దైవాన్ని ప్రేమించాలంటే.. ముందు మనిషిని ప్రేమించాలా? | Humanity Is The True Meaning Of Religion | Sakshi
Sakshi News home page

దైవాన్ని ప్రేమించాలంటే.. ముందు మనిషిని ప్రేమించాలా?

Sep 11 2026 5:23 AM | Updated on Sep 11 2026 5:23 AM

Humanity Is The True Meaning Of Religion

సృష్టికర్త దృష్టిలో మనుషులందరూ ఒకే కుటుంబం. జాతి, వర్ణం, భాష, దేశం, సంపద అనే భేదాలు మనుషులు నిర్మించుకున్న కృత్రిమ గోడలే తప్ప గొప్పతనానికి కొలమానాలు కావు. నిజమైన శ్రేష్ఠత కేవలం సత్ప్రవర్తన, దైవభీతి, పరోపకారంలోనే ఉంది. దివ్య బోధనల్లో ద్వేషానికి తావులేదు, ప్రేమ ఉంది; అహంకారానికి ఆస్కారం లేదు, వినయం ఉంది. ఈ ఉదాత్తమైన సూత్రాలే ధార్మిక మానవతా దృక్పథానికి మూలస్తంభాలు.

ఈ మానవీయ దృక్పథానికి శిఖరాగ్రం ఏమిటంటే, ఒక నిరపరాధి ప్రాణాన్ని కాపాడటం సమస్త మానవాళిని రక్షించడంతో సమానమని చాటిచెప్పడమే. ధర్మం మనుషుల మధ్య గోడలు కట్టదు, హృదయాలను కలుపుతుంది. దేవుని ప్రేమను కోరుకునే హృదయమేదైనా మొదట సృష్టిని ప్రేమించడం నేర్చుకోవాలి. మానవత్వం లేని మతం ఊపిరి లేని శరీరమైతే, నైతిక మూల్యాలతో వికసించిన మానవత్వమే ఈ భూమిపై దైవకరుణకు సజీవ సాక్ష్యం.

ఈ సత్యం ఆచరణలోకి వచ్చినప్పుడే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం చేకూరుతుంది. అందుకే ధర్మం అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలకే పరిమితం కాదు; అది మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే జీవన విధానం. నిజమైన ధార్మికత మనిషిని కేవలం ఆరాధనలకే పరిమితం చేయదు; ఆకలితో ఉన్న వారిని, అనాథలను, బలహీనులను ఆడుకునేలా తీర్చిదిద్దుతుంది. స్వార్థానికి అతీతంగా, చివరకు తమకు వ్యతిరేకమైనా సరే న్యాయం వైపే నిలబడే సత్యసంధతను నూరిపోస్తుంది.
– ఎం.డి. ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement