ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం | Essential Knowledge for Life-Saving Skills | Sakshi
Sakshi News home page

ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం

Sep 12 2026 12:59 AM | Updated on Sep 12 2026 12:59 AM

Essential Knowledge for Life-Saving Skills

నేడు ప్రథమ చికిత్స దినోత్సవం, ప్రథమ చికిత్స, 

అక్షర జ్ఞానం లేని వారి నుంచి పెద్ద చదువులు చదువుకున్న వారి వరకు... మనలో చాలామందికి అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స గురించి అవగాహన అంతంత మాత్రమే! పూర్తిగా వైద్యులపైనే ఆధారపడే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో  ప్రాథమిక వైద్యజ్ఞానం ఎప్పటికీ అవసరమే’ అని నాటినుంచి నేటి వరకు ఎన్నో తరాలకు గుర్తు చేస్తోంది ‘వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌’ పుస్తకం.‘వైద్యుడు లేని చోట’ (హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ) పేరుతో తెలుగు పాఠకులను కూడా పలకరించింది. వరల్డ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ డే సందర్భంగా ఆ పుస్తకం గురించి మరోసారి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ప్రథమ చికిత్స గురించి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, కిట్స్‌ ఇస్తున్న ‘ఎమర్‌ రెడీ’ స్వచ్ఛంద సంస్థ గురించి ఒకసారి...

‘వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌’ అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మాన్యువల్‌. మెక్సికోలో తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా డేవిడ్‌ వెర్నర్‌ 1970లో స్పానిష్‌ భాషలో రాసిన పుస్తకం... డోండే నో హే డాక్టర్‌. ఈ పుస్తకం వందకు పైగా భాషల్లోనికి అనువాదం అయింది. జీవశాస్త్రవేత్త అయిన వెర్నర్, మెక్సికోలోని గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల ఆరోగ్యం గురించి చాలా కాలం పనిచేశారు. ఎన్నో దేశాలలో ‘మార్పు కోసం ఆరోగ్య విద్య’ అనే అంశంపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కాలిఫోర్నియాలో ‘హెల్త్‌ రైట్స్‌’ సంస్థ కో–ఫౌండర్‌గా, బోస్టన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ హెల్త్‌లో అసోసియెట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు వెర్నర్‌.

ఎన్నో చిట్కాలు!
‘వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌’ పుస్తకం అతిసారం నుంచి మలేరియా వరకు ఎన్నో విషయాలను ప్రస్తావించింది. పరిశుభ్రత ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన ఆహారం, ఇంటి చిట్కాలు, ఇంటి చిట్కాలు పనిచేస్తాయో లేదో తెలుసుకునే మార్గాలు, టీకాల ప్రాధాన్యత, అనారోగ్యానికి కారణమయ్యే నమ్మకాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నమ్మకాలు, మేలు చేసే ఔషధ మొక్కలు, తరచుగా గందరగోళానికి గురిచేసే అనారోగ్య సమస్యలు, అంటువ్యాధి కాని వ్యాధులు, థర్మామీటర్‌ను ఎలా ఉపయోగించాలి? అనారోగ్యంతో ఉన్నవారిని ఎలా చూసుకోవాలి, ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు, వైద్యసహాయం ఎప్పుడు, ఎలా పొందాలి, మందులు లేకుండా చికిత్స చేసుకోవడం, నీటితో చికిత్స, మందుల వాడకానికి మార్గదర్శకాలు... ఇలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

స్పష్టంగా, సంక్షిప్తంగా, సులభంగా...
స్పష్టమైన, సంక్షిప్త సమాచారం ఈ పుస్తకం బలం. కామిక్‌ పుస్తకంలా చదవడానికి సులభంగా ఉంటుంది.  ప్రాథమిక వైద్యానికి సంబంధించి మీ నైపుణ్యం తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పరిమితులకు లోబడి పనిచేస్తే మంచి ఫలితాలు అందుతాయి. ఏం చేయలి, ఏం చేయకూడదు, అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అనవసరమైన రిస్క్‌ తీసుకోకండి. ఏమీ చేయకపోతే ప్రమాదం ఉందని అనిపించినప్పుడు మాత్రం మీకు గట్టిగా నమ్మకం ఉన్న పద్ధతిని అనుసరించడానికి వెనకాడకండి’ అంటుంది ఈ పుస్తకం.

