ఎయిర్ ప్యూరిఫయర్ విలాసం కాదు.. ప్రాణావసరం
18 శాతం పన్నుపై తీవ్ర అసహనం
నిప్పులు చెరిగిన ఢిల్లీ హైకోర్టు
కేంద్రం, జీఎస్‌టీ కౌన్సిల్‌కు అక్షింతలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి పీల్చడమే గండంగా మారిన వేళ.. ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై, జీఎస్‌టీ కౌన్సిల్‌పై నిప్పులు చెరిగింది. గాలి నాణ్యత ‘అత్యంత ప్రమాదకర’ స్థాయికి పడిపోయి జనం విలవిల్లాడిపోతుంటే, ప్రాణాలను కాపాడే ‘ఎయిర్ ప్యూరిఫయర్ల’పై 18 శాతం పన్ను వసూలు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
బుధవారం జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఒక మనిషి రోజుకు సగటున 21 వేల సార్లు శ్వాసిస్తాడు. ఈ విషతుల్యమైన గాలిని ఇన్నిసార్లు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఏమవుతాయో ఆలోచించారా? అది మన అదుపులో లేని అనివార్య ప్రక్రియ’.. అని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో అధికారులు విఫలమయ్యారు.
కనీసం తాత్కాలికంగానైనా.. వారం లేదా నెల రోజులు ప్యూరిఫైయర్లపై పన్ను మినహాయింపు ఇవ్వలేరా? ఇదొక అత్యవసర పరిస్థితి అని గుర్తించండి’.. అని ఆదేశించింది. న్యాయవాది కపిల్ మదన్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఎయిర్ ప్యూరిఫయర్లు విలాసవంతమైన వస్తువులు కావు, అవి ప్రాణరక్షక పరికరాలు. ప్రస్తుతం వైద్య పరికరాలపై కేవలం 5 శాతం జీఎస్‌టీ ఉండగా, ఎయిర్ ప్యూరిఫయర్లపై మాత్రం 18 శాతం వసూలు చేస్తున్నారు. భారీ పన్నుల వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వీటిని కూడా వైద్య పరికరాల జాబితాలో చేర్చి పన్ను తగ్గించాలని కోరారు.
వీడియో కాన్ఫరెన్స్‌లోనైనా భేటీ అవ్వండి!
జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని కేంద్రం చెప్పగా, కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘పరిస్థితి తీవ్రతను బట్టి భౌతికంగా వీలు కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా వెంటనే సమావేశమై పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకోండి’.. అని స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని తెలియజేయడానికి డిసెంబర్ 26వ తేదీకి శుక్రవారం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.


