భారతీయతకు ప్రతీక | Symbol of Indian culture and heritage on National Handloom Day | Sakshi
Sakshi News home page

National Handloom Day: భారతీయతకు ప్రతీక

Aug 7 2026 11:48 AM | Updated on Aug 7 2026 12:09 PM

Symbol of Indian culture and heritage on National Handloom Day

నేడు జాతీయ చేనేత దినోత్సవం

మగ్గం చప్పుడు వినిపిస్తే అది కేవలం నూలుపోగులు అల్లే శబ్దం కాదు... ఒక కుటుంబం జీవన గీతం. ఒక గ్రామం ఆర్థిక స్పందన. ఒక నాగరికత ఊపిరి. సింధు లోయ నాగరికత తవ్వకాల్లో లభించిన ఆధారాలు భారతీయులు వేల ఏళ్ల కిందటే నూలు నేయడంలో నైపుణ్యం సంపాదించినట్లు చెబుతున్నాయి. కాలం మారినా చేనేత తన రూపాన్ని మాత్రమే మార్చుకుంది; తన ఆత్మను కాదు. ప్రతి అల్లికలో ఒక ప్రాంతపు సంస్కృతి, ప్రతి నమూనాలో ఒక సంప్రదాయం, ప్రతి వస్త్రంలో ఒక సమాజపు సృజనాత్మకత ప్రతిఫలిస్తూనే ఉంది. భారత చేనేత వైభవం దాని వైవిధ్యంలోనే కనిపిస్తుంది. ఉత్తరాన బెనారసీ, పష్మినా; దక్షి ణాన కాంచీపురం; తెలుగునాట గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ; తూర్పున బలుచారి, అస్సాం పట్టులు; పశ్చిమాన పటోలా... ప్రాంతం మారితే అల్లిక మారుతుంది, రంగు మారుతుంది, నమూనా మారుతుంది. కానీ ప్రతి వస్త్రంలోనూ భారతీయ సంస్కృతి సౌందర్యమే ప్రతిబింబిస్తుంది. అందుకేప్రపంచ వస్త్ర సంపదలో భారత చేనేతకు ప్రత్యేక గౌరవం దక్కింది.

దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక గ్రామీణ ఉపాధిని కల్పిస్తున్న రంగాల్లో ఇది ఇప్పటికీ ఒకటి. ఈ రంగంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. నూలు వడకడం నుంచి రంగులు వేయడం, అల్లిక, డిజైన్, విక్రయాల వరకు ప్రతి దశలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి చేనేతకేవలం ఉపాధి కాదు; ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ నిర్ణయాల్లో భాగస్వా మ్యానికి, ఆత్మవిశ్వాసానికి బలమైన ఆధారం. అందుకే గ్రామీణ మహిళా సాధికారతకు చేనేత ఒక మౌన విప్లవంగా నిలిచింది.

ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత

నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సంస్థలు సంప్రదాయం, సాంకేతికత, మార్కెట్‌ మధ్య వారధిగా నిలిచి నేతకార్మికులకు సాయం చేస్తున్నాయి. అయితే పవర్‌లూమ్‌ల పోటీ, చౌక దిగుమతులు, ముడి సరుకుల ధరల పెరుగుదల, మధ్యవర్తుల ఆధిపత్యం, మార్కెటింగ్‌ లోపాలు, డిజిటల్‌ వాణి జ్యంలో పరిమిత ప్రవేశం చేనేత రంగాన్ని ఇబ్బందులకు గురిచేయడం గమ నార్హం.  శ్రమకు తగిన ప్రతిఫలం దక్కని పరిస్థితుల్లో యువత ఈ వృత్తి వైపు ఆకర్షితులు కావడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి నేతను కాపాడాలి. దాన్ని కాపాడటం అంటే ఒక వృత్తిని రక్షించడం మాత్రమే కాదు; భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్నీ, లక్షలాది కుటుంబాల జీవనాధారాన్నీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనూ పరిరక్షించడం కూడా!
– వాడవల్లి శ్రీధర్‌ ‘ ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement