కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకినాడకు చెందిన షేక్ సాధిక్ ఖాన్ ఈ నేరానికి సంబంధించి పోలీసుల ప్రశ్నలకు వరుసగా రెండవరోజూ ఎప్పటిలాగే ‘తనకేం తెలియదు, తన తప్పేంలేదు’ అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ‘తప్పంతా జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యదే’ అంటూ ఆమెపై నెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మూడు రోజుల విచారణ నిమిత్తం సాధిక్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మొదటిరోజు మంగళవారం విచారణలో 60 ప్రశ్నలు సంధించిన పోలీసులు, బుధవారం రెండోరోజూ పలు కీలకమైన అంశాలపై 70 ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సీఐ గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో న్యాయవాది సమక్షంలో సాధిక్‌ను ప్రశ్నించారు. జగదీశ్వరరెడ్డి హత్యకుగాను సాధిక్‌కు సైనేడ్ ఎలా వచ్చిందనే కోణంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు సర్పవరం స్టేషన్‌కు రప్పించి సాధిక్ సమక్షంలో విచారించారు. ఈ క్రమంలో ఒకరు సైనేడ్ ఇచ్చిన విషయం ఒప్పుకున్నట్టు తెలిసింది.
ఉదయం విచారణలో అదనపు ఎస్పీ మహంతి కిశోర్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ముఖ్యంగా సౌజన్యతో పరిచయం ఎలా ఏర్పడింది, ఆమె భర్త జగదీశ్వరరెడ్డి హత్య, అందుకు వినియోగించిన రసాయనాలు, నూకరాజు కుటుంబానికి వేధింపులు, వారి ఆస్తులపై కన్ను, నకిలీ సర్టిఫికెట్లతో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వహణ తదితర అంశాలపై సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. సాధిక్ విచారణ కోసం మొదటి నుంచీ సేకరించిన ఆధారాలు, సూసైడ్ నోట్లలోని అంశాల ఆధారంగా సుమారు 200 ప్రశ్నలతో జాబితా సిద్ధం చేసుకున్న పోలీసులు ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు.