ఎమర్జెన్సీలో ఎమర్‌ రెడీ
మూడు సంవత్సరాల క్రితం... ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతున్న ఒక వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ప్రచేతస్‌ యెరి అనే యువకుడు సహాయం కోసం కేకలు వేశాడు. 30 నిమిషాలకుగానీ అంబులెన్స్‌ రాలేదు. ఈ సంఘటన అతడిని ఒక వాస్తవాన్ని అర్థం చేసుకునేలా చేసింది. చాలామందికి అత్యవసర పరిస్థితులలో ఏంచేయాలో, ఏం చే యకూడదో తెలియదు. చాటా టెన్షన్‌ పడుతుంటారు. స్పృహ కోల్పోయిన వారికి చికిత్స చేయడం, సీపీఆర్, ఊపిరాడనప్పుడు సహాయం చేయడంలాంటి ప్రాథమిక చికిత్స పరిజ్ఞానం చాలామందిలో ఉండడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక చికిత్స పరిజ్ఞానాన్ని అందించే ‘ఎమర్‌ రెడీ’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టాడు ప్రచేతస్‌. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది.

శిక్షణ తరగతులలో...
‘పేద పిల్లలు అత్యవసర పరిస్థితులలో భయాందోళనలకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండేలా చేయడమే ఎమర్‌రెడీ లక్ష్యం’ అంటున్నాడు ప్రచేతస్‌. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఎమర్‌రెడీ. కథలు చెప్పడం నుంచి వీడియోలు ప్రదర్శించడం వరకు ఆసక్తికరమైన పద్దతులలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఎమర్‌రెడీ ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌ విధానానికి మంచి స్పందన వచ్చింది. గాయాలు, ఎముకలు విరగడం, స్పృహ కోల్పోవడం, పాము, తేలు కాటు... మొదలైన సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి శిక్షణ తరగతులలో వివరిస్తారు. భాషా అవరోధాలను అధిగమించడానికి ప్రాంతీయ భాషలలో శిక్షణ ఇస్తున్నారు.

పాఠ్యాంశాలలో ప్రథమ చికిత్స
బ్యాక్‌΄్యాక్‌లలో ఇమిడిపోయేంత చిన్నగా ఉండే, పదునైన వస్తువులు లేని, సురక్షితమైన కాంపాక్ట్‌ ప్రథమ చికిత్స కిట్లను పిల్లలకు ఇస్తారు. వీటిని పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ కిట్లు ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాయని ఉపాధ్యాయులు తెలియజేశారు. చిన్న అడుగులతో మొదలైన ‘ఎమర్‌రెడీ’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. ఐక్యరాజ్య సమితి ‘యూత్‌ యాక్టివేట్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రచేతస్‌ పాఠశాలల పాఠ్యాంశాలలో ప్రథమచికిత్సను తప్పనిసరి పాఠంగా చేర్చాలనే సూచించాడు.

భవిష్యత్‌ ప్రణాళిక
స్పృహ కోల్పోవడం, ఊపిరాడక పోవడం...ఇలాంటి పరిస్థితిలో సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందకపోవడం వల్ల ప్రాణహాని జరుగుతుంది. ‘అత్యవసర పరిస్థితులలో పిల్లలే ఆపద్భాందవులు. వైద్యుల సహాయం అందేలోపు బాధితులకు ప్రాణహాని తలెత్తకుండా చూడగలరు’ అంటుంది ఎమర్‌రెడీ.

‘ఎమర్‌ రెడీ’కి స్పష్టమైన భవిష్యత్‌ ప్రణాళిక ఉంది. దీని ప్రకారం... 
దేశవ్యాప్తంగా పాఠశాలలో ‘ఎమర్‌రెడీ’ కార్యక్రమాలను విస్తరించడం 
ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌–గైడెడ్‌ వీడియో ట్రైనింగ్‌ మాడ్యూల్స్‌ ప్రారంభించడం 
సెల్ఫ్‌–సస్టెయినింగ్‌ వాలంటీర్‌ నెట్‌వర్క్‌ను నిర్మించడం వంటివి ఇందులోని అంశాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement