విమానాశ్రయానికి మీ వాళ్లను సాగనంపడానికి వెళ్తున్నారా? టికెట్ లేకపోయినా ఇక విమానం గేట్ వరకు వెళ్లొచ్చా? 25 ఏళ్లుగా ఉన్న కఠిన భద్రతా నిబంధనల్లో అమెరికా ఇప్పుడు ఎందుకు మార్పులు చేస్తోంది? ఇప్పుడు చూద్దాం!
2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు పూర్తిగా మారిపోయాయి. టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే భద్రతా తనిఖీల తర్వాత గేట్ల వద్దకు అనుమతించడం, ద్రవ పదార్థాలపై ఆంక్షలు విధించడం వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు 9/11 ఘటనకు 25 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో.. ఈ నిబంధనల్లో కొన్నింటిని మళ్లీ మార్చే ప్రయత్నం జరుగుతోంది.
అమెరికా రవాణా భద్రతా సంస్థ (టీఎస్‌ఏ) త్వరలో టికెట్ లేని వ్యక్తులను కూడా భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుని విమానాశ్రయంలోని గేట్ వరకు వెళ్లేందుకు అనుమతించనుంది. దీంతో కుటుంబ సభ్యులను విమానం ఎక్కించేందుకు వెళ్లేవారు వారిని గేట్ వరకు సాగనంపవచ్చు. అలాగే విమాన ప్రయాణంలో మధ్యలో కొంతసేపు ఆగే సమయంలో స్నేహితులను కలవడం, విమానాశ్రయంలోని రెస్టారెంట్లు, దుకాణాలకు వెళ్లడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి.
అయితే ఈ సదుపాయం అందరికీ వెంటనే అందుబాటులోకి రాదు. టీఎస్‌ఏ ప్రీచెక్ లేదా నౌ ట్రావెలర్ నంబర్ ఉన్నవారికి తొలుత ఈ అవకాశం కల్పించనున్నారు. టికెట్ లేకుండా గేట్ వరకు వెళ్లాలనుకునే ప్రీచెక్ సభ్యులు తమ సందర్శనకు ఒకటి నుంచి మూడు రోజుల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలోని 13 విమానాశ్రయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీఎస్‌ఏ తెలిపింది.
మరో ఆసక్తికరమైన మార్పును కూడా అమెరికా పరిశీలిస్తోంది. అది ఏంటంటే? టీఎస్‌ఏ ప్రీచెక్ ప్రయాణికులకు నీటితో నింపిన బాటిళ్లను కూడా తీసుకెళ్లేందుకు అనుమతించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. 2006లో బ్రిటన్‌లో జరిగిన ఉగ్రదాడుల కుట్ర తర్వాత విమానాల్లో ద్రవ పదార్థాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే, కొందరు వ్యక్తులు శీతల పానీయాల బాటిళ్లలో ద్రవ రసాయనాలను దాచుకుని విమానాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అప్పట్లో గుర్తించారు.
ఇప్పుడు భద్రతా తనిఖీల్లో ఉపయోగించే సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని విమానయాన భద్రతా నిపుణుడు జెఫ్ ప్రైస్ చెబుతున్నారు. పాత ఎక్స్‌రే యంత్రాల స్థానంలో వస్తున్న కొత్త CT స్కానర్లు ద్రవ రూపంలోని పేలుడు పదార్థాలను కూడా మెరుగ్గా గుర్తించగలవని ఆయన తెలిపారు. అందువల్ల భద్రతా ప్రమాణాలను తగ్గించడం వల్ల కాకుండా.. కొత్త సాంకేతికతపై నమ్మకంతో కొన్ని పాత ఆంక్షలను సడలించే అవకాశం ఏర్పడుతోందని వివరించారు.
ఇటీవల అమెరికా విమానాశ్రయాల్లో మరో మార్పు కూడా జరిగింది. భద్రతా తనిఖీల సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా షూలు తొలగించాల్సిన నిబంధనను గత ఏడాది నుంచి తొలగించారు. ఈ మార్పులపై అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 9/11కు ముందు ఉన్న సాధారణ విమాన ప్రయాణ రోజులను గుర్తు చేసుకుంటున్న కొందరు ఈ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం భద్రతా నిబంధనలు సడలించడం వల్ల ప్రమాదం పెరుగుతుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలకమైన భద్రతా చర్యలను కొనసాగిస్తూ, ఆధునిక సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తే ప్రయాణికుల భద్రతకు రాజీ పడాల్సిన అవసరం ఉండదు.
ఇవి కూడా చదవండి: క్యాట్‌లో మంచి స్కోర్.. ఐనా సైన్యంలోకి! కానీ చివరికి..


