దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్‌ జగన్‌ | AP DSC Scam: YS Jagan Questions 7 Round Verification | Sakshi
Sakshi News home page

దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్‌ జగన్‌

Sep 10 2026 12:29 PM | Updated on Sep 10 2026 12:38 PM

AP DSC Scam: YS Jagan Questions 7 Round Verification

సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్‌ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్‌అప్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్‌ పాస్‌ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) కీలకంగా వ్యవహరించిందన్నారు.

యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్‌లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌ స్పష్టం చేసిందని జగన్‌ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్‌జోన్‌ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్‌గా తేలిందని ఆయన చెప్పారు.

ఈడిగ ప్రభాకర్‌ వ్యవహారాన్ని కూడా జగన్‌ ప్రస్తావించారు. ఆయన టెట్‌కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్‌ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్‌ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్‌అప్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్‌ కూడా బోగస్‌ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement