సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.
డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్‌కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్‌ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్‌లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు.
స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్‌మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు.



