పాండురాజుకు మృగవధ వలన శాపం తగిలింది. ‘ఎవరికీ అపకారం చేయక, ప్రకృతి సహజమైన సుఖాన్ని పొందుతున్న సమయంలో, విచక్షణా రహితంగా మమ్ములను బాణహతికి గురిచేసావు. కాబట్టి నీవు కూడా నీ చివరి క్షణాలలో మావంటి బాధనే అనుభవించి మరణిస్తావు!’ అని శపించింది ఆ మృగమిథునం.
మృగమిథునం పాండురాజుకు ఇచ్చిన ఈ శాపంతో మహాభారత కథ రెండవ అతిపెద్ద మలుపు తిరిగింది. శంతనుడి రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టిన ఇద్దరు కొడుకులు– చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు– పుత్రహీనులుగా మరణించగా, వారి భార్యలైన అంబిక, అంబాలికలకు, దేవరన్యాయం పద్ధతిన వ్యాసమహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతానంగా కలగడం అన్నది మహాభారత కథలోఅంతకు ముందు చోటుచేసుకున్న మొదటి ముఖ్యమైన మలుపు.
అయితే ఆ ముగ్గరిలో రాజు కాగలిగి, రాజ్యాధికారం చేపట్టగలిగిన లక్షణాలున్న పాండురాజుకు, మృగమిథున శాపం తగిలి, తన భార్యలైన కుంతి, మాద్రిల ద్వారా తన సంతానాన్ని నేరుగా కురువంశానికి అందించలేకపోవడం అన్న విచిత్ర స్థితి దాపురించి, తన అంశతో సంతానాన్ని ఇవ్వగలగడం అన్నది విధివశాన లేకుండాపోయింది.
క. ఎట్టి విశిష్ట కులంబున
బుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్
గట్టిన కర్మఫలంబులు
నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్?
‘పూర్వం చేసిన దుష్కర్మల ఫలం వెంటాడుతుంది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ, అతడిని కొన్ని క్షణాలు విచక్షణను పోగొట్టుకునేలా చేసి, పాపకార్యం మళ్ళీ చేసేలా అది చేస్తుంది. అలా సంక్రమించిన పాపకార్య ఫలం ఒక జన్మలో కాకుంటే, ఆ తరువాత మరొక జన్మలో భోగింపక– అనగా అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతటి వానికైనా సాధ్యంకాదు’ అని పై సందర్భానికి అనుగుణంగా నన్నయ భట్టారకుడు ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వంలో సర్వకాలీనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూక్తీకరించి చెప్పాడు.
– భట్టు వెంకటరావు


