వరి సాగుచేయొద్దు.. నీళ్లు ఇవ్వలేం..! | Collector clarified that farmers should not pin their hopes on irrigation water | Sakshi
Sakshi News home page

వరి సాగుచేయొద్దు.. నీళ్లు ఇవ్వలేం..!

Aug 6 2026 5:21 AM | Updated on Aug 6 2026 5:21 AM

Collector clarified that farmers should not pin their hopes on irrigation water

స్పష్టం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ 

వరి సాగుచేయకుంటే ఎలా బతకాలన్న రైతులు 

సాగునీరు ఇవ్వకపోతే పరిహారం ఇప్పించాలని నిలదీత 

పరిహారంపై హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయిన కలెక్టర్‌ 

కోడూరు:  ఖరీఫ్‌ సీజన్‌ ముమ్మరంగా సాగాల్సిన వేళ సాగునీటి సమస్యపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీని కలిసి వినతిపత్రం అందించిన రైతులకు ఊహించని సమాధానం ఎదురైంది. నీళ్లు ఇవ్వలేమని, రైతులు ఎవరూ వరి సాగు చేయవద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ బాలాజీ బుధవారం కోడూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్దకు వచ్చిన కలెక్టర్‌ను మండలానికి చెందిన పలువురు రైతులు, రైతు సంఘ నేతలు కలిసి కాలువలకు సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీరు పూర్తిగా తాగునీటి అవసరాలకూ సరిపోకపోవచ్చని, పంటలకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పారు. సాగునీటి కోసం రైతులు ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.   

కుటుంబాలను ఎలా పోషించాలి? 
కలెక్టర్‌ వ్యాఖ్యలతో తీవ్ర నిరాశకు గురైన రైతులు ‘వరి వేయుద్దని చెబుతున్నారు. సరే. మరి మా కుటుంబాలను ఏవిధంగా పోషించాలి?’ అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఒకవైపు కాలువల వద్ద పూజలు నిర్వహించి నీటి విడుదల కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రచారం చేస్తూ, మరోవైపు సాగునీరు ఇవ్వలేమని చెప్పడం ఏమిటని, ఇప్పటికే సాగు ప్రారంభించిన పంటల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రైతులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌ సమాధానం దాటవేశారు. 

వరికి ప్రత్యామ్నాయంగా పెసర, మినుము వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.  సాగునీరు అందించే పరిస్థితి లేకపోతే కనీసం పరిహారమైనా ప్రకటించాలని అన్నదాతలు కలెక్టర్‌ను కోరారు. అయితే పరిహారంపై కలెక్టర్‌ నోరు మెదపకుండా, స్పష్టమైన హామీ లేదా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతు సంఘ జిల్లా నేతలు ఆవుల బసవయ్య, రేపల్లె యోగప్రకాష్‌ ఉన్నారు.కలెక్టర్‌ రైతులతో మాట్లాడే సమయంలో వీడియోలు తీయవద్దంటూ విలేకరులకు సిబ్బంది హుకుం జారీ చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement