బహుశా దేశంలో ఎక్కడా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితి ఉండదేమో! గొడ్డలి పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటూ విమర్శలు చేసుకునే రాజకీయం ఏపీలో సాగుతోంది. దీనికి 50 ఏళ్ల రాజకీయ చరిత్రతో , సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాన కారణం కావడం అత్యంత శోచనీయం. అంతేకాదు.. తనది పొలిటికల్ గవర్నెన్స్, అంటే రాజకీయ పాలన అని బహిరంగంగా చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈయనే కావచ్చు. ఆయనే చంద్రబాబు నాయుడు. వయసు రీత్యా కూడా ఆయన ఏపీలో ఉన్న రాజకీయవేత్తలలోకల్లా పెద్దవారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ సమయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విన్యాసాలు ఏపీ సమాజానికి ఎంత ప్రయోజనం అన్న ప్రశ్న వస్తుంది. పోనీ ఆయన చెప్పే విషయాలలో నిజాలు ఉంటే అదో రకం. సత్యాసత్యాలతో నిమిత్తం లేకుండా ఆయన మాట్లాడేస్తుంటారు. దీనిని బట్టి ఆయన ఏదో టెన్షన్ లోనో, లేక ఫ్రస్టేషన్ లోనో ఉన్నారేమో అన్న భావన పలువురిలో కలుగుతుంది.
పైకి అభివృద్దిలో ప్రజాప్రతినిధుల పాత్ర, విజన్ అంటూ మాటలు చెబుతూ, ఆచరణలో ప్రత్యర్ధి పార్టీల మద్దతుదారులకు వారికి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం చేయకపోవడం రాజకీయ పాలన అన్నమాట. అలాగే ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ నేతలు వ్యవస్థలపై పెత్తనం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడినా ఎవరూ నోరెత్తకపోవడం అన్నమాట. ఇది సరైన విధానమేనా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచకాలు చేసిన సంగతి ప్రజలు మర్చిపోతారా? ఈ సారి పేరు మార్చి పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రజలను పీడిస్తుంటే గమనించలేరా!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఇప్పటికి పదిహేనేళ్లుగా రాజకీయాలలో ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉంది. ఆ పార్టీ ఇప్పుడు సడన్ గా గొడ్డలి పార్టీ ఎలా అయింది.అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఉదహరిస్తారు. దానిని జగన్‌కు ఆపాదించాలని విశ్వయత్నం చేస్తుంటారు. ఇందులో నిజం ఏమిటి? అసలు జగన్‌కు ఆ కేసుతో సంబంధం లేదని సీబీఐ విచారణలో నిర్ధారణ అయిన తర్వాత కూడా చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారో అర్ధం కాదు.
ఈ కేసులో స్వయంగా గొడ్డలితో నరికానని చెప్పిన ఒక నిందితుడికి పరోక్షంగా టీడీపీ ఎందుకు మద్దతు ఇస్తోంది? అంటే అప్పుడు గొడ్డలి పార్టీ అని దేనిని అనాలి? అతనికి టీడీపీ తరపున వాదించే లాయర్ ఎందుకు పనిచేస్తున్నారు? అలాగే వివేకా కుమార్తె సునీత ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ఆమెకు కూడా టీడీపీ సహకారం ఎందుకు ఇస్తోంది? పైగా వివేకా హత్య కేసు జరిగింది 2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కదా! అప్పటి పోలీసు అధికారులు ఎందుకు జగన్‌పై అభియోగాలు మోపలేకపోయారు? అప్పటి సిట్ నివేదిక ఏమి చెబుతోంది?
ఇవన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ఐదేళ్ల తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడడం ద్వారా తన స్థాయిని తాను తగ్గించుకున్నట్లు అనిపించదా! పోనీ మరికొన్ని ఇతర హత్య కేసులు చూస్తే ఎందరు టీడీపీవారు అందులో భాగస్వాములుగా ఉన్నరన్న అభియోగాలు ఎన్ని ఉన్నాయి? ఉదాహరణకు వంగవీటి రంగా హత్య కేసులో నిందితులు టీడీపీ వారా, కారా? వారిలో కొందరు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు? స్వయంగా రంగా కుమారుడు గతంలో ఏ ఆరోపణ చేసింది గుర్తు లేదా? అంతెందుకు కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలు ఎన్ని? ఉదాహరణకు వినుకొండలో రషీద్ హత్య, పల్నాడులో సాల్మన్ హత్య.. ఇలా పలు ఘటనలలో నిందితులు టీడీపీవారే కదా! మరి టీడీపీ గొడ్డలి పార్టీ లేక కత్తుల పార్టీ అవుతుందా?
