్‌ను తిరస్కరించి...
ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలు తమ కంపెనీలలో పనిచేయడానికి సబ్రినాను సాదరంగా ఆహ్వానించాయి. నాసా కూడా సంప్రదించింది. కానీ ఆమె తిరస్కరించింది. ఇరవై ఏడేళ్ల వయసులో కెనడాలోని ‘పెరీమీటర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్’లో రిసెర్చ్ ఫ్యాకల్టీ మెంబర్‌గా చేరింది. అక్కడ ఆమె అతి పిన్న వయస్కురాలైన ఫ్యాకల్టి మెంబర్. స్పేస్ టైమ్‌ను క్వాంటమ్ సిద్ధాంతంతో ఏకం చేయడానికి కృషి చేసే ‘సెలేషియల్ హోలోగ్రఫీ ఇనిషియేటివ్’ అనే పరిశోధన కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించింది. సిమోన్స్ ఫౌండేషన్ ఈ పరిశోధనకు ఎనిమిది మిలియన్ డాలర్‌ల గ్రాంట్ మంజూరు చేసింది.
అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు!
సబ్రినాను చాలామంది ‘నెక్ట్స్ ఐన్‌స్టీన్’ అని పిలుస్తుంటారు. అయితే అలా పిలిపించుకోవడం సబ్రినాకు బొత్తిగా ఇష్టం లేదు. భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగినప్పుడు... ‘రాబోయే రెండు సంవత్సరాల్లో నేను ఏ సమస్యను పరిష్కరిస్తానో, పరిష్కరించనో కచ్చితంగా తెలియదు. దేనిపై పనిచేస్తానో కూడా తెలియదు. భౌతిక శాస్త్రంలో ఉండే విచిత్రం ఏమిటంటే... మనం కచ్చితంగా ఏంచేయబోతున్నామనేది తెలియదు!’ అంటుంది సబీనా.
ఎంత కష్టమైనా సరే...
ఎంత కష్టమైన పని అయినా సరే మనకు మనం సవాలు చేసుకోవాలి. అదే సమయంలో సానుకూల దృక్పథం ఉండాలి. నేను చేయలేనిది వేరెవరైనా చేస్తే...‘నేను మాత్రం ఎందుకు చేయలేను’ అనే పట్టుదల నాలో పెరుగుతుంది. ఇంట్లో ఉండి కూడా ఎవరైనా, ఏదైనా నేర్చుకునే కాలంలో ఉన్నాం మనం. కావాల్సిందల్లా ఆసక్తి మాత్రమే. కొందరు తమ ప్రతిభ, సామర్థ్యాలకు మించి అతి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటారు. ఇది సరికాదు. మనల్ని మనం విమర్శించుకోవడం తప్పు కాదు. అయితే సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
మన ప్రణాళికల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి సరైన సమయం, సందర్భం ఉండాలి. ఎవరికి ఏ విషయాలు తెలియాలి, తెలియకూడదు అనేదానిపై స్పష్టత ఉండాలి. నాకు వైవిధ్యం అంటే ఇష్టం. చలిగా ఉన్నప్పుడు మరింత కష్టపడి పనిచేస్తాను. ఎందుకంటే ఏదో ఒకరోజు మళ్లీ వెచ్చని వాతావరణం వస్తుందని నాకు తెలుసు. స్వతహాగా నాకు వెచ్చదనం అంటే ఇష్టం, వెచ్చదనం అంటే నాకు ఎంత ఇష్టమో గుర్తు తెచ్చుకోవడానికి చలి కూడా అవసరమని భావిస్తాను. నేను కేవలం స్టూడెంట్‌ను మాత్రమే. నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
– సబ్రినా గొంజాలెజ్