కొన్నాళ్లపాటు వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదు. కొన్నిసార్లు మాత్రం జవాబు ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీని బూడిద పార్టీ అని అంటే, మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ తడిగుడ్డలతో గొంతు కోసే పార్టీ అని అన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ అనే నిందితుడిని చిత్రహింసలు పెట్టడంతో చనిపోయాడు. తదుపరి అతని బూడిద కూడా లేకుండా చేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుని వారు ఈ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత టిడిపికి వెన్నుపోటు పార్టీ అని నామకరణం చేసి అలాగే పిలవడం ఆరంభించారు. జగన్ కూడా మీడియా సమావేశాలలో అదే పేరుతో సంబోధిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అనడానికి ఆధారాలు లేవు కాని, టీడీపీని వెన్నుపోటు పార్టీ అనడానికి అవసరమైన అన్ని ప్రాతిపదికలు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయంగా చంద్రబాబును ఆయన మామగారైన ఎన్.టి.రామారావే ఏ వ్యాఖ్యలు చేసింది వారు ప్రస్తావిస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన ఘట్టాన్ని ఉదహరిస్తున్నారు. ఆయా ఎన్నికలలో ఎన్నిరకాల హామీలు ఇచ్చి, వాటిని ఎగవేయడం ద్వారా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు కూడా చేస్తున్నారు. 2014 లో ఇచ్చిన హామీలనే కాకుండా, 2024 లో ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 రూపాయల ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి ఇస్తామని తెలిపారు. బీసీలతో సహా బలహీనవర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ ఇచ్చారు.
ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి, వాటిని ఎగవేయడం ఆయా వర్గాలను వెన్నుపోటు పొడిచినట్లేనని వైఎస్సార్‌సీపీ నేతల విమర్శ. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి టీడీపీలో ఉండదు. కాకపోతే తమ మీడియా బలంతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింప చేసే యత్నం జరగవచ్చు. కాని వాటిని ఎల్లవేళలా నమ్మరు కదా! ఇంతకుముందు వైఎస్సార్‌సీపీవారు తెలుగుదేశం పార్టీని పేరు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శలు చేసేవారేమో! కాని చంద్రబాబు వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తుండడంతో, జగన్ తో సహా పార్టీ నేతలంతా టీడీపీని వెన్నుపోటు పార్టీ అని పిలుస్తున్నారు. చిత్రమేమిటంటే చంద్రబాబు తాము క్రిమినల్స్‌తో పోరాటం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి మీడియా సమావేశాలలో అంటారు. తీరా చూస్తే ఏపీలో అత్యధికంగా 79 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్స్ కేసులు ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేలే 164 మంది ఉన్నారు కదా! అంతేకాదు.. చంద్రబాబుపైనే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది.
జగన్ వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారట. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించిన తర్వాత కేసులు వచ్చాయే తప్ప ముందు కాదు కదా! ఆ కేసులు పెట్టడానికి కాంగ్రెస్‌తో కలిసింది తెలుగుదేశం పార్టీనే కదా ! పారిశ్రామికవేత్త జిందాల్‌పై కేసు పెట్టాలని యత్నించి కూటమి సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది. నటి జత్వాని కేసులో ఐపీఎస్‌లపై తప్పుడు కేసులు పెట్టినట్లు సర్కారే అంగీకరించింది కదా! మరి స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుతో పాటు కొందరు అధికారులు అరెస్టు అయ్యారు కదా! దాని గురించి ఏమి చెబుతారు! అనవసరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే టీడీపీ కార్యకర్తలు నమ్మినట్లు నటిస్తారేమో కాని, వారికి కూడా అసలు విషయాలు తెలియకుండా ఉంటాయా? ఏది ఏమైనా చంద్రబాబు తన హోదాకు తగిన రీతిలో హుందాగా వ్యవహరించి, సరైన పద్దతిలో ప్రసంగాలు చేయకపోతే ఆంధ్ర సమాజానికి తీరని నష్టం చేసిన వారవుతారేమో!

కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


